Wednesday 17 January 2024

సంక్రాంతి బొమ్మల కొలువు (18-Jan-24, Enlightenment Story )

 సంక్రాంతి బొమ్మల కొలువు

🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

మానవుడు తన జీవనక్రమంలో పదిమందితో కలిసి ఆనందోత్సాహాలను నింపుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పవిత్రమయిన, ఆరోగ్యప్రదమైన వేడుకలే పండుగలు. ఐహిక ఆముష్మిక కామ్యప్రదాలు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క రకమైన సందడి. వినాయక చవితికి వివిధ వృక్షాల పరిచయం పెంచుకుని పత్రి సేకరించడం ప్రధాన విషయం. దసరాకు బొమ్మలు పెట్టడం, సంక్రాంతికి గొబ్బిళ్ళు, దీపావళికి బాణాసంచా ప్రత్యేకమైన విషయాలు. కొంచెం దృష్టి పెట్టి చూస్తే బొమ్మల కొలువు పెట్టడం, గొబ్బిళ్ళు పెట్టడం కేవలం ఆడపిల్లలు, అందునా కన్నెపిల్లలు నిర్వహించేవి అని తెలియవస్తుంది.

ఆడపిల్లలు ప్రధానంగా ఈ బొమ్మల కొలువు పెట్టడానికి అధికారం కలవాళ్ళు. ఆడపిల్ల గల కుటుంబంలో వాళ్ళి ఆమె చేత ఈ బొమ్మలు పెట్టిస్తారు. ఇంట్లో పెద్దలందరూ పూనుకొని బొమ్మలనుఒక క్రమంలో మెట్లు మెట్లుగా అమర్చిపెడతారు. చెక్కతో మెట్ల బల్ల చేయించి పెట్టుకుంటారు కొందరు. బొమ్మల బల్ల అనీ మెట్ల బల్ల అనీ దాన్ని వ్యవహరిస్తారు. ఈ బల్ల మెట్లు ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఉంటాయి. మూడు, ఐదు, ఏడు – ఇలా వారి వారి బొమ్మల సంఖ్యను బట్టి అన్ని మెట్లుగా బల్ల ఉంటుంది. బొమ్మలు పెట్టేముందు బల్లను కేవలం తెల్లటి గుడ్డతోనే కప్పుతారు. ఆ బల్ల మీద మామూలు రోజుల్లో పుస్తకాలు తప్ప ఏమీ పెట్టనివ్వరు కొందరు. మరికొందరు ఆ బల్లను గుడ్డ కప్పి పదిలంగా దాచిపెడతారు.

ఇంటి ఆచారాన్ని బట్టి – పార్వతీ పరమేశ్వరులను గాని, సీతారాములను గాని, రాధాకృష్ణులను గాని, లక్ష్మీ సరస్వతులను గాని పెట్టిస్తారు, ఆ ఇంటి అమ్మాయి చేత. ఆ అమ్మాయి మొదటి దేవతామూర్తిని పెట్టాక, ఆ యేడు కొన్న కొత్త బొమ్మను తల్లి కూడా పట్టుకుని పెట్టిస్తుంది. ప్రతీ ఏడు ఒక కొత్త బొమ్మ తప్పనిసరిగా కొనడం ఆచారం. బొమ్మల ఆకారాన్ని బట్టి ఏ మెట్టు మీద ఏ బొమ్మ పెట్టాలి అనేది నిర్ణయించుకుని క్రింద నుండి పైకి పెట్టుకుంటూ వెళతారు. ప్రతి మెట్టు మీద కనీసం ఒక్క బొమ్మ క్రింద నుండి పై మెట్టు దాకా పెట్టాక తక్కిన బొమ్మలు పేర్చుకుంటూ వస్తారు.

దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. తల్లీ పిల్ల, ఆవూ దూడ,  జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు – ఇలా వారి వారి దగ్గరున్న బొమ్మలన్నీ ఆ కొలువులో పెడతారు. కాలక్రమంలో దేశనాయకుల బొమ్మలు, పురాకట్టడాల బొమ్మలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మల వంటివి కొలువులో చోటు చేసుకున్నాయి.

ఈ క్రమం లోనే, కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశదేశాల బొమ్మలు సేకరించి బొమ్మల కొలువులో పెట్టడం వ్యాప్తి లోకి వచ్చింది. రైల్వే స్టేషన్, విమానాశ్రయం, పార్క్ వంటివి కళాత్మకంగా ఇంట్లో వారందరూ కలిసి కట్టి పెట్టడం పిల్లలలో సృజనాత్మకత పెంపొందించే విధంగా ఉంటున్నాయి. ఆవాలు, మెంతులు వంటివి మట్టి మూకుళ్ళలో గాని, ఇసుక దిబ్బల మీద గాని జల్లి మొక్కలు మొలిపించి వాటితో చిన్న చిన్న పార్కులు కట్టడం వంటివి మారుతున్న కాలంతో పాటు బొమ్మల కొలువులోకి వచ్చి చేరిన వేడుకలు. తాము స్వయంగా చేసిన బొమ్మలు, అల్లిన బొమ్మలు – ఉదా. ఏలకుల తొక్కలతో, ఇంజెక్షన్ సీసాలతో, రకరకాల మూతలతో మందిరాలు, గోపురాలు కట్టడం, వాటిని బొమ్మల కొలువుల్లో అలంకరించడం ఒక కళ.

అందంగా, కళాత్మకంగా అమర్చిన బొమ్మల కొలువు పేరంటానికి బంధు మిత్రులను పిలిచి పేరంటం చేస్తారు. పేరంటానికి పిల్లలూ పెద్దలూ కూడా వస్తారు. బొమ్మలకు హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెడతారు

సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పండుగ వచ్చేముందు ధనుర్మాసంలో ముప్ఫై రోజులూ కన్నెపిల్లలు ఉషఃకాలంలో ఆవుపేడతో గొబ్బిళ్ళు చేసి పూజ చేస్తూ సంక్రాంతికి స్వాగతం పలుకుతారు. దసరా రోజుల్లో కన్నెపిల్లలకు పూజ, సంక్రాంతి నాళ్ళలో గొబ్బిళ్ళకు పూజ, కన్నెపిల్లలు కుటుంబ వృద్ధి కోసం, ఉత్తమ వరుని కోసం చేస్తారు. గొబ్బిళ్ళ పాట గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలియవస్తుంది.

సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణియ్యవే
తామర పువ్వంటీ తమ్ముణ్ణియ్యవే
చేమంతి పువ్వంటీ చెల్లెల్నియ్యవే
మొగలీ పువ్వంటి మొగుణ్ణియ్యవే

అని బాలికలు గొబ్బెమ్మను ప్రార్థిస్తుంటారు. తనకు తమ్ముడు, చెల్లెలు కలగాలని, మంచి భర్త రావాలని, ‘సుబ్బడు,’ అంటే పిల్లవాడు కలగాలనీ కోరుకుంటున్నారు. ఇక పెద్దలు సంకురమయ్యకు స్వాగతం పలికి పూజించడం సంక్రాంతి పండుగలో ప్రధాన అంశం.

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే (16-May-24, Enlightment Story)

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొం...