Thursday 11 January 2024

ముగ్గురు కూతుళ్ళు - Part 1 (12-Jan-24, Enlightenment Story)

ముగ్గురు కూతుళ్ళు -1

🍀🌺🍀🌺🍀🌺🍀🌺

ఒక గ్రామంలో ఒక రైతు నివసిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు. వాళ్ళందరికీ పెళ్ళి వయసొచ్చింది. దాంతో ఆ రైతు సంబంధాల కోసం వెదకసాగినాడు. ఒకసారి ఆ ముగ్గురు అమ్మాయిలు కడవలు తీసుకోని నీళ్ళు తేవడానికని చెరువు దగ్గరికి పోయినారు. నీళ్ళు ముంచుకుంటా... ముంచుకుంటా “ఏమే... నాన్న సంబంధాలు చూస్తా వున్నాడు గదా. నువ్వెవరిని చేసుకుంటావే... అంటే... నువ్వెవరిని చేసుకుంటావే” అని ఒకర్నొకరు అడుక్కోసాగినారు.
అదే సమయంలో ఆ వూరి యువరాజు మారువేషంలో అటువైపు వచ్చినాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటా వున్నారో విందామని ఒక పొద దాపున కూర్చున్నాడు.


అందరికంటే పెద్దామె "నేను ఈ రాజ్యాన్ని కాపాడే సేనాధిపతిని చేసుకుంటా... నాకు యుద్దాలన్నా, పోరాటాలన్నా చానా ఇష్టం" అనింది.

రెండో ఆమె "నేను తన ఎత్తులు జిత్తులతో ఈ రాజ్యాన్ని ప్రశాంతంగా వుంచే మంత్రిని చేసుకుంటా... నాకు సలహాలివ్వడమన్నా, సమస్యల్ని పరిష్కరించడమన్నా చానా ఇష్టం" అనింది.


చిన్నామె “నేను ఈ రాజ్యాన్ని పాలించే యువరాజును చేసుకుంటా... నాకు దాసదాసీలతో సేవలందుకోవడమన్నా, సింహాసనం మీద రాజు పక్కన కూర్చోని ప్రజల్ని పాలించడమన్నా చానా ఇష్టం" అనింది.

అంతలో పెద్దామె "పదపద... ఆలస్యమైపోతా వుంది. మనం ఇలా పొద్దుపోక వుత్తుత్త కలలు కనాల్సిందే గానీ... ఇవన్నీ నిజమవుతాయా... పాడా... మన నాన్న ఏ తలకు మాసినోన్ని తెచ్చినా తలొంచుకోని తాళి కట్టించుకోవడం తప్ప ఏం చేయగలం" అనింది బాధగా. ముగ్గురూ మౌనంగా కడవలు సంకన పెట్టుకోని గమ్మున ఇంటిదారి పట్టినారు.
యువరాజు వాళ్ళ మాటలన్నీ విన్నాడు. ముగ్గురినీ చూసినాడు. ముగ్గురూ చానా చక్కగా అప్పుడే పూసిన రోజాపూవుల్లెక్క వంక బెట్టడానికి లేకుండా వున్నారు. “అరే... పాపం... ఈ అమ్మాయిలెవరో గానీ వీళ్ళ కోర్కెలు తీరుద్దాం. వీళ్ళకేం కన్నొంకరా... కాలొంకరా... చక్కగా పాలమీగడ లెక్కున్నారు” అనుకున్నాడు. వెంటనే అంతఃపురానికి పోయి మంత్రినీ, సేనాధిపతినీ పిలిచి జరిగిందంతా చెప్పి "మనం ముగ్గురమూ వాళ్ళ ముగ్గురినీ పెళ్ళాడదాం" అన్నాడు.

రాజే సరే అన్నాక మిగతా వాళ్ళదేముంది... వాళ్ళు గూడా సరే అన్నారు. తర్వాత రోజు ముగ్గురూ కలసి రైతు ఇంటికి పోయినారు. స్వయంగా తమను పాలించే రాజు, మంత్రి, సేనానే తమ ఇంటికి అల్లుళ్ళుగా వస్తామనే సరికి రైతు చానా సంబరపడ్డాడు. వాళ్ళు కోరుకున్నట్టే వారికి నచ్చిన వాళ్ళనిచ్చి పెండ్లి చేసినాడు.

పెద్దామె సేనాధిపతి పెండ్లాం అయితే, నడిపామె మంత్రి పెండ్లాం అయితే, చిన్నామె రాజ్యానికి యువరాణి అయింది. దాంతో చిన్నామెకు అడుగడుగునా దాసీలే. ఆమె భోగమే భోగం. పన్నీటి స్నానాలు, మెత్తని హంసతూలికా తల్పాలు, ఏడువారాల నగలు, లెక్కబెట్టుకోలేనన్ని పట్టు వస్త్రాలు... ఒకటని కాదులే... కను సైగ చేస్తే చాలు కోరుకున్నవన్నీ కాళ్ళముందుకొచ్చేవి. అదంతా చూసి పెద్దామెకు, నడిపామెకు కన్ను కుట్టింది. “ఛ... ఛ... ఆ రోజు చెరువుకాడ ఆ మాటలంటున్నప్పుడు అవి నిజమవుతాయని కలలో గూడా అనుకోలేదు. లేకుంటే మనం గూడా యువరాజే మొగుడు కావాలని కోరుకుంటుంటిమి. మనందరికన్నా చిన్నదయినా దీనికేమి అదృష్టం పట్టింది. ఎట్లాగయినా సరే వీళ్ళిద్దరినీ విడదీయాల" అనుకోసాగినారు.

చూస్తుండగానే గంటలు రోజులై, రోజులు వారాలై, వారాలు నెలలై... ఆ చిన్నపిల్లకు మిగతా ఇద్దరికన్నా ముందే కడుపు పండింది. అది చూసి యువరాజు చానా సంబరపడ్డాడు. కాలు కింద పెట్టనీయకుండా పసిపిల్లలెక్క అల్లారుముద్దుగా చూసుకోసాగినాడు. ఆమె ఏమడిగితే అది... ఎంత ఖరీదయినా సరే తెప్పించసాగినాడు. ఒక పూట తిన్న వంట మరొకపూట తినకుండా దేశదేశాల నుండి పేరు మోసిన వంటగాళ్ళనందరినీ పిలిపించి అమృతం లాంటి వంటకాలన్నీ చేయించి పెట్టసాగినాడు. ఇదంతా చూస్తావున్న కొద్దీ అక్కలిద్దరికీ మరింతగా మండిపోసాగింది. పైకి నవ్వుతా ఇకఇకలాడుతావున్నా... లోపల మాత్రం కుతకుతా వుడికిపోతా విషం కక్కుతా వున్నారు. ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా... ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా... అని ఎదురు చూడసాగినారు.

అట్లా ఒక్కొక్క నెల గడుస్తా... గడుస్తా... ఆ చిన్నపాపకు తొమ్మిది నెలలు నిండినాయి. ఈ వారమా వచ్చేవారమా కానుపు అన్నట్టుంది. అంతలో అనుకోకుండా పక్క ఊరి నుండి ఒకరాజు ఆ రాజ్యం మీదికి దండయాత్ర కొచ్చినాడు. దాంతో యువరాజు తప్పనిసరై, సైన్యాన్ని తీసుకోని పోతా పోతా పెళ్ళాం అక్కలిద్దరినీ పిలిచి “మీ చెల్లెలు నిండుమనిషి. అక్కలైనా, అమ్మలైనా మీరే. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి" అని అప్పజెప్పినాడు. దానికి వాళ్ళు నవ్వుతా “దానిదేముందిలే యువరాజా! నీవు పోయిరా. మేం కంటికి రెప్పలా, కాలికి చెప్పులా కాపాడుకుంటాము" అన్నారు. పోయే ముందు యువరాజు పెండ్లాంతో “ఏమే... నాకు ముద్దులు మూటగట్టే కొడుకునిస్తావా... చూడ చక్కనైన కూతుర్నిస్తావా... ఎవరినిస్తావు” అన్నాడు. దానికామె నవ్వుతా “ఏమో... నాకేం తెలుసు. దేవుడు కడుపున ఎవర్ని వేసింటే వాళ్ళనిస్తా" అనింది. దానికి యువరాజు “మరి నేను అంత దూరంలో వుంటాను గదా... నాకెట్లా తెలుస్తాది... ఎవరు పుట్టినారో" అన్నాడు. దానికామె చిరునవ్వు నవ్వుతా “ఏముంది... నేను కనగానే ఆకాశంలోంచి ముత్యాలవాన కురిస్తే కొడుకు పుట్టినట్లు. పగడాల వాన కురిస్తే కూతురు పుట్టినట్లు... ఏం సరేనా" అనింది.

