Sunday 21 January 2024

నల్లడబ్బా - ఎర్రడబ్బా (22-Jan-24, Enlightenment Story)

 *నల్లడబ్బా - ఎర్రడబ్బా (బాలల సరదా జానపద కథ)

🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀

ఒక అడవిలో ఒక ముని ఉండేటోడు. ఆయనకు చానా మహిమలు ఉండేవి. కానీ వాటిని ఎవరికీ ఎప్పుడూ చూపేటోడు కాదు. ఆ ముని రోజూ పొద్దున్నే ఊర్లోకి వచ్చి ఒక్కొక్క ఇంటి దగ్గర అడుక్కుంటా వాళ్ళు పెట్టినవి తీసుకోని అడవికి వెళ్ళిపోయేటోడు. ఆ అడవిలోనే ఒక చిన్న ఇల్లు కట్టుకొని అందులో తపస్సు చేసుకునేటోడు. ఒకసారి ఆ మునికి పెండ్లి చేసుకోవాలని అనిపించింది. కానీ ఆ ఊరి జనాలు “నువ్వే అడుక్కోని తింటా వుంటావు, ఇంక నీ పెండ్లానికి ఏం పెట్టి సాకుతావు" అంటూ పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.


ఆ ఊరిలో సుబ్బమ్మ అని ఒకామె వుండేది. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు వున్నారు. వాళ్ళు చానా పేదోళ్ళు. చుట్టుపక్కల ఇళ్ళలో పనులు చేస్తా పొలం పనులకు కూలీకి పోతా, వచ్చిన డబ్బులతో కడుపు నింపుకునేటోళ్ళు. కొంతకాలానికి కూతురు పెద్దగయింది. పెద్దగయినాక పెండ్లి చేయాల గదా. కానీ ఆమె దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడా కూతురు వాళ్ళమ్మతో “అమ్మా... అమ్మా.... నువ్వెట్లాగూ నా పెండ్లి చేయలేవు. ఆ మునికన్నా నన్నిచ్చి చేయి" అనింది. వాళ్ళమ్మకు ఇష్టం లేకపోయినా వేరే దారి లేక మునికి కూతురినిచ్చి పెండ్లి చేసింది. పెండ్లి ఖర్చులన్నీ మునే పెట్టుకోని పెండ్లయినాక పెండ్లాన్ని తీసుకోని అడవికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఆమెను బాగా చూసుకోసాగినాడు.
కొన్ని రోజులయినాక సుబ్బమ్మ కొడుకును పిలిచి “అక్కడ అక్క ఎలా వుందో చూసి రాపోరా" అని అడవికి పంపించింది. వాడు అక్కను చేరుకున్నాడు. అక్క తమ్మునికి రకరకాల పిండివంటలు చేసి పెట్టి క్షేమసమాచారాలన్నీ కనుక్కోని తమ్ముడు పోయేటప్పుడు మొగుని దగ్గరికి పోయి “సామీ మా అమ్మా వాళ్ళ పరిస్థితి ఏమీ బాగాలేదంట, కొంచం సాయం చేయండి" అనింది. దానికా ముని “వంటింటి గూట్లో ఒక ఎర్రడబ్బా వుంది. అదిచ్చి పంపు. వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయి" అన్నాడు. ఆమె ఎర్రడబ్బాను తమ్మునికిచ్చి "దీన్ని జాగ్రత్తగా తీసుకోని పోయి అమ్మకియ్యి " అని చెప్పింది. తమ్ముడు ఆ డబ్బాను తీసుకోనిపోయి వాళ్ళమ్మకు ఇచ్చినాడు.

ఆమె ఏముందబ్బా ఆ డబ్బాలో అని మూత తెరిచి చూసింది. దాని నిండా సొరకాయ విత్తనాలు కనబడినాయి. ఆమెకు సొరకాయలంటే అస్సలు ఇష్టం లేదు. దాంతో “ఛీ... ఛీ... ఏం చేయాల ఈ పనికిమాలిన విత్తనాలు" అంటూ విసిరి ఇంటి బైట పాడేసింది. కొంత కాలానికి వానలు పడడంతో ఆ విత్తనాలు మొలిచి ఇంటి చుట్టూ సొరకాయలు కుప్పలు కుప్పలు కాసినాయి. ఆమెకు సొరకాయలంటే అస్సలు ఇష్టం లేదు గదా దాంతో వాటి గురించి ఏమీ పట్టించుకోలేదు. ఆ ఊర్లో ఒక కోమటాయన వుండేటోడు. ఆయన ఒకరోజు అటువైపు పోతాపోతా ఆ సొరకాయలు చూసి "అమ్మా అమ్మా ఒక సొరకాయ ఇస్తావా... ఒక రూపాయి ఇస్తా" అన్నాడు. ఆమె సంతోషంగా 'సరే తీసుకొనిపో' అంటూ రూపాయ తీసుకోని సొరకాయ వాని చేతిలో పెట్టింది. వాడు సొరకాయ తీసుకోని పోయినాక కూర చేసుకుందామని మధ్యకు కోసినాడు. కోస్తే ఇంకేముంది లోపలంతా ధగధగధగమని బంగారం బంగారం కాదు. అది చూసి వాడు వెంటనే ఒక బండి కట్టుకోని ఆమె దగ్గరకు పోయి "అమ్మా అమ్మా... మా వీధిలో అందరూ సొరకాయలు అడుగుతా వున్నారు. ఇస్తావా... ఒకొక్క దానికి ఒకొక్క రూపాయి ఇస్తా" అన్నాడు. దానికామె సంబరంగా అలాగేనంటూ సొరకాయలన్నీ తెంపి వాని బండికేసింది. వాడు ఆమె చేతిలో రెండువందల రూపాయలు పెట్టి ఇంటికి తీసుకోనిపోయి బంగారమంతా తీసేసుకున్నాడు. ఆరోజు నుండి వారానికోసారి ఇంటికాడికి వచ్చి కాసిన కాయలు కాసినట్లు తీసుకోని పోసాగినాడు.

