Tuesday 13 June 2023

అన్నము అంటే ఏమిటి? (17-June-23, Enlightenment Story)

 అన్నము అంటే ఏమిటి?

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹                

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునునితో అంటాడు.

 శ్లో: "అన్నాద్భవన్తి భూతాని 

పర్జన్యా దన్నసంభవః 

యజ్ఞాద్భవతి పర్జన్యో 

యజ్ఞః కర్మసముద్భవః "

తాత్పర్యం :- ప్రాణులు అన్నము వలన కలుగు చున్నవి. అన్నము మేఘము (వర్షము) వలన కలుగు చున్నది. మేఘము (వర్షము) యజ్ఞము వలన కలుగు చున్నది. ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగు చున్నది.

అన్నం పరబ్రహ్మ స్వరూపం! అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు. అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నము గురించి తెలుసుకుందాం.

మనలో చాలామందికి ”అన్నము” అంటే తెలియదు. బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి.

అవి: 1. అన్నమయ, 2. ప్రాణమయ, 3. మనోమయ, 4. విజ్ఞానమయ, 5. ఆనందమయ కోశములు. 

అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతున్నది. కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే *అన్నము* అని అర్ధం. 

అంతేకాదు… తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూత జాతములు జనించుచున్నవి. అన్నము వలననే జీవించుచున్నవి. తుదకు అన్నము నందే(భూమి) నశించుచున్నవి లేక లయించుచున్నవి అని చెప్పబడి ఉంది. 

మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది. కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు, అని అర్ధం చేసుకోవాలి.

*అన్నదానం అంటే ఏమిటి?*

అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారు తున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే. అంతేకాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్నీ అన్నమే. కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని, అన్ని దానములకెల్ల అన్నదానం మిన్న అని, శాస్త్రాలు చెప్తున్నా యి. ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్న దానానికి మాత్రం ఈ నియమం లేదు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది.

ఇంట్లోని పిల్లలు భోజనం సరిగా తినకుండా వెదజల్లితే పెద్దలు వారిని మందలిస్తారు. అంతే కాకుండా దాన్ని అలా పారవేయరాదని అన్నం పరబ్రహ్మస్వరూపం అని వారితో అంటారు. 

అసలు ఇలా ఎందుకు అంటారు అని పిల్లలు అడిగితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పరు, చెప్పలేరు కూడా. ప్రతి జీవికి కావాల్సిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు. 

కాబట్టే ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దలు చెబుతుంటారు. అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్లని నిర్ణయిస్తాడు

గత జన్మలో చేసిన పాప పుణ్యాలను లెక్కించి వాటికి అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరి కడుపున పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట. ఆయన సమకూర్చిన అన్న, పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. 

అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని, తాగే నీటిని వృథా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందట. అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష్షు కలుగుతుందట. అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృథాచేస్తే   నీ ఆయువు క్షీణించి పోతుందట.

ఏ తల్లి అయినా తన బిడ్డల ఆయుః క్షీణాన్ని తట్టుకోలేదు. అందుకే అన్నంపారబోయవద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది కూడా.  ఇదంతా వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం అని మాత్రమే చెబుతారు. అందుకే అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న. ఎవరికైనా కోట్లు ఇచ్చినా సంతృప్తి చెందరు కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు.

అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. 

ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతోపాటు ఉండే అనేకానేక జీవులకు బలిభుక్కులు సమర్పించి భోజనం చేసినవారికి, అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం.

అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. 

మనిషి ఆశకు అంతులేదు... అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. ఆకలిగొని ఉన్నవారికి అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు.

పూర్వకాలంలో ఒక భక్తుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. 

యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ భక్తుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. ‘శంబరుడు’ అనే  ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. 

తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. భక్తుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.

ఈ భక్తుడుకి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. 

ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. 

భక్తుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, “ఓయీ భక్త! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది!” అన్నాడు. 

మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. భక్తుడు సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.✍️

!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!

!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!

!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...