Thursday 18 April 2024

నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు... నన్ను వెంటాడుతూనే ఉన్నయ్ (19-Apr-24, Enlightenment Story)

 `నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు... నన్ను వెంటాడుతూనే ఉన్నయ్...`*

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

నాన్న వయస్సు పెరిగేకొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది. గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది.తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి.

నా భార్యకు అది చిరాకు తరచూ నాతో చెబుతోంది. గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లయింట్…ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు.అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద.


నా భార్య నామీద అరిచింది. నేనూ సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను.నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను.గాయపడ్డట్టుగా తన కళ్లు.నావైపు అదోలా చూశాడు.నాకే సిగ్గనిపించింది.ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు.

ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను. ఓరోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. మంచం మీద పడిపోయాడు.తరువాత కొన్నాళ్లకే కన్నుమూశాడు.నాలో అదే దోషభావన.ఆరోజు తను నావైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది.నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా.

కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం. పెయింటర్స్ వచ్చారు.తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు అరిచాడు

ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్ కూడా. మీ తాత చేతిముద్రలు చెరిగిపోకుండా చూస్తాం, వాటి చుట్టూ సర్కిళ్లు గీసి, డిజైన్లు వేసి, ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం సరేనా అని సముదాయించారు…*

అలాగే చేశారు.ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం.ఆ డిజైన్‌ను మా ఇంటికొచ్చినవాళ్లు అభినందించేవాళ్లు.వాళ్లకు అసలు కథ తెలియదు.తెలిస్తే నన్ను ఎంత అసహ్యించుకునేవాళ్లో

కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది.నాకూ వయస్సు మీద పడింది.శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు.నాకిప్పుడు అదే గోడ ఆసరా కావల్సి వస్తోంది.నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది*

ఎందుకనిపించిందో తెలియదు, గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను.ఓరోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు, నా భుజాలు పట్టుకున్నాడు… గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతవ్ అని మందలించాడు.

మనవరాలు వచ్చింది, నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాతా అంది ప్రేమగా, నాలో దుఖం పొంగుకొచ్చింది. అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు, అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు. నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవాడు కదా అనే బాధ.

నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది.తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది.గదిలోని గోడ మీద నాన్న చేతిముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్‌‌లో గీసింది.టీచర్ బాగా అభినందించిందని చెప్పింది.పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి’ అని రాసిందామె ఆ స్కెచ్ మీద.

నా గదిలోకి వచ్చి పడుకున్నాను.మౌనంగా రోదిస్తున్నాను.నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది, ఏమో తరువాత ఏమైందో నాకు తెలియదు.నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అధర్మం – అనారోగ్యం (18-Apr-24, Enlightenment Story)

 అధర్మం – అనారోగ్యం

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

రెండు కిడ్నీలు పనిచెయ్యడం లేదు. బ్రతకడం చాలా కష్టం. చాలా మంది నిపుణుల వద్ద చూపించుకున్నాడు. ఎంతో ధనం ఖర్చు చేశాడు, వాళ్ళు చెప్పిన మందులన్నీ వాడాడు. కాని ఏమి ఉపయోగం లేదు.

అతను మహాస్వామి వారి వద్దకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. మామూలుగా అటువంటి బాధలతో వచ్చే వారిపై స్వామివారు చాలా కరుణ దయ చూపిస్తారు. వారితో ఎంతో అనునయంగా మాట్లాడుతారు. కాని ఆరోజు స్వామివారు తమ పలుకుల్లో కొంచం కాఠిన్యం వహించారు.




”మనుషులు లెక్కలేనన్ని తప్పులు, అధార్మికమైన పనులు చేసి వాటికి ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇక్కడకు వస్తారు. వారు చేసిన తప్పులను మాత్రం తెలుసుకోరు. అందుకు నేనేమి చెయ్యగలను?” అని అన్నారు.

హఠాత్తుగా ఎందుకు మహాస్వామివారు ఇలా అంటున్నారో ఎవరికి అర్థం కావడంలేదు.

కొద్దిసేపటి తరువాత పరమాచార్య స్వామివారు మాట్లాడుతూ, “ఇతని పూర్వీకులు ధర్మాచరణకోసం, మంచిపనులు చెయ్యడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అందుకోసం మంచి ఆదాయం వచ్చే భూమిని వదిలివెళ్ళారు. మంచినీటి బావులు తవ్వించడం కోసం, ధార్మికమైన పనులకోసం ఈ పని చేశారు. కాని ఇతను ఆ భూమిని అమ్మి వచ్చిన ధనాన్నంతా దాచుకున్నాడు” అని అన్నారు.

కిడ్నీ సమస్యతో వచ్చిన ఆ వ్యక్తి ఇదంతా విని తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. “ఇప్పటినుండి నేను కూడా మంచినీటి బావులు తవ్వించి ధార్మికమైన పనులు చేస్తాను. నన్ను మన్నించి అనుగ్రహించండి పెరియవ” అని వేడుకున్నాడు.

మహాస్వామివారు వెంటనే కరుణాసముద్రులై “వసంబు(వస) తెలుసా నీకు? మూలికలు అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. దాన్ని బాగా నూరి రోజూ కడుపుకింది భాగంలో పూయి” అని సెలవిచ్చారు.

పది పన్నెండు రోజుల తరువాత అతను మరలా వచ్చాడు. మహాస్వామివారు అడగక ముందే అతను స్వామివారితో, ”ఇప్పుడు ఏ బాధా లేదు” అని చెప్పాడు.

ధన్వంతరీ స్వరూపమైన ఆ సర్వేశ్వరుడే మందిచ్చిన తరువాత ఇంకా ఆ జబ్బు ఉంటుందా? అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం. శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం .



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday 16 April 2024

శ్రీరామ నవమి విశిష్టత (17-Apr-24, Enlightenment Story)

 *శ్రీరామ నవమి విశిష్టత*

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.

శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు.



శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి. 
ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారుఅలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి.

శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన *పుత్రకామేష్టి యాగ* ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.

రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి.

శ్రీ రామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి.

శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి.

అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.

Srirama Navami Special:

శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది.

నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.

శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు.

పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️


Monday 15 April 2024

నీకంటూ ఒకరు (16-Apr-24, Enlightenment Story)

నీకంటూ ఒకరు!

🌺🍀🌺🍀🌺

ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని గురించి శ్రద్ధగా, సానుభూతిగా వినే ఒక్కరైనా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద దురదృష్టం. మన సంతోషాన్ని పంచుకునేవారుంటారు. కానీ మన కష్టాన్ని పంచుకోవడానికి, కన్నీళ్లను తుడిచిపోవడానికి ఎవరు ముందుకొస్తారు? మనం నవ్వుల్ని తోటివారితో ప్రకృతితో పంచుకుంటాం. కానీ మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు? దాన్ని పంచుకోవాలంటే అవతలి మనిషికి మధుర హృదయం ఉండాలి. మానవీయ కోణం ఉండాలి. తన హృదయపు పొరల పూలరేకులతో అవతలివారి గాయపడిన గుండెను పదిలంగా పొదువుకుని, గాయాల మరకలను తుడిచి మాధుర్యపు మందులను వేసి, చిరునవ్వుల మృదుగాయంతో సేద తీర్చే ఔషధీయ హృదయం ఉండాలి. ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు. ధనం అగత్యం లేదు. మంచి మనసు ఉండాలి. అవతలివారి గాయాన్ని తనదిగా భావించే స్పందించే మనసు ఉండాలి.


అలాంటి ఒకరు మనకుంటే మన కన్నీరు పన్నీరు అవుతుంది. కష్టం కూడా ఇష్టం అవుతుంది. శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టం లేకపోలేదు. కన్నీరు రాకపోలేదు. నిజానికి అవన్నీ వాళ్లకు ఎక్కువ. కానీ అంత ప్రియమైన స్నేహితుడు ఉన్నాక, అంత మృదువుగా కన్నీరు తుడిచే సహచరుడు ఉన్నాక, అంతగా కష్టం పంచుకునే ఆత్మీయుడు మనకంటూ ఉన్నాక- కన్నీరు కాటు వేయగలదా, కష్టం వేటువేయగలదా, కారు మేఘం కూడా మధురమైన నాట్యం చేయదా? స్నేహాన్ని వెన్నలా పంచుకు తిన్న శ్రీకృష్ణుడు, అటుకుల్ని అమృతంలా ఆరగించిన శ్రీకృష్ణుడు స్నేహితులు, సన్నిహితులు, సహచరుల దుఃఖ బాష్పాల్ని ఆనంద బాష్పాలుగా మార్చకుండా వదులుతాడా, వదలగలడా? పెనుతుపానును గోవర్ధనగిరి కింద ఆటవిడుపు విహారంగా మలచకుండా ఉంటాడా? రహస్యం కళ్లలో, కన్నీళ్లలో లేదు. వాటిని తుడిచే ఆ అమృతహస్తంలో ఉంది. కష్టంలో, దాని పరిణామాల్లో లేదు. వాటిని కమనీయంగా మలచే ఆ హృదయపు సొంపులో ఉంది. శిల ఏదైనా శిలే. దాన్ని శిల్పంగా మలచే నేర్పు శిల్పిలో ఉండాలి. పాపాయిగానా, యువతిగానా, రాజుగానా, సర్పంగానా, సర్వేశ్వరుడిగానా... అదంతా శిల్పి నేర్పు, ఓర్పు. మన కన్నీళ్ల్లకు అర్థాన్ని మార్చే నేర్పు వాటిని తుడిచే వేళ్లకుండాలి.*

