Wednesday 7 February 2024

మంచికిపోతే (08-Feb-24, Enlightenment Story)

మంచికిపోతే

🌺🍀🌺🍀🌺

ఒకప్పుడు నలుగురు దొంగలు ఉండేవారు. ఒకసారి ఈ దొంగలు ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేశారు. డబ్బు, నగలు పంచుకున్నారు. వాటితో పాటు ఒక రత్నం కూడా ఉన్నది. ఆ రత్నం ఎలా పంచుకోవాలో బోధపడలేదు.

‘నాకు కావాలి అంటే నాకు కావాలి’ అని నలుగురూ వాదులాడుకున్నారు.


“ప్రస్తుతం మన దగ్గర ఉన్న సొమ్ముతో కొన్నాళ్ళు గడుపుదాం. డబ్బు అవసరమైన ప్పుడు చూసుకోవచ్చు. అందాక ఈ రత్నాన్ని ఎవరైనా నమ్మకస్తుడి దగ్గర దాచిపెడదాం!” అని ఒకడు ఉపాయం చెప్పాడు.  పేదరాశి పెద్దమ్మ అంటే మంచితనం, పరోపకార బుద్ధి ఉంటుంది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్లారు. నలుగురు రాగానే పెద్దమ్మ వారిని సాదరంగా ఆహ్వానించింది.

“పెద్దమ్మా! మేము పొరుగూరు వెళుతున్నాం. ఒకరోజు ఇక్కడ ఉండనిస్తావా!” అని అడిగారు దొంగలు.
“అలాగే బాబూ” అంది ఆమె. ఆ నలుగురు పెద్దమ్మ దగ్గర ఉండి, వెళ్లిపోయేటప్పుడు ఆమె చేతికి రత్నాన్ని దాచిన సంచి ఇచ్చి “పెద్దమ్మా! మేము తిరుగుప్రయాణంలో వచ్చి తీసుకుంటాము. అందాకా ఈ సంచి నీ దగ్గర భద్రంగా దాచి ఉంచు. మేము నలుగురూ కలిసి వచ్చి అడిగితేనే ఇవ్వు!” అని చెప్పారు.

“అలాగే బాబూ! మీరు నిశ్చింతగా వెళ్లిరండి!” అని పెద్దమ్మ ఆ సంచిని భోషాణంలో దాచింది. దొంగలు వెళ్లిపోయారు.   ఆ నలుగురిలో ఒకడికి ఎలాగైనా ఆ రత్నాన్ని తను ఒక్కడే దక్కించుకోవాలని ఆశ పుట్టింది. నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూనే ఉపాయాలు అన్వేషించసాగాడు.

కొన్నాళ్ళు గడిచిపోయాయి. దొంగల దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్లి, దాచిన రత్నాన్ని తెచ్చుకుని అమ్ముకుందామని అనుకున్నారు. పెద్దమ్మ ఇంటికి వెళ్లారు. నడిచీ నడిచీ బడలికతో ఇంటి ముందు  కూలబడ్డారు. “ఒరే! నువ్వు ఇంట్లోకి వెళ్లి సంచి తీసుకురా!” అన్నారు అలసటగా.

రత్నం తను ఒక్కడే దక్కించుకోవాలని ఆలోచిస్తున్న దొంగకి ఇది మంచి అవకాశంలా అనిపించింది.
“మీరు విశ్రాంతి తీసుకోండి. నేను తీసుకువస్తాను!” అని లోపలికి వెళ్లి పేదరాశి పెద్దమ్మ దాచి ఉంచిన సంచి ఇవ్వమని అడిగాడు.

“ఏం బాబులూ! సంచి ఇవ్వమంటారా?” పెద్దమ్మ లోపలి నుంచి కేకేసింది.
“ఇవ్వు పెద్దమ్మా” అన్నారు వాళ్లు.

పెద్దమ్మ సరేనని భోషాణంలో దాచి ఉంచిన సంచి నాలుగవ వాడికి ఇచ్చింది. వాడు ఆ సంచిని తీసుకొని ఇంకో ద్వారం గుండా ఉడాయించాడు. ఎంతసేపు ఎదురుచూసినా లోపలి నుంచి నాలుగవవాడు రాకపోయేసరికి వాకిట్లో కూర్చున్న ముగ్గురూ  ఇంట్లోకి వచ్చి పెద్దమ్మను అడిగారు.“అందులో విలువైన రత్నం ఉంది. నువ్వు పోగొట్టావు కనుక నువ్వే ఇవ్వాలి!”  పెద్దమ్మతో అన్నారు ముగ్గురు.

“భగవంతుడి సాక్షిగా అందులో ఏముందో చూడలేదు. ఇచ్చింది ఇచ్చినట్లు దాచాను.”  పెద్దమ్మ లబోదిబో అంది.
“అదేమీ కుదరదు. రాజుగారి దగ్గరకు పద!” అంటూ ముగ్గురూ పెద్దమ్మని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు.

“ఒప్పందం ప్రకారం నలుగురు వస్తేనే సంచి ఇవ్వాలి. కానీ ఒక్కడే వస్తే ఇచ్చావు. వాడు, నీవు లాలూచీ పడ్డారేమో! కాబట్టి...ఇది నీ తప్పే, నువ్వు రత్నం ఇవ్వాల్సిందే!” అన్నాడు రాజు పెద్దమ్మతో. “మహారాజా! బాటసారులకు ఇంత ఉడకేసి పెట్టి వారు ఇచ్చిన దానితో పొట్టపోసుకుంటున్నాను. అంత విలువైనది నేనెక్కడి నుంచి తీసుకురాను!” అంటూ కాళ్లావేళ్లా పడింది పెద్దమ్మ.

“నాలుగు రోజులు వ్యవధి ఇస్తున్నాను. తెచ్చివ్వకపోతే నీకు జీవితాంతం కారాగారం తప్పదు!” అని హెచ్చరించాడు రాజు. చేసేదేమి లేక ఏడుస్తూ ఇంటిదారి పట్టింది పెద్దమ్మ. రెండు రోజుల తరువాత ఒక యువకుడు పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు. “పెద్దమ్మా...ఎందుకు అలా విచారంగా ఉన్నావు?” అని అడిగాడు. జరిగిందంతా అతనికి చెప్పింది పెద్దమ్మ.

“రేపు రాజుగారి దగ్గరకు నన్ను తీసుకెళ్లు. నీ మనవడినని పరిచయం చెయ్యి!” అన్నాడా యువకుడు. ఆ మరునాడు “రత్నం తీసుకొచ్చావా?”అని అడిగాడు రాజు.

“చిత్తం మహారాజా! తీసుకు వచ్చాను!” అని దొంగల వైపు తిరిగి “మీ రత్నం మీకు ఇవ్వడం న్యాయం. ఎప్పుడూ? నలుగురూ కలసి వచ్చినప్పుడు. నలుగురు కలిసి రండి, అప్పుడు మీ రత్నం మీకు ఇచ్చేస్తాం” అన్నాడు యువకుడు.

సభలోని వారందరూ కరతాళధ్వనులు చేశారు.“నిజమే! నలుగురూ కలిసి రండి. వెళ్లండి!” అజ్ఞాపించాడు రాజు.
దొంగల ముఖాలు వెలవెలా పోయాయి. తల వంచుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు.

మంచిపని చేయబోయిన వారిని కష్టాలు పెడితే మంచి చేయడానికి ఎవరూ ముందుకురారు. నా తప్పు తెలుసుకున్నాను. నిరపరాధి అయిన పెద్దమ్మను వదిలేస్తున్నాను. సమస్యను యుక్తిగా పరిష్కరించిన ఈ యువకుడిని నా ఆస్థానంలో న్యాయాధికారిగా నియమిస్తున్నాను!” అన్నాడు రాజు.`


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...