Monday 15 April 2024

నీకంటూ ఒకరు (16-Apr-24, Enlightenment Story)

నీకంటూ ఒకరు!

🌺🍀🌺🍀🌺

ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని గురించి శ్రద్ధగా, సానుభూతిగా వినే ఒక్కరైనా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద దురదృష్టం. మన సంతోషాన్ని పంచుకునేవారుంటారు. కానీ మన కష్టాన్ని పంచుకోవడానికి, కన్నీళ్లను తుడిచిపోవడానికి ఎవరు ముందుకొస్తారు? మనం నవ్వుల్ని తోటివారితో ప్రకృతితో పంచుకుంటాం. కానీ మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు? దాన్ని పంచుకోవాలంటే అవతలి మనిషికి మధుర హృదయం ఉండాలి. మానవీయ కోణం ఉండాలి. తన హృదయపు పొరల పూలరేకులతో అవతలివారి గాయపడిన గుండెను పదిలంగా పొదువుకుని, గాయాల మరకలను తుడిచి మాధుర్యపు మందులను వేసి, చిరునవ్వుల మృదుగాయంతో సేద తీర్చే ఔషధీయ హృదయం ఉండాలి. ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు. ధనం అగత్యం లేదు. మంచి మనసు ఉండాలి. అవతలివారి గాయాన్ని తనదిగా భావించే స్పందించే మనసు ఉండాలి.


అలాంటి ఒకరు మనకుంటే మన కన్నీరు పన్నీరు అవుతుంది. కష్టం కూడా ఇష్టం అవుతుంది. శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టం లేకపోలేదు. కన్నీరు రాకపోలేదు. నిజానికి అవన్నీ వాళ్లకు ఎక్కువ. కానీ అంత ప్రియమైన స్నేహితుడు ఉన్నాక, అంత మృదువుగా కన్నీరు తుడిచే సహచరుడు ఉన్నాక, అంతగా కష్టం పంచుకునే ఆత్మీయుడు మనకంటూ ఉన్నాక- కన్నీరు కాటు వేయగలదా, కష్టం వేటువేయగలదా, కారు మేఘం కూడా మధురమైన నాట్యం చేయదా? స్నేహాన్ని వెన్నలా పంచుకు తిన్న శ్రీకృష్ణుడు, అటుకుల్ని అమృతంలా ఆరగించిన శ్రీకృష్ణుడు స్నేహితులు, సన్నిహితులు, సహచరుల దుఃఖ బాష్పాల్ని ఆనంద బాష్పాలుగా మార్చకుండా వదులుతాడా, వదలగలడా? పెనుతుపానును గోవర్ధనగిరి కింద ఆటవిడుపు విహారంగా మలచకుండా ఉంటాడా? రహస్యం కళ్లలో, కన్నీళ్లలో లేదు. వాటిని తుడిచే ఆ అమృతహస్తంలో ఉంది. కష్టంలో, దాని పరిణామాల్లో లేదు. వాటిని కమనీయంగా మలచే ఆ హృదయపు సొంపులో ఉంది. శిల ఏదైనా శిలే. దాన్ని శిల్పంగా మలచే నేర్పు శిల్పిలో ఉండాలి. పాపాయిగానా, యువతిగానా, రాజుగానా, సర్పంగానా, సర్వేశ్వరుడిగానా... అదంతా శిల్పి నేర్పు, ఓర్పు. మన కన్నీళ్ల్లకు అర్థాన్ని మార్చే నేర్పు వాటిని తుడిచే వేళ్లకుండాలి.*

ఏది ఏమైనా కన్నీళ్లకు తుడిచే ఒక అమృతహస్తం కావాలి. నీకు నేనున్నానంటూ ఆ కన్నీళ్లకు అమృత బిందువులుగా మార్చే కమనీయ హృదయం కావాలి. ఆ హస్తం మనదే అయితే... అలాంటి హృదయం మనకే ఉంటే... మనమే ఆ శ్రీకృష్ణుడైతే? మన ఇంటికప్పు గోవర్ధనగిరిగా మారదా? మారుతుంది! ఎవరికి ఏం సాయం చేయాలన్నా మనకు ధనం అవసరం లేదు. బలం అవసరం లేదు. మనం... ప్రేమించే హృదయం అయిపోవాలి. మన వేళ్లు కన్నీళ్లను తుడిచే తామర రేకులుగా మారాలి. మాటలు మకరందపు బిందువులుగా జాలువారాలి. లోకంలో ఏ ఒకరికైనా నీకు నేనున్నానంటూ నిలబడగలిగితే లోకమే తోడుగా మన పక్కన నిలబడదా? మన వెనక నడిచిరాదా? ఒక్కరు కోటిమందిగా మనకు గొడుగు పట్టరా? ప్రేమంటే హృదయానికి ప్రణమిల్లని మనిషి ఉండడు. కన్నీరు తుడిచే చేతికి అంత విలువ ఉంది. అంత శక్తి ఉంది. మనమూ ఆ ‘ఒకరం’ అవుదాం. కన్నీరు తుడుద్దాం. కన్నీరు కార్చేవారు లక్షలమంది ఉంటారు. కానీ, ఆ కన్నీళ్లను తుడిచే చేతులు కోటిలో ఒకరికే ఉంటాయి. శ్రీకృష్ణుడు జీవితమంతా కష్టాలు ఎదురుదెబ్బలతో సహవాసం చేసినా ఏ ఒక్కరోజూ ఆ భావంతో బాధపడిన దాఖలాల్లేవు. ఎవరి సహాయాన్ని, సానుభూతిని కోరిన రుజువుల్లేవు. ఎందుకంటే- ఇతరుల కన్నీటిని తుడవడంలోని సాటిలేని ఆనందాన్ని తెలిసిన ‘శ్రీకృష్ణుడు’ ఆయన.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ఓర్పు - మార్ష్ మెల్లో సిద్ధాంతం (03-May-24, Enlightment Story)

  ఓర్పు !!! 🌺🍀🌺🍀 🌺 ఒక పరీక్ష:: స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని స్వీట్స్ పంచి, ఒక విచిత్రమైన షరతు పెట్టాడు.  విన...