ఏది ఏమైనా కన్నీళ్లకు తుడిచే ఒక అమృతహస్తం కావాలి. నీకు నేనున్నానంటూ ఆ కన్నీళ్లకు అమృత బిందువులుగా మార్చే కమనీయ హృదయం కావాలి. ఆ హస్తం మనదే అయితే... అలాంటి హృదయం మనకే ఉంటే... మనమే ఆ శ్రీకృష్ణుడైతే? మన ఇంటికప్పు గోవర్ధనగిరిగా మారదా? మారుతుంది! ఎవరికి ఏం సాయం చేయాలన్నా మనకు ధనం అవసరం లేదు. బలం అవసరం లేదు. మనం... ప్రేమించే హృదయం అయిపోవాలి. మన వేళ్లు కన్నీళ్లను తుడిచే తామర రేకులుగా మారాలి. మాటలు మకరందపు బిందువులుగా జాలువారాలి. లోకంలో ఏ ఒకరికైనా నీకు నేనున్నానంటూ నిలబడగలిగితే లోకమే తోడుగా మన పక్కన నిలబడదా? మన వెనక నడిచిరాదా? ఒక్కరు కోటిమందిగా మనకు గొడుగు పట్టరా? ప్రేమంటే హృదయానికి ప్రణమిల్లని మనిషి ఉండడు. కన్నీరు తుడిచే చేతికి అంత విలువ ఉంది. అంత శక్తి ఉంది. మనమూ ఆ ‘ఒకరం’ అవుదాం. కన్నీరు తుడుద్దాం. కన్నీరు కార్చేవారు లక్షలమంది ఉంటారు. కానీ, ఆ కన్నీళ్లను తుడిచే చేతులు కోటిలో ఒకరికే ఉంటాయి. శ్రీకృష్ణుడు జీవితమంతా కష్టాలు ఎదురుదెబ్బలతో సహవాసం చేసినా ఏ ఒక్కరోజూ ఆ భావంతో బాధపడిన దాఖలాల్లేవు. ఎవరి సహాయాన్ని, సానుభూతిని కోరిన రుజువుల్లేవు. ఎందుకంటే- ఇతరుల కన్నీటిని తుడవడంలోని సాటిలేని ఆనందాన్ని తెలిసిన ‘శ్రీకృష్ణుడు’ ఆయన.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Sunday 14 April 2024

శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, 3 దోషములు (15-Apr-24, Enlightenment Story)

శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, 3 దోషములు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

*మనసా...వాచా...కర్మణా... అంటే!!!*

ఒకసారి శ్రీ ఆది శంకరాచార్యుల వారు, శిష్యులతో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు. గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట...*నేను 3 దోషములు/పాపములను చేశాను, నన్ను క్షమించండి ” అని ప్రాధేయ పడ్డారు.*

*ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపములు చేశారో ప్రాయశ్చిత్త పడుతున్నారు?” అని అనుకున్నారు.*

ఒక శిష్యుడు, ఏమిటి ఆపాపము నేను తెలుసుకోవాలి అని, ఆచార్యుల వారిని అడిగాడు.
దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.*



1. నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను, సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశీ నగరానికి వచ్చాను. అంటే  మనసా వాచా కర్మణా  నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను, అది నా నేను చేసిన మొదటి దోషము అని సమాధానమిచ్చారు.

