Saturday 2 September 2023

విలువలతో కూడిన కథ (03-Sep-23, Enlightenment Story)

 విలువలతో కూడిన కథ

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁     

వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు.రోజూ బైక్ మీద  ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి రావడం..!


సిటీకి కొత్తగా రావడం వలన ఆప్యాయంగా పలకరించే వారు ఎవరూ లేరు తనకు, డ్యూటీ తరువాత తన భార్యతో కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే.!

హడావుడిగా పరుగులు తీసే జనాలు!ఎవరి అవసరం వారిది, ఎవరి పనులు వారివి. ఒక్కరికీ ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు. సిటీ కదా..ఇంతేనేమో అనుకుంటూ రొటీన్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

రోజులను బిజీగా గడిపేస్తున్నాడే గానీ, జీవితంలో ఏదో తెలియని వెలితి. బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా, కానీ పైకి కనబడకుండా లేని పనిని కల్పించుకుని బిజీగా ఉన్నట్టు నటిస్తూ వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్టున్నారు.

ఒకరోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ, యధాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలావిడను చూసాడు. ముందు చిన్న బుట్ట పెట్టుకుని ఏదో అమ్ముతోంది.

దగ్గరకు వెళ్ళి చూసాడు... బుట్టలో    సపోటా పండ్లు పెట్టి అమ్ముతోంది. బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు, ‘ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతోంది?’ అనిపించింది వెంకట్ కి. కానీ ఒక్కరూ ఆవిడ దగ్గర ఆగి పండ్లను కొనడం లేదు, అసలు అక్కడ ఒక మనిషి కూర్చుని ఉందన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా బాధ కలిగింది తనకు, బండి ఒక ప్రక్కగా ఆపి ఆమె దగ్గరకు వెళ్ళాడు. "ఎలా అమ్మా సపోటాలు, కిలో ఎలా ఇస్తున్నావ్?" అనడిగాడు.

ఆమె రేటు చెప్పింది. సరే ఒక కిలో ఇవ్వు అన్నాడు.ఆమె ఒక కిలో తూచి సంచిలో వేసి ఇచ్చింది. సంచిలోనుంచి ఒక పండు తీసి తిని, "ఏంటమ్మా అస్సలు తియ్యగా లేవు పండ్లు" అంటూ ఇంకో పండు సంచిలోనుంచి తీసి ఆమెకిచ్చాడు.

ఆమె ఆ పండు తిని… "అదేంటి నాయనా.పండు తియ్యగానే ఉంది కదా" అంది.సరేలే అంటూ డబ్బులిచ్చి ఇంటికి బయలుదేరాడు.

ఆరోజు మొదలు ప్రతీరోజూ ఆమె దగ్గర ఆగడం, ఒక కిలో సపోటాలు కొనడం, సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని రుచిగా లేదు అని చెప్పడం, కావాలంటే నువ్వే చూడు అని ఆమెకు ఒక పండు ఇవ్వడం, ఆమె తిని బావుంది కదా అంటే డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్లడం - దినచర్య అయిపోయింది వెంకట్ కి!

ఒకరోజు తన భార్యతో కలిసి వెళుతూ ఆగాడు ఆమె దగ్గర.! ఎప్పటిలానే కిలో పండ్లు తీసుకున్నాడు. సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని, పండ్లు తియ్యగా లేవని చెప్పి తన సంచిలోనుంచి ఒక పండు తీసి ఆమెకిచ్చాడు. ఆమె పండు తిని ‘తియ్యగానే ఉన్నాయి కదా నాయనా’ అని చెప్పగానే డబ్బులిచ్చి బయలుదేరాడు.

ఇదంతా చూసిన వెంకట్ భార్యకు కోపం వచ్చింది.

ఇంటికి వెళ్లాక "రోజూ నువ్వు తీసుకుని వచ్చే పండ్లు చాలా తియ్యగా ఉంటాయి, ఎందుకని ఆవిడకు అబద్ధం చెప్పి బాధపెట్టావ్. పాపం కదా అసలే పెద్దావిడ" అనడిగింది.

వెంకట్ చిరునవ్వు నవ్వి… "ఆమె దగ్గర పండ్లు తియ్యగానే ఉంటాయని నాకూ తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ ఆ పండ్లన్నింటినీ అమ్మడానికి కూర్చుంటుందే కానీ, ఒక్క పండు కూడా ఆమె తినదు. అలా అని నేను కొన్న పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే ఆమె తీసుకోకపోవచ్చు. అందుకే అలా అబద్ధం చెప్పి, రోజూ ఆమె తినడానికి ఒక పండు ఇస్తున్నా" అని అసలు విషయం చెప్పాడు.

వెంకట్ తన భార్యతో కలిసి వెళ్లిపోగానే వృద్ధురాలికి కొంచెం దూరంలో కూరగాయలు అమ్మే ఒకామె వృద్ధురాలి దగ్గరకు వచ్చి… "రోజూ చూస్తున్నాను… ఆ అబ్బాయి వస్తాడు, పండ్లు కొంటాడు. బాగాలేదని మొహం మీదే చెబుతాడు. అయినా కూడా రోజూ నువ్వు ఒక పండు ఎక్కువ తూయడం నేను చూస్తూనే ఉన్నా. అటువంటి వాడికి రోజూ ఒక పండు ఎందుకు ఎక్కువిస్తున్నావ్" అని అడిగింది.

వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది. "పిచ్చిదానా… నేను తీసుకొచ్చే పండ్లన్నీ తియ్యగానే ఉంటాయని నాకు తెలుసు, అయినా తియ్యగా లేవని అబద్ధం చెప్పి కావాలనే రోజూ ఒక పండు నాచేత తినిపిస్తున్నాడు. 

ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు తెలియకుండానే ఒక పండు దానంతటదే ఎక్కువ తూగుతోంది!" అని.

నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఎంతో ఆనందం దాగుంటుంది కదా. అన్ని ఆనందాలనూ డబ్బుతో కొనలేం, ఎదుటివారి పట్ల ప్రేమ ఆప్యాయతలే జీవితంలో నిజమైన తియ్యదనాన్ని నింపగలవు.

మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతోంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం, తీసుకోవడంలో దొరకదు. ఆనందం పంచితే పెరుగుతుందే గానీ తగ్గదు.

అన్నీ ఉన్నా కూడా, ఈరోజుల్లో ఆప్యాయంగా పలకరించే వారు లేకుండా పోతున్నారు. ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటివారితో మనకు బంధుత్వమే ఉండనవసరం లేదు!

అందరూ ఆప్తులే అని చెప్పడానికే ఈ కథ.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...