Thursday, 10 August 2023

మోక్షం అంటే- విముక్తి, విడుదల (14-Aug-23, Enlightenment Story)

  * మోక్షం అంటే- విముక్తి, విడుదల*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మోక్షం అంటే- విముక్తి, విడుదల, స్వేచ్ఛ. జైలు నుంచి ఖైదీ బయటికి వచ్చి స్వేచ్ఛగా జీవించడం. ఆధ్యాత్మికపరంగా జీవుడు దేహబంధం నుంచి, సంసారబంధం నుంచి విడుదల కావడం. బంధాల నుంచి తొలగాలనే దాన్నే 'ముముక్షత్వం' అంటారు. ఇది మోక్షానికి దారి.


⭐ ప్రకృతిలోని సమస్త జీవరాశి సృష్టి ప్రసాదించిన మేరకు సహజత్వాన్ని వీడకుండా ఆహార సంపాదన, ఆత్మరక్షణ, సంతానోత్పత్తి జరుపుకొంటాయి. వాటికదే ప్రకృతి ధర్మం.

⭐ అన్ని జీవరాశుల్లోను ఉన్నతమైన సంస్కారవంతమైన జీవి నరుడు. ప్రకృతి ప్రసాదించిన చిత్తం, మనసు, బుద్ధి, జ్ఞానం, అహంకారం, విచక్షణ కలిగిన ఉత్కృష్టమైన జీవి. వీటితోపాటు నవ్వు, రాగద్వేషాలు, కామ-క్రోధాలు, ఈర్ష్య అసూయలు, జాలి, సిగ్గు, అనుమానం, అసహ్యం, కులం, శీలం, జాతి అనే బంధాలను; భక్తి, రక్తి, వైరాగ్యం, ముక్తి అనే పారమార్థిక సంపదనూ సృష్టికర్త ప్రసాదించాడు. ఇంతటి ధన్యజీవి అయిన మానవుడు నేడు ఎంతవరకు జీవన్ముక్తుడు కాగలగుతున్నాడన్నది ప్రశ్నార్థకమే!

⭐ గతంలో యోగులు, రుషులు, వేదాంతులు, పురాణ పురుషులు, సత్య, ధర్మాల్ని పాటిస్తూ ఎరుకతో మరుజన్మ లేని స్థితిని పొందినట్లు మన శాస్త్ర పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. తమ జ్ఞానసంపదతో ఇంద్రియ నిగ్రహంతో, చిత్త వృత్తుల్ని నిరోధిస్తూ, అరిషడ్వర్గాల్ని జయించి పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సక్రమరీతిలో సాధించి చరితార్థులైనారు.

⭐ ప్రకృతిలో మార్పు సహజం. దానికి ఈ కలికాలం కూడా మినహాయింపు కాదు. జనాభా పెరిగింది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. పోటీతత్వం ఇంతలంతలై జీవన సమస్య భారమైంది. నేటి మానవుడు భౌతికపరంగా, విజ్ఞానపరంగా అభివృద్ధి సాధించినప్పటికీ- మానసిక శాంతి లేక కొట్టుమిట్టాడుతున్నాడు. ఒంటరిగా, కంటినిండా నిద్రలేక, సంపాదనే ధ్యేయంగా అహరహం శ్రమిస్తూ యాంత్రిక జీవనం సాగిస్తున్నాడు.

⭐ ఈ సుడిగుండాల నుంచి మానవుడు బయటపడి మానసిక స్వేచ్ఛతో తిరగలేడా? అంటే తప్పక విడుదల కాగలడు! ముందుగా మనిషి సంపాదన తప్పు కాదని, సంసారం తన ధర్మమని, అతి మాత్రం కూడదని, ఇవేవీ శాశ్వతం కాదని, పుట్టిన ప్రతిజీవీ గిట్టక తప్పదని మామూలు లోకజ్ఞానంతోనైనా గ్రహించాలి. అయితే వచ్చిన చిక్కల్లా అతిగా సంసారబంధాలు పెంచుకోవడం, తానెప్పటికీ శాశ్వతుడననుకోవడం- అనుకొని అక్రమాలు చేసి కూడబెట్టడం కూడదని తెలుసుకోవాలి. ఈ ఇరుక్కున్న బంధాల నుంచి మానసికంగా బయటపడటమే విడుదల, ముక్తి, మోక్షం.