2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా  శ్రీ కాశీవిశ్వనాధ అష్టకం వ్రాశాను. ఇది నేను చేసిన రెండవ తప్పు!*

3. నిర్వాణ శతకంలో న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఖం న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను*

*అర్థము :*
*నాకు పాప పుణ్యములు సుఖ దుఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము, భోజనము, భోక్త (భుజించేవాడు) నేను కాదు!  నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!*

*ఇంత వ్రాసికూడా నేను తీర్ద యాత్రలు చేస్తున్నాను. అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడవ తప్పు.!*

*ఈ తప్పులని మన్నించమని , ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.” అన్నారు.*


*నీతి :*
*మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి సంభాషణ మనకి తెలియజేస్తోంది. బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది, భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కూడా చూస్తారు.*

*“మనస్ ఏకం, వచస్ ఏకం , కర్మణ్యేకం!”*
*ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో ,ఆచరించి మనకు చూపించిన యధార్ధమైనమార్గము.*



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Saturday 13 April 2024

చెట్టులా బతకాలి (14-Apr-24, Enlightenment Story)

చెట్టులా బతకాలి

 🌺🍀🌺🍀🌺🍀🌺

పాలసముద్రం చిలికితే లక్ష్మితోపాటు కల్పవృక్షం ఉద్భవించిన కథ అందరికీ తెలిసిందే. గోవులకు తల్లి కామధేనువులాగానే, చెట్లకు జనని కల్పవృక్షం కావచ్చు. సృష్టిలో మనిషికంటే ముందే చెట్లు ఉన్నాయంటారు శాస్త్రవేత్తలు. భారతదేశంలో వైద్యానికి పనికిరాని మొక్క గాని, చెట్టుకాని లేవని ఆచార్య నాగార్జునుడు రుజువు చేశాడంటారు. మనం చెట్లను దైవాలుగా పూజిస్తాం

మరికొన్ని దేశాల్లోనూ ఈ ఆచారం ఉంది. కొబ్బరి చెట్టును కల్పవృక్షంతో పోలుస్తారు. ఆ చెట్టులో పనికిరానిదంటూ ఉండదు. రైతుకు ఎన్ని కొబ్బరి చెట్లు ఉంటే అంత సంపన్నుడు. భూమాతకు చెట్లు శ్వాసకోశాలు. ఇలాంటి చెట్లను విచక్షణా రహితంగా నరికి పారేస్తున్నారు. మంగళకరమైన పచ్చదనాన్ని పరిహరించి మరుభూములుగా మార్చుకుంటున్నాం. 

ఒకప్పుడు ఇంటింటా వేప, మామిడి వంటి వృక్షాలు ఉండేవి. విశాలమైన ఆవరణలు కనిపించేవి. ఇప్పుడు మనసుల మాదిరే ఇళ్లూ ఇరుకైపోయాయి. కొందరి ఇళ్లలో తులసి మొక్క కూడా కనిపించడం లేదు. తులసి దేవతాంశ కలిగిన ఔషధంగా చెబుతారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు తులసి సంజీవని లాంటిది. సత్వరం ఉపశమనం కలిగిస్తుంది. 

దేవతా వృక్షాలు, ఔషధశక్తి గల మొక్కలు భగవంతుడు భారతదేశానికి ప్రసాదించిన వరాలు.లక్ష్మణుడి ప్రాణరక్షణ చేసిన సంజీవని మన దేశ అద్భుతం. సృష్టి రహస్యాన్నంతా తనలోనే దాచుకున్నట్టు చిన్న విత్తనం విచ్చుకుని మౌనంగా మహావృక్షమై సేవలకు సిద్ధమైపోతుంది. పక్షులకు, పాంధులకు స్వాగతం పలుకుతుంది.


ప్రాణుల్లో ఉత్తమ ప్రాణిగా జన్మించిన మనిషి దైవం తరవాత దైవం అంతటివాడు. ఆపదల్లో ఆదుకొనేవాడే దైవం. కాని, బ్రహ్మవంశంలో పుట్టిన రావణుడు లోక కంటకుడైన రాక్షసుడు అయినట్లు, సృష్టి రక్షకుడిగా ఉంటాడని భగవంతుడు భావించిన మనిషి విధ్వంసకుడిగా మారిపోయాడు. విశాల దృక్పథంతో మామిడి చెట్టులా విస్తరించాల్సిన మానవత్వం, స్వార్థంతో కొమ్మలు లేని తాడిచెట్టులా ఎదిగింది. ఇదే మనస్తత్వాన్ని వారసత్వం అందిపుచ్చుకొంటోంది. 

మనిషితనం నేతి బీరకాయలో నెయ్యి అవుతోంది. ప్రపంచానికి చెట్టుకు మించిన గురువు లేడు. మౌనంగా ఎదగడమే కాదు, జీవిత పర్యంతం వివిధ సేవలందించి, అది మౌనంగానే తనువు చాలిస్తుంది. చెట్టు మరణించినా, బూడిదయ్యే వరకు మనిషికి ఉపయోగపడుతూనే ఉంటుంది. చెట్టుకు ప్రాణమే కాదు- మనసు కూడా ఉంటుంది. మనసుతో వినగలిగితే వృక్ష విలాపాలు మనల్ని దుఃఖ వివశుల్ని చేస్తాయి. చెట్టు జీవితమే గొప్ప సందేశం. ఆదర్శానికి చెట్టు మారుపేరు. అది అర్థం చేసుకోగలిగితే, మనిషి చెట్టులా బతకడానికి ఇష్టపడతాడు.

ఒక మనిషి సమాజం కానట్టే, ఒక చెట్టు వనం కాలేదు. వనసీమలు శాంతి నిలయాలు. తపోభూములకు వనాలు ఆలవాలాలు. సృష్టిలోని అందాలకు అడవులు నెలవులు. అదొక ప్రత్యేక ప్రపంచం. చిత్ర విచిత్రాలైన జీవరాసులుంటాయి. ఎలాంటి అపకారం చెయ్యకుండా చూసి ఆనందించాలి తప్ప, వాటి ప్రశాంత జీవితానికి భంగం కలిగించకూడదు. 

ఒక చెట్టు నరికితే ఎన్నో పక్షులు అనాథలవుతాయి. ఒక అడవి నరికేస్తే ఎన్నో ప్రాణులు ఆధారం కోల్పోతాయి. కుటుంబ పెద్ద మరణిస్తే ఎలాగో, ఒక మహావృక్షాన్ని నేల కూల్చినా అంతే. చెట్లు ప్రాణవాయువునిచ్చే దేవతలు. 

ఏ చెట్టూ తన ఫలాలను తాను తినదు. ఉపకార బుద్ధితోనే జీవిస్తుంది. అలాగే మరణిస్తుంది. మనిషి చెట్టును చూసి బతుకును బాగుచేసుకోవాలి. పరోపకార బుద్ధిని అలవరచుకోవాలి. అప్పుడు ఆ మనిషి మరణించినా స్మృతి వనంలో గంధపు చెట్టుగా చిరకాలం ఉండిపోతాడు!


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday 12 April 2024

సత్సంగం (13-Apr-24, Enlightenment Story)

  సత్సంగం

🌺🍀🌺🍀🌺

వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది. అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.



రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది. ఒకరు గురువుగారిని అడిగారు. దైవీశక్తిని నేను చవి చూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి గురువుగారు ఇలా చెప్పారు-

500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్. నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు. అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది.

ప్రత్యక్షానుభవం కలుగుతుంది..కోటి ఆధ్యాత్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని చేయడం వలన కలుగుతుంది...అన్నారు. అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడేగానీ,ప్రాక్టికల్ గా సాహసం చేయలేకపోయాడు.

ఈ ఘట్టం విని నా స్నేహితుడు, గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు. క్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్ష చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా ప్రాక్టికల్ గా చేసి దైవీశక్తిని అనుభవించాడు.

తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు. కొందరు "అతడు పిచ్చివాడైపోయాడు" అని దూరమైపోయారు.కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు. అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక. వాస్తవానికి ప్రతి ఒక్కడు ఈ భూమ్మీదకు దిగంబరంగానే వచ్చాడు."ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు...

తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను, అనుభవాలను ఉచితంగానే పొందాడు..తిరిగి అందరినీ, అన్నిటినీ, చివరకు తనువును కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతాడు.

"ఖాళీ" అవడం తథ్యం.కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా "ఖాళీ"గా ఉండడమే. గురువుగారు చెప్పిన "మెలకువలో నిద్ర".భగవద్గీతలో చెప్పినట్టు- "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు."ఖాళీ"గా ఉండడం. అదే యోగనిద్ర.

భగవద్గీత చరమశ్లోకంలో-
సర్వధర్మాన్ పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు. సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నాడు.


ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి. "ఖాళీ" అనేది పరానికి సంబంధించినది

అదే ఇది....
ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం.
ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం.
ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు... నన్ను వెంటాడుతూనే ఉన్నయ్ (19-Apr-24, Enlightenment Story)

  ` నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు... నన్ను వెంటాడుతూనే ఉన్నయ్ ...`* 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺🍀 🌺 నాన్న వయస్సు పెరి...