Friday, 25 August 2023

కొత్త కారు - పాత జ్ఞాపకం (28-Aug-23, Enlightenment Story)

కొత్త కారు - పాత జ్ఞాపకం

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆడిటర్ వేణుగోపాల్ గారు సేలం నివాసి. మహాస్వామి వారికి పరమ భక్తుడు. కంచి శంకర మఠానికి కూడా అతనే ఆడిటర్. తన జీవితంలో ఏమి జరిగినా అది అంతా ‘పరమాచార్య అనుగ్రహం’ అనుకునే మనస్తత్వం కలవాడు. మహాస్వామి వారి అనుగ్రహం వల్లనే తను ఈ వృత్తిలో ఉన్నాడు. కొద్దిగా స్థిరత్వం పొందిన తరువాత వేణుగోపాల్ ఒక కార్ కొన్నారు. మహాస్వామి వారికి తన కొత్త కారును చూపించాలనే కోరికతో కార్లో కాంచీపురానికి బయలుదేరారు. శ్రీమఠం ముందు కారును నిలిపిన తరువాత మహాస్వామి వారి మఠంలో లేరని, వారు కలవైలో విడిది చేసి ఉన్నారని తెలిసింది. వెంటనే వారు కార్లో కలవై బయలుదేరిపోయారు. మహాస్వామి వారు విడిది చేసిన చోట బయట కారును నిలిపి లోనికి వెళ్ళారు.


మహాస్వామి వారు వేణుగోపాల్ ని చూసిన వెంటనే, అతను చెప్పకముందే మహాస్వామి వారు “ఏంటి కార్ కొన్నావా?” అని అడిగారు. మహాస్వామి వారు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన త్రికాలవేదులు. 

ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఆడిటర్ “అవును పెరియవ” అని చిన్నగా సమాధానం చెప్పారు. మహాస్వామి వారికి ముందుగా తెలపకుండా కార్ కొన్నందుకు తప్పుచేసానేమో అని ఒకింత బాధపడ్డారు. కాని వారికి ఉన్నదాంట్లో సౌఖ్యంగా బ్రతకటం మహాస్వామి వారు ఎన్నడూ తప్పు పట్టేవారు కాదు. వారు మనసులో అలా అనుకున్న వెంటనే మహాస్వామి వారు,

“అది మంచి పనే. సరేలే కాని నువ్వు ఇప్పుడు నాకు ఒక పని చేసిపెట్టగలవా?” అని అడిగారు. వారు అవునన్నట్టు తల పంకించారు, మహాస్వామి చెప్పిన పని చేసి పెడతాను అని.

అప్పుడు మహాస్వామి వారు, “నువ్వు ఇక్కడి నుండి కొద్దిదూరం వెళ్ళి కుడి ప్రక్కకి తిరిగి అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళు. నీకు ఒక చెరువు కనపడుతుంది. ఒక ముసలివాడు ఆ చెరువు గట్టు పైన కూర్చొని ఉంటాడు. నువ్వు అతన్ని నీ కార్లో ఇక్కడకు తీసుకుని రావాలి. ఏమి, చేస్తావా?” అని అడిగారు. మహాస్వామి వారు ముగించక ముందే ఆడిటర్ గారు బయలుదేరిపోయారు. 

విల్లు నుండి వదిలిపెట్టిన బాణంలా ఆడిటర్ కార్లో దూసుకుని వెళ్ళిపోయారు. మహాస్వామి వారు చెప్పినట్టు గడ్డంతో ఉన్న ఒక ముసలాయన చెరువు గట్టు పైన కూర్చున్నాడు. మహాస్వామి వారు చెప్పినది ఇతన్ని తీసుకురమ్మననేనా అతనికి తెలియదు. మహాస్వామి వారు ఏమైనా చెపితే దానికి చాలా విషయం ఉంటుంది. ఆ వృద్దుడి దగ్గరకు వెళ్ళి మహాస్వామి వారు చెప్పిన విషయాలను చెప్పాడు. ”నన్ను పిలిచారా? అయితే ఖచ్చితంగా నేను నీతో వస్తాను” అని చెప్పి వయోభారం వల్ల వణుకుతూ ఆడిటర్ గారి కొత్త కారులో ఎక్కాడు. వారు కలవై చేరుకున్నారు మహాస్వామి వారి ముందు ఆ వృద్ధుడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

“ఏమి బావున్నావా?” అని మహాస్వామి వారు ఆ వృద్ధుడిని అడిగారు.“పర్లేదు బావున్నాను”

మహాస్వామి వారి సూచనలతో పాటు శ్రీమఠం సాంప్రదాయంతో గౌరవించారు. ఆ వృద్ధుని తృప్తి కొరకు పంచెలు, దుశ్శాలువలు కొద్ది పైకము ఇచ్చి, మహాస్వామి వారు ఆడిటర్ తో “ఇతనిని తీసుకుని వెళ్ళి ఎక్కడ దిగుతాడో అక్కడ వదిలి, నువ్వు తిరిగి రా” అని చెప్పారు. 

ఆ ముసలాయనకు మళ్ళా కార్ ప్రయాణం. అతను చెప్పిన చోట వారిని వదిలి, ఆడిటర్ గారు తిరిగి వచ్చారు. అతను ఆ వృద్ధుడు గురించి ఏమి అడగలేదు. మహాస్వామి వారు కూడా ఏమి చెప్పలేదు. ఆడిటర్ వేణుగోపాల్ మహాస్వామి వారు ముందు చేతులు కట్టుకుని నిలబడియున్నారు. ”నీవు తీసుకువచ్చిన అతను ఏవరో నీకు తెలియునా?” తెలియదు అన్నట్టు తల అడ్డంగా ఊపారు. 

“నా చిన్నతనంలో హఠాత్తుగా ఒక రోజు నన్ను తన గుర్రపు బండిలో ఇక్కడకు తీసుకుని వచ్చాడు. ఎందుకు అని అప్పుడు నాకు తెలియదు. ఇక్కడకు వచ్చిన తరువాతనే నేను 68వ పీఠాధిపతిని అని చెప్పారు. నాకు అప్పుడు సంస్కృతము కూడా తెలియదు. వేదములు కూడా ఆమ్నాయం చేయలేదు. ఇక్కడకు వచ్చిన తరువాతనే అన్నీ నేర్చుకున్నాను. నువ్వు గమనించావా. ఎన్ని సంవత్సరములు గడచిపోయాయో. ఈ మహాత్ముడే (వృద్ధుడు) నన్ను గుర్రపు బండిలో ఎక్కించుకుని ఇక్కడకు తీసుకుని వచ్చాడు. నన్ను ఎందుకు పిలిపించారో ఇతనికి కూడా తెలియదు. అతన్ని ఎలా మరచిపోగలను. హఠాత్తుగా గుర్తుకువచ్చాడు. అందుకే నీ కార్లో ఇక్కడికి తీసుకురమ్మన్నాను” అని అన్నారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...