Thursday 4 April 2024

జీవితంలోని ఆఖరి ఏడు రోజులు (05-Apr-24, Enlightenment Story)

 జీవితంలోని ఆఖరి ఏడు రోజులు

🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


ఒకానొకప్పుడు, ఒక ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడు. అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి సాధువును దుర్భాషలాడాడు. సాధువు ఆ వ్యక్తి వైపు చూసి, ఏమీ సమాధానమివ్వకుండా, మౌనంగా ఉన్నాడు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.

అక్కడ ఉన్న శిష్యులలో ఒకరికి ఆ మాటలు విని కోపం వచ్చింది. తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉండిపోయాడని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది.

ఉపన్యాసం ముగిసిన తరువాత, అతను గురువు వద్దకు వచ్చి, "గురూజీ, ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా తిట్టినప్పుడు, ఘోరంగా దూషించినప్పుడు మీరు మౌనంగా ఎలా ఉన్నారు? దయచేసి చెప్పండి, మీరు అలాంటి పరిస్థితిలో కూడా ఇంత ప్రశాంతంగా, నవ్వుతూ ఎలా ఉండగలిగారు? మీకు కొంచెం కూడా కోపం రాలేదు, కనీసం మీ ముఖ కవళికలు కూడా మారలేదు. మీ రహస్యం ఏమిటి?", అని అడిగాడు.


సాధువు చిరునవ్వుతో, "ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెప్తాను అయితే ముందుగా, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి" అని అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. "ఏమిటి గురూజీ, దయచేసి చెప్పండి" అని అడిగాడు. సాధువు ఇలా చెప్పాడు, "నీవు ఒక వారం తర్వాత చనిపోతావు, మీ జీవితపు అంతం దగ్గర పడింది."

అది విని శిష్యుడు చలించిపోయాడు. కాళ్ల కింద నుంచి నేల జారిపోయినట్లనిపించింది. ఎవరో చెబితే తను ఎప్పటికీ నమ్మేవాడు కాదేమో, కానీ ఆయన తన గురువు, ఆయన పై పూర్తి విశ్వాసం, గౌరవం ఉంది. అందువల్ల, దానిని నిజం అని నమ్మాడు, అతను జీవించడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

శిష్యుడు చాలా కృంగిపోయాడు. నిరాశా నిస్పృహ స్థితిలో సూటిగా ఆలోచించలేకపో యాడు. కానీ తరువాత ఒక క్షణం స్థిరంగా ఉండి, ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించాడు. అతను తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులు సంపూర్ణంగా జీవించాల ని నిర్ణయించుకున్నాడు. తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు.దారిలో శిష్యుడు తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులను పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలా అనే ఆలోచనలో మునిగిపోయాడు!

చాలా ఆలోచించిన తరువాత, అతను తన గురూజీ బోధనలను అనుసరించి, వినమ్రత, ప్రేమ, భగవంతుని పట్ల భక్తితో జీవించడానికి మిగిలిన ఏడు రోజులను గడపాలని నిర్ణయించుకున్నాడు.

ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది! ఇప్పుడు అతను అందరినీ అత్యంత ప్రేమపూరిత హృదయం తో కలుస్తున్నాడు. దేనికీ ఎవరి పైనా కోపం తెచ్చుకోవట్లేదు! అతను ఎక్కువ సమయం దేవుడి స్మరణలో గడుపుతున్నాడు. అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు, తెలిసి లేదా తెలియక ఎవరితోనైనా విభేదాలు ఉన్నా లేదా ఎవరినైనా బాధపెట్టి ఉంటే, వారందరినీ క్షమాపణ కోరాడు. తన దినచర్యను ముగించిన తర్వాత, అతను భగవంతుని స్మరణలో మునిగిపోయాడు. ఇలా ఆరు రోజుల పాటు సాగింది.

ఏడవ రోజు, శిష్యుడు తన అంతః సమయాని కి  ముందు తన గురువును ఒకసారి చూడాలని, కలవాలని కోరుకున్నాడు. తన గురువును కలుసుకుని, అతని పాదాలను స్పృశించి, "గురూజీ, నా ముగింపు దగ్గర పడింది, నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలనుకుంటున్నాను. దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి" అన్నాడు.                 

సాధువు ఇలా అన్నాడు, "నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు". ఏడు రోజుల క్రితం గురువు వద్ద విన్న విషయం తర్వాత, తన గురువు నోటి నుండి అలాంటి ఆశీర్వాదం విని శిష్యుడు కలవరపడ్డాడు.

తన శిష్యుడిని ఆశీర్వదించిన తరువాత, గురువు అడిగాడు, "ఇప్పుడు చెప్పు, గత ఏడు రోజులు ఎలా ఉన్నాయి? నీవు మునుపటిలా అందరిపై కోపంగా ఉన్నావా?"

ముకుళిత హస్తాలతో శిష్యుడు ఇలా జవాబిచ్చాడు, "లేదు, అస్సలు కాదు, గురూజీ. నేను జీవించడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే ఉంది. నేను అలాంటి పనికిమాలిన ప్రవర్తనతో వాటిని ఎలా వృధా చేయగలను? బదులుగా, నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ గడిపాను. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధపెట్టి ఉండినవారికి క్షమాపణ కూడా చెప్పాను."

దానికి గురువు చిరునవ్వు నవ్వి, "చూడు, ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది, నువ్వు కూడా అనుభూతి చెందావు. నేను ఏ క్షణంలో నైనా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు, ఎవరియందైనా చెడు భావనలతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను?  బదులుగా, అందరి ఎడలా నా హృదయాన్ని తెరిచి ఉంచి, నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను."
పశ్చాత్తాపం, పగ, తగాదాలు, వాదనలతో వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. జీవితమంతా క్షమించడం, ముందుకు సాగిపోవడమే. జీవితపు నిజమైన లక్ష్యం ఆనందం. ఎవరు ఈ ప్రగాఢమైన జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో, వారు ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉంటారు.   జ్ఞానం అంటే ఇదే. నీ జీవితంలోని ప్రతి క్షణమూ, అదే నీ చివరి క్షణమని భావించి జీవించు."

ఈ మొత్తం ఉపాయమేమిటో శిష్యుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ రోజు ప్రశాంతమైన, ప్రేమపూర్వక జీవితానికి సంబంధించిన గంభీరమైన రహస్యాన్ని తెలుసుకున్నాడు!

*కేవలం ద్వేషాన్ని తొలగించండి, సార్వత్రిక ప్రేమ అక్కడే ఉంటుంది.*

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ఓర్పు - మార్ష్ మెల్లో సిద్ధాంతం (03-May-24, Enlightment Story)

  ఓర్పు !!! 🌺🍀🌺🍀 🌺 ఒక పరీక్ష:: స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని స్వీట్స్ పంచి, ఒక విచిత్రమైన షరతు పెట్టాడు.  విన...