యువరాజు అట్లాగేనంటూ యుద్ధానికి వెళ్ళిపోయినాడు. అట్లా పోయిన వారం రోజులకు ఆమెకు నొప్పులు మొదలయినాయి. అప్పుడు అక్కలిద్దరూ చెరోపక్కన చేరి “ఏం భయపడొద్దు చెల్లీ... మేమున్నాం గదా... కళ్ళు మూసుకోని కాసేపు బాధ బిగబట్టుకో, బోసినవ్వులు నవ్వే పాప పక్కనుంటాది" అంటూ కాన్పుకు తీసుకోని పోయినారు. ఆమెకు కాసేపట్లో ముచ్చటగొలిపే కొడుకు పుట్టినాడు. వెంటనే అక్కలిద్దరూ ఆమె కళ్ళు తెరవక ముందే మత్తుమందు కలిపిన నీళ్ళిచ్చి, ఆమె లేచేలోగా ఆ పిల్లవాన్ని అక్కడి నుంచి తీసుకోని పోయి ఒక పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలేసి, ఒక చచ్చిపోయిన పిల్లవాన్ని తెచ్చి పక్కన పన్నబెట్టినారు. ఆమెకిదంతా తెలీదు... దాంతో మత్తు దిగినాక కొడుకు చనిపోయి వుండటాన్ని చూసి బాధ పడింది.

అక్కడ యువరాజు యుద్ధంలో వుండగానే ఆకాశంలోంచి ముత్యాలవాన కురిసింది. అది చూసి యువరాజు “ఆహా... నాకు ముత్యంలాంటి కొడుకు పుట్టినట్టున్నాడు" అని ఎంతగానో సంబరపడ్డాడు. యుద్ధం పూర్తి కాగానే ఎప్పుడెప్పుడు కొడుకును చూద్దామా అని సంబరపడతా బెరబెరా ఇంటికి చేరుకున్నాడు. కానీ అక్కడ పసిపాప నవ్వుల్లేవు. చనిపోయాడని తెలుసుకొని ఎంతగానో బాధపడ్డాడు. ఐనా కాసేపటికి తమాయించుకొని “సరే.. జరిగిందేదో జరిగిందిలే... మనకు నుదుటన రాత రాసినట్టు లేదు. ఈసారి మాత్రం చూడచక్కనైన కూతురినివ్వు" అన్నాడు. మళ్ళా ఆమెను ఇంతకు ముందులాగే బాగా చూసుకోసాగినాడు.

ఇంతకు ముందు బాబును పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలినారు గదా... ఆ పెట్టె కొట్టుకోని పోయి, కొట్టుకోని పోయి ఒక ముసలి సాధువుకు దొరికింది. ఆయనకు పెళ్ళాం, పిల్లలు ఎవరూ లేరు. ఒక్కడే. పిల్లలకు చదువు నేర్పిస్తా వుంటాడు. ఆయన ఆ పసిపిల్లోన్ని చూసి “ఎవరు కన్నబిడ్డో ఏమో. పాపం. ఎంత కష్టమొచ్చిందో. ఇట్లా వదిలేసింది" అనుకోని పెంచుకోడానికి ఇంటికి తీసుకోని పోయినాడు.

పార్ట్ 2 రేపటి కథలో కొనసాగుతుంది .....

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️



No comments:

Post a Comment

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే (16-May-24, Enlightment Story)

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొం...