Saturday 6 May 2023

గుణమే ప్రధానం కులం కాదు (11-May-23, Enlightenment Story)

 🎻🌹🙏గుణమే ప్రధానం కులం కాదు

🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸

విశిష్టాద్వైత మత స్థాపకుడైన  రామానుజాచార్యులు గారు ఒకసారి కావేరిలో స్నానం చేసి వస్తూ ఒక శిష్యుని భుజంపై చేయి వేసి నడిచారు. అది చూసిన మిగతా శిష్యులకు ఆ శిష్యుడు మీద అసూయ, గురువు గారి మీద కోపం ఒకేసారి కలిగాయి. అందుకు కారణముంది. ఆ శిష్యుడు అంటరాని కులం వాడు. “అలాంటి వాడి  భుజం మీద చేయి వేసి నడిచే ఉద్దేశం ఉంటే నదికి వెళ్ళేటప్పుడు  వేయొచ్చు. నది నుండి వస్తున్నప్పుడు వేయడం వలన నదిలో స్నానం చేసిన  ఫలితం ఏముంది?” అని వారిలో వారు గుసగుసలాడుకున్నారు. గురువుగారు అవేమీ పట్టించుకోలేదు సరికదా. ముందు ముందు ఆ శిష్యుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో శిష్యులకు గురువుగారి మీద అసంతృప్తి ఎక్కువయింది. ఆ విషయం రామానుజాచార్యులు వారు కనిపెట్టారు. అసంతృప్తి పోగొట్టాలని ఆయన అనుకున్నారు.

ఒకసారి శిష్యులు నదికి వెళ్ళినప్పుడు వారి బట్టలు తీసి రహస్య ప్రదేశంలో పెట్టించారు గురువుగారు.  అలా తమ బట్టలు దాచింది గురువుగారి ప్రియశిష్యుడే అయి ఉండొచ్చని అనుమానించారు శిష్యులు.   గురువు గారికి ఫిర్యాదు చేయడమే కాకుండా నానామాటలన్నారు అతడిని.

వారి మాటలు విన్న గురువు గారు “అలాగే. మీ బట్టలు దొంగిలించిన ఆ శిష్యుడికి తగిన శిక్ష పడాల్సిందే” అన్నారు గురువు గారు.  గురువు గారి నోట అలాంటి మాటలు వస్తాయని ఊహించలేదు  శిష్యులు.

వాళ్ళు ఆశ్చర్యపోయి  “నిజమే గురువుగారూ.  అతడిని బహిష్కరించి ఇక్కడ నుండి  పొమ్మనండి” అన్నారు. “అలాంటి శిక్ష వద్దు. దొంగతనానికి దొంగతనమే శిక్ష. మీరు వెళ్లి అతడి భార్య నగలు దొంగిలించి రండి” అని ఆజ్ఞాపించారు గురువుగారు.

గురువు గారి ప్రియ శిష్యుడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు, గురువు గారి సహకారం తోడయినందుకు సంతోషంతో ఆ శిష్యుడి ఇంటికి వెళ్లారు మిగతావాళ్ళు. అక్కడకి వెళ్లిన సమయానికి ప్రియ శిష్యుడి భార్య నిద్రపోతోంది. ఆమె మెడలో హారం, ఒకవైపు చెవి కమ్ములను దొంగిలించారు శిష్యులు. అంతలో ప్రియ శిష్యుడి భార్య మరొక వైపు దొర్లింది. ఆమెకు మెలకువ వస్తే  దొరికిపోతామనే భయంతో శిష్యులు పారిపోయి ఒక మూలన దాక్కున్నారు.

మరి కాసేపటికి ప్రియ శిష్యుడు ఇంటికి వచ్చాడు. తన భార్య ఒంటి మీద నగలు లేకపోవడం చూసి ఆమెను అడిగాడు.ఎవరో బీద బ్రాహ్మణులు నేను నిద్రలో ఉండగా తీసుకున్నారు. రెండవ వైపు చెవి కమ్మలు వాళ్ళ కివ్వాలనే  ఉద్దేశంతో నేను పక్కకి దొర్లాను. నేను కదలడం చూసి వాళ్ళు  పారిపోయినట్టున్నారు” అని చెప్పిందామె.

“ఇంకా నీది, నాది, నేను అనే భ్రమలో వున్నావు. అందుకే కదలకుండా ఉండలేకపోయావు. నీవు కదలక మెదలక ఉండుంటే వాళ్లకి చెవి కమ్మలు తీసుకుపోయే అవకాశం కలిగేది. ఒక వైపు కమ్మలు ఏమి చేసుకుంటారు? పాపం… ఎంత అవసరం ఉందో వారికి. అవసరంలో ఉన్నవాళ్ళకి పూర్తిగా సాయపడలేకపోయాము. దానం చేసే బ్రహ్మాండమైన అవకాశాన్ని పోగొట్టావు” అని ప్రియ శిష్యుడు అన్నాడు.

ఆ మాటలు దూరం నుండి వింటున్న శిష్యులు అంతకు ముందు తమ ప్రవర్తనకు సిగ్గు పడ్డారు. అక్కడ నుండి వెళ్లి జరిగిందంతా గురువుగారికి  చెప్పారు.

గురువు గారు దాచి ఉంచిన శిష్యుల బట్టలు తెప్పించి, తానే దాచినట్టు చెప్పారు.“ఆ శిష్యుడు నాకు ప్రత్యేకం కాదు. అతడి గుణగణాలు ప్రత్యేకం. వాటివల్లనే నాకు దగ్గరయ్యాడు. ఆ విషయం  గ్రహించండి. అలాంటి ఉత్తమ శిష్యుడిని ఏ గురువైనా దూరం చేసుకుంటారా?” అన్నారు  రామానుజాచార్యులు వారు.  

​శిష్యులు గురువుగారిని క్షమాపణ అడిగారు. ఆ శిష్యుడితో మంచిగా మెలగడం నేర్చుకున్నారు. ఆ శిష్యుడి పేరు చెప్పనేలేదు కదూ. అతడే ధనుర్దాసు.

మన సమాజంలో కూడా అంటరానికులం,  గొప్పకులం అనే భావాలతో కొట్టు మిట్టాడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. గొప్ప కులంలో పుట్టినవాళ్లంతా  గొప్ప వారు కాదు. కులాన్ని బట్టి గొప్ప లక్షణాలు రావు. కొంత మంది ఆ కులాల్లో పుట్టడం వలన ఆ కులానికే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మహనీయుడు అంబేద్కర్  అలాంటి కోవకు చెందుతారు. మనిషిని మనిషిగా గౌరవించాలి. వారిలో మంచి లక్షణాలు చూడాలి తప్ప కులం, మతం చూడకూడదు.


జై శ్రీమన్నారాయణ..🌞🙏🌹🎻

🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸

No comments:

Post a Comment

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే (16-May-24, Enlightment Story)

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొం...