Friday, 17 May 2024

తప్పులెన్నువారు (18-May-24, Enlightment Story)

 తప్పులెన్నువారు!!!

🌺🍀🌺🍀🌺🌺

పరనింద మానవ స్వభావంలో సర్వసాధారణ లక్షణం. తప్పులుగా తమకు తోచేవి ఎదుటి వ్యక్తిలో కనపడినప్పుడు, ఆ మనిషిలో మరెన్ని మంచి గుణాలున్నా, ఆ తప్పులనే పట్టిచూపిస్తుంటారు కొంతమంది. తప్పులుగా వాటిని అతడు అంగీకరించక ప్రతిస్పందిస్తే, చులకనగా చూడటమే కాక, అపరాధిగా ముద్ర వేయడానికైనా వెనకాడరు.




మనిషి ఎప్పుడూ తప్పులే చేయడా? మరొకరి తప్పులపై తనకంత ఆసక్తి ఎందుకని? ఇలా ఆత్మవిమర్శ చేసుకునేందుకు కొందరు అవకాశమివ్వరు. సర్వం విష్ణుమయమన్నప్పుడు భగవంతుడి సృష్టిలో తప్పులెలా ఉంటాయన్న పరమ భావన మహాత్ముల్లోనే కనిపిస్తుంది.

గీతలో కర్మయోగం, తప్పొప్పులను విభజించి భగవంతుడు మనిషికిచ్చినదేమీ లేదని, అవి రెండూ అతడి కర్మాచరణల ఫలితాలని అంటుంది. ధర్మశాస్త్రాలన్నీ అతడిని, తన అహంభావనలతోనే అవి నిర్ణయించి నిర్దేశించే న్యాయాధికారివి కావద్దంటాయి.

అదే వాస్తవాన్ని, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని, వేమన శతకంలోని ఒక చిన్న పద్యపాదం అతడికి చిరకాలం జ్ఞాపకం ఉండేలా చెబుతుంది. ఇటాలియన్‌ మేధావి లియొనార్డో ఒకరిలో తప్పులుగా కనిపించేవి, భూతద్దాల్లో పెద్దవిగా చేసి చూపించి ప్రపంచాన్ని ఉద్ధరించాలని మనుషులనుకుంటే అది చవకబారు ప్రయత్నమంటాడు, దాన్ని మానుకొమ్మంటాడు.

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జరులకెల్ల నుండుదప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ..!

తాత్పర్యం :
ఎదుటివారి తప్పులను లెక్కించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ తాము చేసిన తప్పులను తెలుసుకొనేవారు మాత్రం కొంతమందే ఉంటారు. అయినా ఇతరుల తప్పులను లెక్కించేవారు తమ తప్పులను మాత్రం తెలుసుకోలేరని ఈ పద్యం యొక్క భావం

తప్పు మీద తప్పు చేసుకుపోతున్న శిశుపాలుడు అతడు నూరు తప్పులు చేసేదాకా కృష్ణపరమాత్ముడు ఉపేక్షించి ఊరుకున్నాడు. 
ఆతరవాతనే అతడిని సంహరించాడు. తప్పు చేసే వ్యక్తికి తగినన్ని అవకాశాలిచ్చికానీ భగవంతుడు శిక్షించడని చెప్పే పురాణ గాథల అంతరార్థం అదేనని మనుషులు గ్రహించరు.

తప్పు చేసినప్పుడు చేసిన వాడికది తప్పని చెప్పి సరిదిద్దుకొమ్మని ఒప్పించగల కుశలత కలిగినవాడు గొప్పవాడు.

*గౌతమ బుద్ధుడు అటువంటి మార్గదర్శకుడు.*


కరడుగట్టిన బందిపోటు అంగుళీమాలుడి దోషభూయిష్ఠమైన ప్రవర్తనలో గుణాత్మకమైన పరివర్తనకు కారణమై ఆయన అతడిని తనకు ప్రధాన శిష్యుడయ్యే స్థాయికి చేర్చాడు.తప్పులు చేసేవారికి తమ తప్పులు తెలుసుకునేందుకు భగవంతుడే సమయం ఇస్తున్నప్పుడు, సాటి మనిషి తప్పులపై అంత తొందరగా స్పందించవలసిన అగత్యం తమకేమిటని మనుషులు ఆలోచించరు. నిందారోపణలు చేస్తూ జీవించే మనిషి నిజ జీవితంలో ఎన్నటికీ విజేత కాలేడు.

భగవంతుడు మనుషులందరినీ దోష రహితులుగా, సమగ్రత తొణికిసలాడే పరిపూర్ణులుగా సృష్టించలేదు. తప్పులు చేయవద్దని, అవి జరగకుండా చూసుకొమ్మని మనిషి మరో మనిషికి చెప్పడం ధర్మవిరుద్ధం కాదు. చేసిన తప్పు తెలియజెబుతున్నప్పుడు, తప్పు చేసిన వ్యక్తికి అది తనపై ప్రేమాభిమానాలతో, సదుద్దేశంతో జరిగిన ప్రయత్నంగా అనిపించాలి. యుక్తాయుక్తాలు నిర్ణయించే అధికారి తానన్న భావన అతడికి కలిగిస్తూ, తప్పులు సరిదిద్దాలనుకుంటే- ఈ ప్రపంచంలో అతడు ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముంటుంది.



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...