Saturday, 2 December 2023

పుటుక్కు జరజర డుబుక్కు మే (03-Dec-23, Enlightenment Story)

 పుటుక్కు జరజర డుబుక్కు మే ఈ సామెతకు అర్థమేమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం


అదోపాఠశాల మైదానం. బాలికలాడి యాడి అలసి పోయారు. గుంపుగా ఓ చోట కూచున్నారు. ఆయాసం కారణంగా వారి ఎదలెగ సెగసి పడుతున్నాయి. ఓ అమ్మాయి నెత్తి నుండి ప్లాస్టిక్ పిన్ను తీయ బోయింది. ఆది పుటుక్కున విరిగిపోయింది. ఆ బాలికకు చిన్న గాయమయింది. అమ్మా అన్నది. ఇది చూసి నవ్వారు. ఆ అమ్మాయి మనస్సులో ఏవో పూర్వ స్మృతులు తైతక్కలాడాయి. అంతే.


 పుటుక్కు..జరజర... డుబుక్కు... మే..." అన్నది. అమ్మాయి నవ్వుతూనే “పుటుక్కు జరజర డుబుక్కుమే" ఒక్క సారి కాదు; రెండు మూడు పర్యాయాలన్నది; అంటూనే నవ్వుతున్నది; నవ్వుతూనే అంటున్నది.


ఆ కథస్మృతిలో తిరిగిన వారంతా ఆ నవ్వుకు నవ్వుకలిపారు. కొందరు ఆశ్చర్యంలో మునిగారు; మరికొందరు ప్రశ్నార్థక ముఖలయ్యారు. ఈ తతంగంలో ఆసహనం రేకెత్తిన కొందరు పిన్ను విరిగిందానికన్నా మీ విరుగుబాటే బాధాకరంగా ఉందన్నారు.


'నవ్వుతూన్న ఓ అమ్మాయిని 'చాల్చాల్లేవే' అంటూ మరో అమ్మాయి. మోచేతితో పొడిచింది. 'నన్ను మోచేతితో పొడుస్తావా? అయితే నేనో పొడుపుకథ పొడుస్తాను. విప్పుకో!' అంది అమ్మాయి. 'సరే సరే' అన్నారందరు.


ఆ అమ్మాయి మరోసారి 'పుటుక్కు, జరజర, డుబుక్కు, మే' అంది. ఆ కథ తెలిసిన బాలికలొకరిద్దరు మేము ముడి విప్పుతాం అన్నారు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. 'పిన్ను విరిగి ఏడుస్తున్న పిల్లయినా చెప్పాలి, లేదా పొడిచిన మోహినైనా చెప్పాలి, పట్టు పట్టింది.


"మా యిద్దరికీ దాని అర్థమేంటో తెలియదు తల్లీ! నీవే చెప్పు. ఇద్దరూ చేయెత్తి మొక్కారు. ఆ అమ్మాయి పైట నడుంకు చెక్కి, గళం సవరించుకొని పొదుపు కథకు విడుపు ప్రారంభించింది.


"అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్లో ఓ పూరిల్లు, ఆయింటి చూట్టూరా చక్కనికూరగాయల మొక్కలు. అమొక్కల మధ్యమధ్య చిక్కుడు, పొట్లతీగలు, బీర తీగలు, ఆ యింటి పై కప్పుపై పచ్చని గుమ్మడి తీగ, కప్పునిండ గుమ్మడి ఆకులు చిలుక పచ్చగా నిగనిగలాడుతోన్న గుడిసె. ఆకుల మధ్య పసుపు పచ్చని గుమ్మడి పూలు.


ఆ గుడిసె పేద రైతుది. అతనికో మేక ఉంది. దాని నెప్పుడూ గుడిసె తలుపుకే కట్టి వేస్తారు. ఆ మేక కడుపునిండా తిన్నది; హాయిగా నెమరు వేస్తూఉన్నది; నిలబడే ఉన్నది, గుడిసె మీద ఆకుల్లో ఎలుకలున్నాయి. అవి అటూ ఇటూ పరుగెత్తుతున్నాయి. ఓ ఎలుక పెద్ద గుమ్మడి పండు కాడ కొరికింది. కొండల్నే పిండిగా చేసే ఎలుకకు గుమ్మడి పండో లెక్కా... పక్కా!


ఇంకేం! కాడ 'పుటుక్కున' తెగింది. గుడిసె మీన్నుండి గుమ్మడి పండు 'జరజర' జారింది. నెమరు వేస్తున్న మేకమీద 'డుబుక్కున' పడింది. హఠాత్ ఘటన! మేక బెదురుకుంది 'మే' అంది.


ఆ అమ్మాయి విడుపుకథ ఆపింది. అందరిదిక్కు చూసి గలగలా నవ్వింది. అందరూ 'పుటుక్కు, జర జర డుబుక్కు, మే' అంటూ నవ్వారు.


ఆ నవ్వుల తళతళలు ఇంటింటా ప్రసరించాయి. వీధుల్లో కాంతిని నింపాయి.ఈ కథ ఆ నగరం రాజ- చెవిలో దూరింది. రాజు పండితుల్ని అడిగాడు. శబ్దార్థాలు మాత్రమే తెలిసిన పండితులకిది తలకు మించిన కార్యమైంది.


ఇది ఏదో సంఘటనకు ముడి అనుకున్నారు. ఆ చిక్కుముడి విప్పితే గాని దీని అర్థం తేలదనుకున్నారు. అందుకే రాజును వారం రోజుల గడువడిగారు. పండితులు జనపదాలపై పడ్డారు. శబ్దాలు తెలుసు; శబ్దార్థాలు తెలుసు; కాని జరిగిన సంఘటన తెలువదు. మొత్తంమీద జనహృదయ సంశోధనం చేసి సాధించారు. కొండను త్రవ్వి ఎలుక పట్టారన్న సామెత ఎలాంటిదైనా తవ్వితే గాని అంతకు అంత దొరకదు మరి! ఇంత దొరికినప్పుడు అంతా అర్థమవుతుందిగా మరి!

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️ ☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...