Sunday 10 March 2024

శివ మహిమ (11-Mar-24, Enlightenment Story)

 శివ మహిమ

🌺🍀🌺🍀🌺🌺🍀

ప్రపంచాన్ని నిర్వహించే పరమ చైతన్యాన్ని 'జ్యోతి'గా వేదం వర్ణించింది. సూర్య, నక్షత్రాదులకూ ప్రకాశాన్నిచ్చి, విశ్వ చలనానికి హేతువైన ఆ 'పరంజ్యోతి' శుద్ధమై, శాంతమై, శుభమై ఉన్న స్వయంప్రకాశ పరమేశ్వర స్వరూపం. అదే అన్నింటిలో లీనమై ఉంటూ, అన్నింటినీ లీనం చేసుకొనేది కనుక 'జ్యోతిర్లింగం' అంటారు. ఆది- మధ్య-అంతం లేని అఖండ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం అత్యంత ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం.



తపస్సు-యోగం-శాంతం... ఈ మూడూ మూర్తీభవించిన శివతత్త్వం, తన స్వాభావిక పరాశక్తితో ప్రత్యణువును శాసిస్తుంది. ఆ శక్తినే జగన్మాతగా, శక్తిమంతుని ఈశ్వరుడిగా, వారిరువురి ఏకత్వాన్ని 'అర్ధనారీశ్వరుడి'గా సంభావించారు. ఋషులు నిరంతరం సాగే సృష్టి స్థితి లయల చలనాన్ని నాట్యంగా, ఆ చలన కారకుని 'నటరాజు'గా సాక్షాత్కరించుకున్నారు. ప్రసిద్ధిగా భారతీయులు ధ్యానించి పూజించే శివుడి రూపాల్లోను, లింగాకారంలోను ఎన్నో తాత్త్విక, జ్ఞాన విశేషాలు దాగి ఉన్నాయని- వేదాది ఆర్షగ్రంథాలను, విజ్ఞానశాస్త్రాన్ని సమన్వయించి ఎందరో విజ్ఞులు వ్యాఖ్యానించారు.

హిమాలయాల కేదారేశుని మొదలుకొని, సేతువులోని రామేశ్వరం వరకు భారతదేశ 'ఆసేతుహిమాచలం' ఎన్నెన్నో ప్రసిద్ధ శివక్షేత్రాలు నిండి ఉన్నాయి. సంవత్సరంలో ఎన్నో వారాలు, తిథులు శివార్చ నకు ప్రత్యేకమైనవని పురాణాలు, ఆగమాలు వివరించాయి.

ప్రతినెలా వచ్చే బహుళ చతుర్దశి 'మాసశివరాత్రి'గా శివధ్యాన, అర్చన, అభిషేకాది క్రియలకు ప్రశస్తమని పురాణ శాసనం. ఆ క్రమంలో మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాటి మాసశివరాత్రి 'మహాశివరాత్రి'గా ప్రఖ్యాతి పొందింది. నేడు చేసే వ్రతం సంవత్సరకాల శివారాధనాఫలాన్ని ప్రసాదిస్తుందని శైవశాస్త్రాలు చాటుతున్నాయి.

ఉపవాస, జాగరణలతో స్వయంగా శివలింగార్చన చేసుకోవడం, ఆలయాలలో శివదర్శనం విశేష ఫలప్రదాలన్న శాస్త్రోక్తి అసంఖ్యాక భక్తుల శ్రద్ధగా రూపుదిద్దుకొంది. శివనామ స్మరణ, మంత్రజపం, అర్చన, అభిషేకం, సంకీర్తన, ధ్యానం, లీలాకథా శ్రవణం, భస్మ రుద్రాక్షధారణ... ఇవన్నీ 'శివధర్మాలు' అనిపించుకుంటాయి. మహాశివరాత్రి పర్వాన్ని 'శివధర్మవృద్ధి కాలం అని శివపురాణం వర్ణించింది. పై శివధర్మాలలో ఏ ఒక్కటి ఆచరించినా, ఈ పర్వవేళ అత్యధిక ఫలాలు ఒనగూడుతాయని అనేక ఇతివృత్తాలతో పురాణ ఋషులు సోదాహరణంగా విశదపరచారు.

ధ్యాన సమాధికి సంకేతమైన శివరాత్రిలో అర్ధరాత్రి సమయాన్ని 'తురీయ సంధ్య' అని, 'లింగోద్భవ కాలం' అని అంటారు. ఆ సమయాన శివాలయాల్లో స్వామికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహిస్తారు. కొందరు ధ్యానంతో, ఇంకొందరు సంకీర్తనతో శివమయమైన ఆనందాన్ని అనుభవిస్తారు.

వీరభద్ర, భైరవాది ఉగ్ర రూపాలతోను, దక్షిణామూర్తి, అర్ధనారీశ్వర, తపోమూర్తి వంటి శాంత రూపాలతోను; ఏ రూపమూ లేని శుద్ధ జ్యోతిర్లింగంగాను... అనేక విధాలుగా తన సచ్చిదానంద లక్షణాన్ని వ్యక్తపరచే మహాదేవుడి లీలలను స్మరిస్తూ ఈ మహాశివరాత్రి పర్వాన పరమేశ్వరుణ్ని ప్రార్ధిస్తూ... శివాయనమః!


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...