కొన్ని నెలల తరువాత అక్క ఎట్లా వుందో చూడడానికని తమ్ముడు మరలా అడవికి పోయినాడు. అక్క వానికి అడిగిన పిండివంటలన్నీ చేసి పెట్టి ఆమాట ఈమాటా మాట్లాడతా ఇంటి పరిస్థితంతా తెలుసుకోనింది. తమ్ముడు పోయేటప్పుడు మొగుని దగ్గరికి పోయి “సామీ... మావాళ్ళ బాధలు ఎట్లున్నవి అట్లనే వున్నాయంట. ఈ సారయినా ఏదయినా మంచి సాయం చేయండి" అనింది. ముని ఏం జరిగిందబ్బా అని కళ్ళు మూసుకొని జరిగిందంతా కనుక్కున్నాడు. "గూట్లో ఒక నల్లడబ్బా వుంది, అదిచ్చి పంపు. ఈసారి మీ కష్టాలన్నీ తీరుతాయి." అని చెప్పినాడు. ఆమె తమ్మునికి నల్లడబ్బా ఇచ్చి పంపిచ్చింది. తల్లి కొడుకిచ్చిన నల్లడబ్బాలో ఏమున్నాయబ్బా అని తెరిచి చూసింది. దాని నిండా గుమ్మడి గింజలు కనబడినాయి. ఆమెకు గుమ్మడికాయలంటే గూడా అస్సలు ఇష్టం లేదు. దాంతో వాటిని గూడా విసిరి ఇంటి బైట పడేసింది. కొంతకాలానికి వానలు పడడంతో ఆ విత్తనాలు మొలిచి ఇంటి చుట్టూ గుమ్మడికాయలు గుంపులు గుంపులుగా కాసినాయి. కానీ ఆమెకు గుమ్మడికాయలంటే అస్సలు ఇష్టం లేదు గదా. దాంతో వాటి గురించి ఏమీ పట్టించుకోలేదు. ఆ కోమటాయన ఆ గుమ్మడికాయలను చూసినాడు. సారకాయల్లోనే అంత బంగారముంటే గుమ్మడికాయల్లో ఇంకెంత వుంటాదో అనుకున్నాడు. వెంటనే బండి కట్టుకోనొచ్చి “అమ్మా అమ్మా.... మా వీధిలో అందరూ గుమ్మడికాయలు అడుగుతా వున్నారు. ఇస్తావా... ఒకొక్క దానికి ఐదు రూపాయలిస్తా" అన్నాడు. దానికామె సంబరంగా అలాగేనంటూ గుమ్మడికాయలన్నీ తెంపి వాని బండికేసింది. వాడు ఆమె చేతిలో బదొందలు పెట్టి వాటిని ఇంటికి తీసుకోని పోయినాడు.

ఎవరూ చూడకుండా తలుపులన్నీ మూసి సంబరంగా కత్తి తీసుకోనొచ్చి పరపరపర గుమ్మడికాయలను అడ్డంగా కోసినాడు. అంతే లోపల నుంచి తేళ్ళు, జర్రులు కుప్పలు కుప్పలుగా బైటికొచ్చి వాన్ని కుట్టిన చోట కుట్టకుండా ఒళ్ళంతా కుట్టి కుట్టి పెట్టినాయి. దాంతో వానికి ఒళ్ళంతా బాగా విషమెక్కి మంచం పట్టినాడు. ఎక్కడెక్కడి వైద్యుల్ని పిలిపించినా, ఎన్నెన్ని మందులు మింగించినా నొప్పి కొంచెం గూడా తగ్గలేదు. రోజు రోజుకీ నొప్పి ఎక్కువవుతా లబలబలాడసాగినాడు.

అప్పుడు ఒకరోజు రాత్రి ముని వాని కలలో కనబడి "నీవు చేసిన తప్పు దిద్దుకుంటే నీ నొప్పి పోతుంది" అని చెప్పినాడు. దాంతో వాడు తర్వాత రోజు పొద్దున్నే ఇంట్లో వున్న బంగారమంతా బండి కేసుకోని పోయి సుబ్బమ్మ కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పి బంగారాన్ని తిరిగి ఇచ్చేసినాడు. దాంతో వాడి నొప్పి అంతా తగ్గిపోయి ఎప్పట్లాగే మామూలుగా ఐపోయినాడు. సుబ్బమ్మ ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బులతో ఒక మంచి మిద్దె కట్టుకోని, పేదవాళ్ళను అవసరానికి ఆదుకుంటా హాయిగా కాలం గడపసాగింది.

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే (16-May-24, Enlightment Story)

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొం...