* దైవాన్ని తలిస్తే ఎలాంటి గండాలైనా గట్టెక్కుతాయి*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అదొక చిన్న ఊరు. ఆ ఊళ్లో సుప్రసిద్ధుడైన ఒక జ్యోతిష్కుడు నివసిస్తున్నాడు. జాతకం నిశితంగా పరిశీలించి, గణించి చూసి ఆయన చెప్పిన ఫలితం ఎన్నడూ తప్పు అయినట్లు ఎవరూ కనీవినీ ఎరుగరు. ఆయన అంతటి ఘనత వహించిన జ్యోతిష్కుడు.
ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఆయన వద్దకు తన జాతకాన్ని చూపించుకోవడానికి ఒక పేద రైతు వచ్చాడు. ఆ రైతు తనను పరిచయం చేసుకొని తన జాతకాన్ని జ్యోతిష్కునికి ఇచ్చాడు. ఆదిత్యయోగీ..
ఆ జాతకాన్ని క్షుణ్ణంగా గణించి, చూసిన ఆ జ్యోతిష్కుడు కంగారుపడ్డాడు. ఆ కంగారుకు కారణం, ఆ రైతుకు ఆ రాత్రి ఎనిమిది గంటలకు ప్రాణాంతకమైన ఒక పెద్ద గండం ఉండటమే! ఆ జ్యోతిష్కుడు తన కంగారును కప్పిపుచ్చుకొంటూ, రైతుతో సూటిగా ఏమీ చెప్పకుండా, 'అయ్యా! ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఏదో పనుల మధ్య దానిని గురించి మరిచిపోయాను. మీ జాతకాన్ని నా వద్దే ఉంచండి. దయచేసి రేపు ఉదయం మీరు రాగలిగితే అప్పుడు నిశితంగా గణించి చెబుతాను' అని చెప్పాడు. జ్యోతిష్కుడు చెప్పింది నిజమని నమ్మిన రైతు, కృతజ్ఞతలు తెల్పి మర్నాడు వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
రైతు వెళ్లిపోగానే జ్యోతిష్కుడు తన భార్యను పిలిచి ఆమెతో, 'ఇప్పుడు నన్ను చూడటానికి ఒక వ్యక్తి వచ్చాడే, అతడి ఆయుష్షు నేటి రాత్రితో ముగియనున్నది. ఆ విషయం అతడికి చెప్పకుండా, 'రేపు వచ్చి చూడండి' అని చెప్పి పంపించి వేశాను. అతడు ప్రాణంతో ఉంటేనే కదా రేపు నన్ను వచ్చి చూడగలడు' అని చెప్పాడు.
జ్యోతిష్కుని ఇంటి నుండి బయలుదేరిన రైతు, సమీపంలో ఉన్న తన గ్రామానికి నడిచిపోతున్నాడు. దారిలోనే పొద్దుగూకి చీకట్లు మెల్లగా కమ్ముకోసాగాయి. అది వానాకాలం కావడంతో సన్నగా వానజల్లు ప్రారంభమైంది. కాసేపట్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టిగా ఆ వాన పరిణమించింది.
అప్పుడు రైతు ఒక అడవి మార్గం గుండా పోతున్నాడు. తలదాచుకోవడానికి చుట్టూ కలయజూడగా కాస్త దూరంలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయం కనిపించింది. అంతే ! ఒక్క పరుగున వెళ్లి శివాలయం ముందున్న మండపంలో ఒదిగి నిలబడ్డాడు. మండపంలో నిలబడ్డ అతడు శిథిలావస్థమైన ఆలయస్థితిని చూసి ఎంతో విచారపడ్డాడు. 'హా! ఆలయ గర్భగృహం మండపం ఈ మేరకు శిథిలమైపోయిందే! అక్కడక్కడ మర్రి, రావిచెట్లు మొలకెత్తనారంభించాయి. నా వద్ద సరిపడేంత ధనం ఉంటే ఈ ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్నే ముందు చేపడతాను' అని మనసులో అనుకున్నాడు. ఆదిత్యయోగీ..
అంతటితో ఆగక అతడి ఆలోచనలు మరింత విస్తృతించాయి. ఆ శివాలయాన్ని పునరుద్ధరించినట్లు మానసికంగా భావించాడు. గోపురం, రాజగోపురం, ప్రాకారాలు, మండపాలు వంటి వాటిని మానసికంగా భావించాడు. కుంభాభిషేకం నిర్విఘ్నంగా జరిపించి గర్భగృహంలో శోభస్కరంగా కొలువుదీరిన మహాశివునికి సాష్టాంగ ప్రమాణాలు అర్పించాడు.
ఇంతటి మహోన్నత చింతనలతో మునిగి మైమరచిపోయిన ఆ రైతు, తను నిలబడి ఉన్న మండపం పైకప్పు వంక యథాలాపంగా చూశాడు. అక్కడ సరిగ్గా అతడి తలకు పైన పాడుపడ్డ మండపం ఒకవైపు నుండి జడివాన శబ్ధానికి బైటకు వచ్చిన ఒక కాలసర్పం పడగవిప్పి అతడిని కాటువేయడానికి సిద్ధంగా ఉండడం కనిపించింది. అది చూసిచూడగానే, 'అయ్యయ్యో!' అంటూ రైతు బెంబేలెత్తుతూ మండపం వదలి బైటకు పరుగెత్తాడు. అదే సమయంలో వానతో మరింతగా శైథిల్యావస్థకు చేరిన మండపం దబ్బుమంటూ కూలి నేలమట్టమైపోయింది. అప్పుడు రాత్రి ఎనిమిది గంటలు.. వానకూడా ఆగిపోయింది. 'బ్రతుకు జీవుడా' అంటూ రైతు ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు వెళ్లి జ్యోతిష్యుడిని కలుసుకున్నాడు.
ఇతడిని చూసి ఆ జ్యోతిష్కుడు అవాక్కయ్యాడు. అతడు, 'మన జాతక గణింపులో తప్పు జరిగిందేమో? అని ఎంచి, జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలను తెచ్చి క్షుణంగా పరిశోధించాడు. గణింపులో ఎక్కడా తప్పు జరగలేదు. అంతా సరిగ్గానే ఉంది. 'ఇటువంటి గండం నుండి తప్పించుకోవాలంటే ఆ వ్యక్తి ఒక శివాలయం నిర్మించి కుంభాభిషేకం చేసిన పుణ్యం గడించి ఉండాలి' అని జ్యోతిశ్శాస్త్రం వచిస్తోంది. 'పాపం! పేద రైతుకు ఆలయం నిర్మించి కుంభాభిషేకం నిర్వహించగల స్తోమత ఎక్కడుంది? అనుకుంటూ, జ్యోతిశ్శాస్త్రం తెలియజేస్తున్న అన్ని వివరాలను రైతుకు కుండబడ్దలు కొట్టినట్లు చెప్పాడు. అప్పుడు ఆ రైతు గతరాత్రి తనకు కలిగిన అనుభవాలను విపులంగా జ్యోతిష్కునితో చెప్పాడు. ఆ తరువాత జ్యోతిష్కుడు రైతుకు ఇంకా చెప్పవలసిన జ్యోతిష్యాన్ని చెప్పి పంపించేశాడు. ఆదిత్యయోగీ..
దైవాన్ని తలిస్తే ఎలాంటి గండాలైనా గట్టెక్కుతాయి.
సత్కర్మలు శుభకరమైన ఫలాలను ఒనగూర్చుతాయి అనడంలో ఎటువంటి సంశయం లేదు. అంతే కాదు సత్ చింతనలు సైతం సత్ఫలితాలను ఒనగూర్చే శక్తిని సంతరించుకొని ఉంటాయి. అందుకు ఈ రైతు కథే ఉదాహరణ.
🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
Kaliyuga varam prakaram trikarana suddhi tho manasikam chesina sankalpaani ki punyam vaari katha lo padutundi.
ReplyDeletedaani valle - "ఆ వ్యక్తి ఒక శివాలయం నిర్మించి కుంభాభిషేకం చేసిన పుణ్యం గడించి ఉండాలి"