Wednesday 3 May 2023

పిసినారి - పాత చెప్పులు (08-May-23, Enlightenment Story)

 పిసినారి - పాత చెప్పులు (నవ్వులలో ముంచెత్తె హాస్యకథ) 

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

ఒక ఊరిలో ఒక ధనవంతుడు వుండేవాడు. అతను పెద్ద పిసినారి అంతే కాదు పెద్ద మోసకారి కూడా. ఒక్కపైసా మిగుల్తాదంటే పదిమైళ్ళయినా పాక్కుంటూ వెళ్ళే రకం. గ్రామ ప్రజలకు అవసరానికి అధిక వడ్డీకి అప్పులిచ్చి ఇళ్లూ, నగలూ తాకట్టు పెట్టుకునేవాడు. వడ్డీ మీద వడ్డీలేసి జనాలను మోసం జేసేవాడు.

ఆ పిసినారికి ఒక జత పాత చెప్పులు వుండేవి. అవి ఎప్పుడో పది సంవత్సరాల క్రింద కొన్నవి. కొన్న వెంటనే అరగకుండా చెప్పుల కింద బాగా గట్టిగా వుండే టైరు ముక్క వేయించాడు. చెప్పు పైభాగం వూడి రాకుండా చుట్టూ మేకులు కొట్టించి, గట్టి దారంతో కుట్టించాడు. ఎండకు ఎండీ, వానకు తడిచీ అవి ఎంత పాతగైనా, ఎన్ని సార్లు తెగినా మరలా స్వయంగా కుట్టుకొని, మేకులు కొట్టుకునేవాడే గానీ కొత్త చెప్పులు మాత్రం కొనుక్కునేవాడు గాదు. పది రూపాయలతో పోయేదానికి ఐదువందలు ఎందుకు అనవసరంగా దండగ అనుకుంటూ ఆ చెప్పులతోనే కాలం గడుపుతుండేవాడు. రోజు రోజుకీ మేకులు ఎక్కువై అవి బరువు పెరిగిపోతావున్నాయి. పైన తోలు చివికి పీలికలై మాటిమాటికీ తెగి పోతావున్నాయి. దాంతో “ఇక లాభం లేదు. వాటిని వదిలించుకోవాలి" అనుకున్నాడు. కానీ కొత్తవి కొనడానికి మనసొప్పలేదు. ఆలోచిస్తావుంటే ఒక వెధవ ఆలోచన వచ్చింది.

దాంతో సాయంకాలం ఒక గుడి దగ్గరకు పోయాడు. చెప్పులు బయట వదిలి లోపలికి పోయాడు. కాసేపటికి లోపల హారతి ఇచ్చే సమయం దగ్గర పడింది. అందరూ దేవుని విగ్రహం ముందుకు చేరుకున్నారు. ఇదే సందనుకొని పిసినారి బైటికి వచ్చాడు. గుడి బైట ఎవరూ లేరు. అక్కడ విడిచిన చెప్పుల జతల్లో ఒక మంచి జత తనకు సరిపోయేది వేసుకొని అక్కడినుంచి గబగబా వెళ్ళిపోయాడు. యుద్ధం చేయకుండానే పక్క రాజ్యాన్ని జయించినంత ఆనందంగా పొంగిపోయాడు. కానీ అప్పుడు తెలీదు వానికి ముందుంది ముసళ్ళ పండగ అని.

ఆ చెప్పుల జత ఆ ఊరి Sub Inspectorయిది. భార్యాబిడ్డలతో గుళ్ళో దేవునికి అభిషేకం చేయించి బైటికొచ్చి చూస్తే చెప్పుల్లేవు. వెదుకుతా వుంటే... “చెప్పులే కాపాడుకోలేనోడు, ఊరి జనాలనేం కాపాడతాడు" అంటూ ఒకడు వెనుకనుంచి కిసుక్కున నవ్వాడు. Sub Inspector రగిలిపోయాడు. కళ్ళు ఎండు మిరపకాయల్లా ఎరుపెక్కిపోయాయి. “ఎవడ్రా ఆ కూత కూసింది" అంటూ వెనక్కు తిరిగి ఒకడుగు ముందుకు వేశాడు. అక్కడొక చిన్న గాజు ముక్క వుంది. అది కసుక్కున కాల్లో దిగింది. బాధతో, కోపంతో అల్లాడిపోయాడు. వెంటనే ఒక పోలీసుని పిలిచి 

“రేయ్... నా చెప్పులు వేసుకొని పోయినోడు  ఖచ్చితంగా వాని చెప్పులు ఇక్కడే వదిలేసి వుంటాడు. గుడి మూసేంత వరకు వుండి ఆ చెప్పులు కనిపెట్టు" అన్నాడు. ఆ పోలీసాయన “సరే దొరా" అంటూ తలాడించాడు. గుడి మూసే సమయానికి పిసినారి పాత చెప్పులు మాత్రమే అక్కడ మిగిలాయి. వాటిని తీసుకుపోయి Sub Inspector ముందు పెట్టాడు. వాటికి చూస్తానే ఎస్సయి అదిరిపడ్డాడు. నలభై, యాభై సంవత్సరాలు భూమిలో పాతి పెట్టి తీస్తే ఎలా వుంటాయో అలా వున్నాయవి. ఏ శ్రీకృష్ణదేవరాయలో యుద్ధంలో వాడిన చెప్పులు అని పురావస్తు ప్రదర్శనశాలకు అమ్మినా అమ్మవచ్చు.

SI ఆలోచనలో పడ్డాడు. కుంటుకుంటూ అటూ, యిటూ తిరిగాడు. పది మంది పోలీసులని పిలిచి "రేపు సాయంత్రంలోగా ఇవి ఎవరివో కనిపెట్టాలి. పొద్దున్నే పోయి గుడి చుట్టూ అందరినీ విచారించండి. దొంగ దొరికేంతవరకు మీరు ఇంటికి పోవడానికి వీల్లేదు" అని ఆజ్ఞాపించాడు. పోలీసులు లోపల్లోపలే తిట్టుకుంటూ మూగెద్దుల్లా “అలాగే దొర” అంటూ తలాడించారు.

తరువాత రోజు పొద్దున్నే వేట మొదలైంది. చివరికి ఒక అంగడివాడు “ఎప్పుడూ తాబేలులా అడుగుతీసి అడుగేస్తూ నడిచే పిసినారి నిన్న సాయంత్రం వేగంగా టకటకటక నడుచుకుంటూ పోవడం గమనించాను" అని తీగ అందించాడు. వెంటనే పోలీసులు డొంక కదిలించి పిసినారి ఇంటిని చుట్టుముట్టారు. లోపలికి పోయి చూస్తే ఇంకేముంది Sub Inspector కొత్త చెప్పులు మూలన చిరునవ్వులు నవ్వుతా కనబడ్డాయి. వెంటనే ఆ చెప్పులను, పిసినారిని పట్టుకొని ఎస్సయి ముందు హాజరు పరిచారు.

Sub Inspector పోలీసులకు సైగ చేశాడు. మంచోళ్ళనే అన్యాయంగా కిందామీదా ఏసి తన్నే పోలీసోళ్ళకు, వెనుక ఎవరూ లేని నిజమైన దొంగ దొరికితే వూరుకుంటారా... అదీగాక పొద్దున్నుంచీ వీధి వీధి తిరిగి తిరిగి మంచి కసి మీదున్నారు. ఇంకేముంది ముందూ వెనుకా వాచిపోయేలా పోలీసులు కొట్టుడు కొట్టినారు. తప్పయిపోయిందని Sub Inspector కాళ్ళు పట్టుకున్నాడు. ఒక ఇరవై వేలు సమర్పించుకొని కేసు పెట్టకుండా పాత చెప్పులు తీసుకొని బైట పడ్డాడు.

ఇంటికొచ్చినాక కాళ్ళకున్న చెప్పులు చూసి “చీ... చీ... దరిద్రం చెప్పులు. కొత్త చెప్పులు కొనింటే కేవలం ఐదు వందలతో అయిపోయేది. ఇప్పుడు అనవసరంగా ఇరవై వేలు పోయింది" అని బాధపడుతూ కోపంతో ఆ చెప్పులను వీధిలోకి విసిరి పడేశాడు.

సరిగ్గా అదే సమయానికి ఒకామె అందమైన బొచ్చుకుక్కతో వీధిలో పోతూవుంది. ఈ చెప్పులు సర్రున దూసుకు వచ్చి సరిగ్గ దాని తలకు బలంగా తగిలాయి. అవి అలాంటిలాంటి మామూలు మెత్తని చెప్పులు కాదు కదా. దాన్నిండా వంద మేకులు దిగి రాయికన్నా గట్టిగా వున్నాయి. దాంతో పాపం ఆ బొచ్చు కుక్క తల పగిలి అక్కడికక్కడే చచ్చిపోయింది.

అది చూసి దాని యజమాని గట్టిగా బాధతో కెవ్వుమని కేక పెట్టింది. పూనకం వచ్చినదానిలా వూగిపోయింది. పరుగెత్తి ఇంట్లోకి దూరి పిసినారి అంగీ పట్టుకొని విసురుగా వీధిలోకి లాక్కొని వచ్చింది. “అన్యాయంగా ఏ పాపం చేయని నా బుజ్జి కుక్కపిల్లను పొట్టన పెట్టుకున్నావు గదరా. మనిషివా, పశువ్వా నువ్వు" అంటూ పోలీసు స్టేషనుకు లాక్కొని పోయింది. ఎస్సయి ఆ పిసినారిని చూడగానే “ఏంరా... మరలా ఏం దొంగతనం చేసినావు, నిన్న తన్నిన తన్నులు అప్పుడే మరిచి పోయినావా" అన్నాడు లాఠీ తీస్తూ.

"అయ్యా... అయ్యా... పొరపాటయిపోయింది. నేను కావాలని చేయలేదు. ఏదో డబ్బులు పోయిన బాధలో ఆ పాత చెప్పులు బైటకి విసిరి పడేస్తే ఇలా జరుగుతుందని అనుకోలేదు" అంటూ ఎస్సయి కాళ్ళూ, ఆమె కాళ్ళూ మార్చి మార్చి పట్టుకొని వేడుకున్నాడు.

చివరికి ఆమె “అది మనూర్లో దొరికే అలాంటిలాంటి మామూలు కుక్క కాదు. అరుదైన జాతికుక్క. యాభై వేలు ఖర్చుపెట్టి వారం కిందటే ఢిల్లీ నుంచి తెప్పించి, పసిపిల్లను పెంచినట్టు అపురూపంగా పెంచుకుంటున్నా. నాకు అచ్చం అలాంటి మరొక జాతి కుక్కను తెచ్చిచ్చినా సరే... లేదా నా యాభైవేలు నాకిచ్చినా సరే. లేదంటే తగ్గేదే లేదు” అనింది గడ్డం కింద చేయి పెట్టి కస్సుమని రుద్దుకుంటూ.

ఆ పిసినారి ఏమీ చేయలేక కుక్కను మీరే తెచ్చుకోమని యాభై వేలు అమె చేతిలో పెట్టాడు. కొట్టకుండా వదిలేసినందుకు Sub Inspector కి మరొక పదివేలు సమర్పించుకొని తిరిగి పోతావుంటే అక్కడున్న పోలీసు “ఇదిగో నీ పాత చెప్పులు. కేసు పెట్టాల్సి వస్తుందేమో అని సాక్ష్యంగా తెచ్చాం" అంటూ అప్పజెప్పాడు. పిసినారి ఆ చెప్పులు వేసుకొని నీరసంగా ఇంటికి చేరుకున్నాడు.

ఆ పాత చెప్పులు చూస్తుంటే కోపం పెరిగిపోతావుంది. వీటిని ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఆ రోజు అర్ధరాత్రి గునపం తీసుకొని, ఊరి చివరనున్న ఒక తోటలోకి చేరుకున్నాడు. అక్కడొక పెద్ద చింతచెట్టు వుంది. దాని కింద గుంత తవ్వి ఆ చెప్పులు పాతి పెట్టేస్తే పీడ పోతుందని గుంత తవ్వసాగాడు. కొంచం లోపలికి తవ్వగానే కళ్ళు జిగేలుమన్నాయి. ఏముందబ్బా అని చేయి పెట్టి చూస్తే ఒక నగల మూట బైట పడింది. దాన్నిండా వజ్రాలతో పొదగబడిన బంగారు నగలు ధగధగా మెరిసిపోతున్నాయి. "ఆహా... లక్ష్మీదేవి వెదుక్కుంటా వచ్చింది. అంతా ఈ పాత చెప్పుల వల్లనే. ఇంతవరకూ పోయిందానికి పదింతలు దొరికింది" అనుకుంటూ సంబరంగా చెప్పులను తీసి కళ్ళకు అద్దుకుని ముద్దు గూడా పెట్టుకున్నాడు.

అంతలో ఆ పిసినారి మొహమ్మీద టార్చిలైట్ వెలుతురు పడింది. అక్కడ కాపలా వున్న తోటమాలి “ఎవర్రా నువ్వు... ఇంత రాత్రి తోటలో ఏం చేస్తున్నావు" అంటూ గట్టిగా అరిచాడు. పిసినారి అదిరిపడి నగలమూట గట్టిగా పట్టుకొని పరిగెత్తడానికి పైకి లేచాడు. కానీ అంతలోపే తోటమాలి సర్రున దూసుకువచ్చి వెనుకనుంచి గట్టిగా వాటేసుకొని “దొంగ... దొంగ” అంటూ అరవసాగాడు. అంతే... తోట చుట్టుపక్కల వున్న కొన్ని ఇళ్ళలో లైట్లు వెలిగాయి. ఐదారుమంది వచ్చి పిసినారిని గట్టిగా పట్టుకొని పోలీసులకు ఫోన్ చేసి అప్పజెప్పారు.

ఎస్సయి పిసినారిని చూసి అదిరిపడ్డాడు. "ఇదేందిరా... ఆఖరికి దొంగతనాలు గూడా చేస్తున్నావా... నిజం చెప్తావా ఎగిరెగిరి తన్నాల్నా" అన్నాడు లాఠీ తీసి వీపుమీద గట్టిగా ఒక్కటిస్తూ.

“అయ్యా... నాకేమీ తెలీదయ్యా" అంటూ కళ్ళనీళ్ళతో వీపు రుద్దుకుంటూ జరిగిందంతా వివరించాడు. Sub Inspector ఆ నగల మూట విప్పి చూశాడు. అవి ముందురోజు ఆ ఊరిలో బాగా పేరున్న ఒక నగల కొట్టులో దొంగతనం చేసినవి. ఆ నగల వ్యాపారి ఆ ఊరి పోలీసు ఉన్నతాధికారి పెళ్ళాం చిన్న తమ్ముడు. దాంతో అతను పోలీసులను అందరినీ పిలిపించి “దొంగను పట్టుకుంటారో, ప్రాధేయ పడతారో నాకు తెలియదు. రెండు రోజుల్లో ఆ నగలన్నీ నా ముందు వుండాలి. రవ్వ తక్కువయినా సరే ఒక్కపైసా గూడా లంచం దొరకని మారుమూల పల్లెకు బదిలీ చేసి పడేస్తా" అని హెచ్చరించాడు. దాంతో ఎక్కడెక్కడి దొంగలందర్నీ పట్టుకొచ్చి లోపలేసి వుతుకుతున్నారు వివరాల కోసం. పిసినారే దొంగతం చేసినాడేమోనని మొదట అనుమానించాడు Sub Inspector. కానీ ఆ దొంగతనం జరిగిన సమయంలో అతను పోలీసు స్టేషనులో తనముందే వున్నాడు. దాంతో అతని మాటలు నమ్మి నగలన్నీ వున్నాయో లేదో పరిశీలించాడు. అన్నీ ఉన్నాయి గాని ఒక్క వజ్రాల ఉంగరం మాత్రం లేదు. “చూడు... నిజం నాకు తెలుసు. కానీ నువ్వు దొంగతనం చేశావు అనడానికి సాక్ష్యులు బలంగా వున్నారు. లేకున్నా మేము పుట్టిస్తాం. కాబట్టి ఎలాగైనా సరే ఆ వజ్రాల ఉంగరం ఒక్కటి తెచ్చిస్తే నిన్ను వదులుతా. లేదంటే నువ్వే దొంగవని ఎస్పీ ముందు నిలబెడతా... ఏడు సంవత్సరాలు ఊచలు లెక్కబెట్టాల్సిందే" అన్నాడు. పిసినారి ఏమీ చేయలేక నెత్తీనోరు లబలబ కొట్టుకుంటూ అచ్చం అలాంటి వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని లక్ష రూపాయలు ఖర్చుపెట్టి ఇంకో అంగడిలో కొనుక్కొచ్చి Sub Inspectorకి అందించాడు. తనను దయతో కేసు పెట్టకుండా వదిలి వేసినందుకు ఒక ఇరవై వేలు భక్తిగా సమర్పించుకున్నాడు.

పిసినారి ఇంటికి రాకుండా సక్కగా ఊరి బైటికి వచ్చి హైవేమీద నడవసాగాడు. అక్కడ లారీలు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి పోతూ వుంటాయి. కాలికున్న చెప్పులు తీసి సర్రున దూసుకు పోతున్న ఒక లారీలోకి విసిరి పడేశాడు. అది ఖాళీ లారీ. పంజాబుకి పోతూవుంది. హమ్మయ్య పీడ విరగడైందని సంబరంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో వున్న ఎండిపోయిన రొట్టెలు పదినిముషాలు నీళ్ళలో నానబెట్టుకొని తిని కడుపునిండా నీళ్ళు తాగి నులక మంచమ్మీద పడుకున్నాడు.

ఇక్కడ లారీ పోతావుంది గదా... దారిలో దానికి ఒకచోట సక్కగా ఎత్తయిన దారి వచ్చింది. ఆ లారీలో వున్న చెప్పులు కుదుపులకి కొంచం కొంచం కిందకి జారుతా వున్నాయి. లారీకి వెనుక తలుపు సరిగా వేయలేదు. దాంతో గొలుసు వూడి తలుపు కిందికి వేలాడుతోంది. చెప్పులు సర్రున జారి వచ్చి దభీమని కిందపడ్డాయి. అలా పడడం పడడం వాటిలోంచి కొన్ని ఇనుప మేకులు బైటకు వచ్చి సక్కగా ఆకాశం వైపు చూడసాగాయి.

ఆ లారీ వెనుకనే ఇంకో లారీ నిండు గాజు సామానుతో వస్తావుంది. దాని కుడి టైర్లు ఈ మేకుల మీదకి ఎక్కాయి... అంతే ఒక్కసారిగా తుస్సుమని గాలిపోయి ఒక వైపుకి ఒరిగిపోయింది. అటువైపు పెద్ద గుంత వుంది. లారీ సామానుతో సహా దభీమని ఆ గుంతలో పడిపోయింది. లారీలోని సామానంతా కిందపడి ముక్కలు ముక్కలుగా ఐపోయాయి. విషయం తెలిసి పోలీసులు పెద్ద క్రేన్ తో వచ్చి కష్టపడి ఆ లారీని గుంతలోంచి తీసి నిలబెట్టారు. ఆ లారీ ఎలా పడిపోయిందా అని చూస్తే దాని ముందుగాన్లో దిగిన ఇనుప మేకులు, పక్కన పాత చెప్పులు కనబడ్డాయి. ఆ చెప్పుల వల్లనే ఇదంతా జరిగిందని అర్థమైంది. ఆ చెప్పులెవరివో పోలీసులకు తెలుసు గదా... సక్కగా పిసినారి ఇంటికి వచ్చి మంచమ్మీద పడుకున్నోన్ని పడుకున్నట్లు అట్లాగే లేపి సక్కగా స్టేషన్‌కు తీసుకుపోయారు.

Sub Inspector ఆ పిసినారిని చూడగానే తల పట్టుకొని “ఇదేందిరా... మనూర్లో ఎక్కడ ఏం జరిగినా ఆఖరికి నువ్వే పట్టుబడుతున్నావు. ఆ లారీలో వున్న గాజు సామాను నాలుగు లక్షలవుతుంది. లారీని బాగు చేయడానికి మరొక లక్ష. మొత్తం అయిదు లక్షలు కడితే నిన్ను వదులుతా... లేదంటే పద్నాలుగేళ్ళు వూచలు లెక్కబెట్టడానికి సిద్ధంగా వుండు” అన్నాడు లాఠీ తీస్తూ.

పిసినారి ఏడుపు ముఖంతో ఎక్కడెక్కడ దాచి పెట్టిన డబ్బంతా తీసుకొచ్చి లారీ యజమానికి అప్పజెప్పాడు. కేసులేకుండా పంచాయితీ తెంచినందుకు ఎస్సయికి యాభై వేలు సమర్పించుకున్నాడు. విచారంగా పోతావుంటే "ఇదిగో ఈ పాత చెప్పులు మాకెందుకు. ఇవి ఇక్కడే వుంటే దరిద్రం నిన్ను వదిలి మమ్మల్ని పట్టుకున్నా పట్టుకుంటాది. తీసుకుపోయి ఏం చేసుకుంటావో చేసుకోపో" అంటూ పోలీసులు వాటిని అందించారు. పిసినారి పళ్ళు పటపటలాడించుకుంటూ ఆ పాత చెప్పులు వేసుకొని ఇంటికి వచ్చాడు.

ఆ చెప్పులను చూస్తావుంటే నెమ్మది నెమ్మదిగా పట్టుకున్న జంతువును మింగే కొండచిలువల్లా కనబడ్డాయి. ఇక లాభం లేదు. మరలా ఎప్పటికీ తిరిగి రాకుండా వాటిని కాల్చి బూడిద చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఒక డబ్బా కిరసనాయిలు తెచ్చి ఆ చెప్పుల మీద పోసి అంటించాడు. ఒక్కసారిగా అవి భగ్గు మన్నాయి. మంటలు మనిషంత ఎత్తున ఎగిసిపడ్డాయి. అవి కాలిపోతావుంటే సంబరంగా వాటినే చూడసాగాడు.

అంతలో ఒక్కసారిగా గాలి లేచింది. అక్కడున్న కొన్ని ఎండు ఆకులొచ్చి ఆ మంటపై పడి అవి 

కూడా భగ్గుమని అంటుకున్నాయి. అంతలో గాలి మరలా మరొక్కసారి బలంగా వీయడంతో ఆ మండుతున్న ఆకులు ఎగిరి ఇంటి ముందున్న ఎండు కట్టెలపై పడ్డాయి. అవి బాగా ఎండి వుండడంతో ఒకదానికొకటి భగభగమని అంటుకున్నాయి. దానికి కాస్తా గాలి తోడయింది. ఆ కట్టెలను ఆనుకునే పిసినారి ఇళ్ళు వుంది. మంటలు ఒక్కసారిగా ఎగిసి పిసినారి ఇంటిని చుట్టుముట్టాయి. అంతే... చూస్తుండగానే ఇళ్ళంతా అంటుకుపోయింది. పిసినారి లబలబలబ కొట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళబోయాడు.

కానీ ఆ మంటలకు చేతగాలేదు. పిసినారి తినీ, తినక, అందరినీ మోసం చేస్తూ ఇంట్లో దాచిపెట్టుకున్న డబ్బు, దొంగ పత్రాలు అన్నీ కాలి బుడిదయ్యాయి. ఆఖరికి ఒంటి మీదున్న బట్టలు తప్ప ఏమీ మిగలలేదు. విచారంగా నడుస్తుంటే కాళ్ళకు ఏవో తగిలాయి. ఏంటబ్బా అని చూస్తే సగం కాలిన చెప్పులు 'అప్పుడే నిన్ను వదిలేది లేదు' అంటూ వెక్కిరిస్తా కనబడ్డాయి.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️


No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...