⭐ భవబంధనాల నుంచి విడుదల కావడం అంత తేలికైన పనికాకపోయినా అసాధ్యం మాత్రం కాదు. 'గృహాశ్రమ' జీవనంలో ఉంటూనే, తామరాకుపై నీటిబొట్టులా, అంటీ అంటని రీతిలో విరాగత్వం పొందవచ్చు. అక్కరలేనివి కూడబెట్టే పద్ధతికి స్వస్తి పలికి ఆత్మతృప్తితో జీవించడం ఉత్తమం. గీతాచార్యుడు సెలవిచ్చిన భక్తి, జ్ఞాన, కర్మ, యోగమార్గాలు ముక్తికి సోపానాలు. అందులో యోగమార్గమైన ధ్యానం ద్వారా చిత్తవృత్తుల్ని నిరోధించి, ఇంద్రియ ప్రేరేపితమైన కోర్కెల్ని అదుపుచేస్తే ఈ బంధాలనుంచి విడుదలై మానసిక స్వేచ్ఛతో ఇక్కడే స్వర్గసౌఖ్యాలు పొందవచ్చు. నరకం, స్వర్గం రెండూ మన బుర్రలోనివే. సాధన ద్వారా అరిషడ్వర్గాలను జయించి మానవులంతా స్వేచ్ఛాజీవులై బ్రహ్మనంద భరితులు కావాలి. తద్వారా మానవతకు మహోన్నత స్థానం కల్పించాలని ఆశిద్దాం.

⭐ 'నారు పోసినవాడు నీరుపోయడా' అనే మాట చాలా బావుంటుంది. మనిషికి బతికేందుకు ధైర్యాన్నిస్తుంది. భవిష్యత్తుపై భరోసా ఇస్తుంది. నిజమే. కానీ ఆ మాటను మనం రెండు విధాల తీసుకోవచ్చు. నిరాశకు తావు లేకుండా చేసేందుకు, నిస్పృహకు లోను కాకుండా ఉండేందుకు. ఇది బావుంది. ఆ 'మాట' ఆసరాతో బతికేయొచ్చు. భగవంతుడు అవసరమైనప్పుడు జీవన శకటం ఆగిపోకుండా ఎప్పటికప్పుడు ఇంధనాన్ని వేస్తూపోతాడట. అయితే ముందు మనం బండి నడిపే ప్రయత్నం చేద్దాం. ఆగిపోయే పరిస్థితిలో ఆయనే ఆదుకుంటాడనే భరోసా. నిజంగా ఇది బావుంది. మరో ఆలోచన.జీవితం మనదే. కానీ జీవనం పట్ల మనకేమీ బాధ్యత లేదు. పుట్టించిన అతగాడెవరో ఆయనే ఆదుకుంటాడట. ఔను. ఇది పక్కా పరాన్నభుక్కు తత్వం, నీచత్వం, ఆత్మహత్యాసదృశం. వేలు చూపిస్తే దాని ఆసరాతో ముందుకు నడవాలి గానీ దాన్నే కొరుక్కు తినకూడదు.     

⭐ దేవుడు మనను సృష్టించి అన్ని హంగుల్నీ సమకూర్చింది స్వయంప్రతిపత్తితో జీవించమని. ఆ తృప్తితో, ఆత్మవిశ్వాసంతో, స్వాభిమానంతో బతకమని. ఇచ్చిన శరీరావయవాలను, మెదడును, మనసును, జ్ఞానాన్ని ఉపయోగించి వాటిని సద్వినియోగం చేసుకొమ్మని. పసితనంలో ప్రతిదానికీ అమ్మ మీద ఆధారపడిన బిడ్డ పెద్దయ్యాక కూడా అన్ని పనులకూ ఆమె మీద ఆధారపడితే అది అవిటితనం అవుతుంది. మనిషికి సొంత ప్రయత్నం ఉండాలి. స్వయం ప్రతిపత్తి కావాలి. స్వయం ఉపాధి సమకూర్చుకోవాలి. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు... అనారోగ్యంలోనో, అవిటితనంలోనో తప్ప. మనను పోషించటం, అస్తమానం నీరు పోయటం దేవుడి పని కాదు. మనమైనా ఒక మొక్క నాటుతాం. నీరు పోస్తాం. కొంతకాలం పోషిస్తాం. కొన్నినాళ్లు రక్షిస్తాం. అంతే. ఆ తరవాత దాని జీవిక అదే చూసుకుంటుంది. దాని రక్షణ అదే చేసుకుంటుంది. ఉన్నచోటనే దాని ఉనికిని భద్రం చేసుకుంటుంది. పైపెచ్చు మనకే ఉపకారం చేస్తుంది. వూరికే ఉపకారం చేస్తుంది. మనిషి మాత్రం పరాన్నభుక్కుగా మారిపోతున్నాడు.పక్షవాతపు రోగిలా, పనికిమాలిన జోగిలా.

⭐ ప్రభుత్వాలు కూడా ఓట్ల కోసం అనుచితమైన ఉచితాలు మప్పి ప్రజల్ని తమ మీద ఆధారపడేలా మారుస్తున్నాయి గానీ స్వయం పోషకత్వాన్ని పంచడంలేదు. పెంచడం లేదు. కష్టపడటంలో, కష్టాలను ఎదుర్కోవడంలోనే మనిషి శక్తి పెరుగుతుంది. మనోస్త్థెర్యం రగులుతుంది. సమస్యల్ని అధిగమించే దారులకై అన్వేషణ మొదలవుతుంది. దీనర్థం, కేవలం మనిషి కష్టపడటమే ఉత్తమమని కాదు. సుఖమనీ కాదు. సుఖాన్వేషణ మనిషి బాధ్యతే అని. అవకాశాలివ్వడం వరకే భగవంతుడిదైనా, మన పెద్దలదైనా, ప్రభుత్వాలదైనా బాధ్యత అని. నీరు పోయడమంటే అదే. అంతే.

⭐ మనకు పది వేళ్లున్నది రెండు చేతులతో బొక్కమని కాదు, మెక్కమని కాదు, పని చేసుకొమ్మని. పదిమందికి సహాయపడమని. అప్పుడు మనమే దేవుడైపోతాం. ఎవరో రచయిత అన్నట్లు సహాయమే దేవుడు. దేవుడంటే సహాయం. దేవుడు సర్వజ్ఞుడు. మనిషి అన్నం కంటే సోమరితనాన్నే ఎక్కువ అభిలషిస్తాడని ఆయనకు తెలుసు. అందుకే తిన్న అన్నానికి సరిపడా శ్రమ చేయకపోతే అది జీర్ణమయ్యే ప్రసక్తే లేకుండా విధించాడు. అన్నమే కాదు, మనం ఏం పొందినా దానికి తగిన శ్రమనో, ప్రేమనో, త్యాగాన్నో, దానాన్నో మనం పెట్టుబడిగానో, ప్రతిఫలంగానో అందించవలసి ఉంది. ఇది తిరుగులేని వ్యవస్థ. మనిషి అస్తవ్యస్త అవ్యవస్థను అవస్థలు సరిచూసే, సరిచేసే సువ్యవస్థ. నిజమే... నారు పోసినవాడు నీరు పోస్తాడు. కానీ, వ్యవసాయం మనం చేయవలసి ఉంది. అప్పుడే ఫలసాయాన్ని పొందే అధికారం ఉంటుంది.

🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...