ముగ్గురు కూతుళ్ళు -3
🍀🌺🍀🌺🍀🌺🍀🌺
అట్లా కొంతకాలం గడిచినాక ఒక మహర్షి వాళ్ళ ఇంటికాడికి వచ్చినాడు. అది అన్నాల సమయం. పిల్లలిద్దరూ ఇంట్లో కూచోని అన్నం పెట్టుకుంటా వున్నారు. ఆ సమయంలో మహర్షి "అమ్మా... ఆకలయితా వుంది. ఏమయినా వుంటే పెట్టండమ్మా... పొద్దున్నించీ ఏమీ తినలేదు. నీరసంగా వుంది' అన్నాడు. అన్నా చెల్లెల్లిద్దరూ అన్నం పళ్ళాల కాన్నించి లేచి బైటకొచ్చి మహర్షికు తమ కోసం వండుకున్నదంతా వేడివేడిగా పెట్టినారు. తోటలోంచి మంచి మంచి మాగిన పళ్ళు తెచ్చి ఇచ్చినారు. మహర్షి కడుపు నిండా తిన్నాక "పిల్లలూ... మీరు చేస్తున్న మర్యాదలకు చానా సంతోషం కలుగుతా వుంది. నేను దేశమంతా ఒకసారి పోయిన చోటికి మరొకసారి పోకుండా తిరుగుతా వుంటాను. అక్కడి వింతలు విశేషాలు తెలుసుకుంటా వుంటాను. నాకు మాయలూ మంత్రాలు రావు గానీ అనేక విషయాలు మాత్రం తెలుసు. మీకేమయినా అటువంటివి తెలుసుకోవాలనుకుంటే అడగండి చెబుతాను” అన్నాడు.
అప్పుడా పిల్లలకు ఒకసారి తమ తోటలోకి వచ్చిన బంగారు పక్షి గుర్తుకు వచ్చింది. “సామీ... ఈ నడుమ మా తోటలోనికి ఒక బంగారుపక్షి వచ్చింది. మేము పుట్టి బుద్దెరిగినప్పటి నుండీ అటువంటి అందమైన పక్షిని ఎప్పుడూ చూడలేదు. వినలేదు. మీకేమయినా దాని గురించి తెలుసా" అని అడిగినారు.
దానికా మహర్షి చిరునవ్వు నవ్వి “నాయనా... అది అట్లాంటిట్లాంటి మామూలు పక్షికాదు. ఏడేడు పధ్నాలుగు లోకాల్లోనూ అంత అందమైన పక్షి యాడా కనిపించదు. అంతే కాదు అది చానా మహిమలున్న పక్షి. ఇక్కడికి ఉత్తరం వైపున ఏడువందల మైళ్ళ దూరంలో వరుసగా ఏడు కొండలున్నాయి. చివరి కొండ మీద ఏడు మర్రిచెట్లు వున్నాయి. చివరి మర్రిచెట్టుకు ఏడు పెద్ద పెద్ద కొమ్మలున్నాయి. చివరి కొమ్మ మీద ఏడు అందమైన గూళ్ళు వున్నాయి. అందులోని చివరి గూడులో ఈ పక్షి నివసిస్తా వుంటాది.
కానీ దాని దగ్గరికి పోయిన వారిని ఎవరినైనా సరే అది ఏడు ప్రశ్నలడుగుతాది. సరియైన సమాధానం చెప్పావా... నీవు ఏ కోరిక కోరినా కాదనకుండా నెరవేరుస్తాది. తప్పు చెప్పినావా వెంటనే నిన్ను అక్కడికక్కడే రాయిగా మార్చి వేస్తుంది" అని చెప్పినాడు.
సాధువు దగ్గర చిన్నప్పటి నుంచీ వేదవేదాల్లో శిక్షణ పొందిన ఆ పిల్లోడు ఎట్లాగయినా సరే ఆ పక్షిని చేరుకొని అమ్మానాన్నల గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. తరువాత రోజు పొద్దున్నే దారిలో తినడానికి పళ్ళు, రొట్టెలు మూట కట్టిచ్చుకోని బైలుదేరినాడు. రాత్రనకా, పగలనకా నడిచీ నడిచీ చివరికి ఏడేడు పధ్నాలుగు రోజులకు కొండలను చేరుకున్నాడు. గంటకో కొండను దాటుతా ఏడో గంటకు చివరి కొండను చేరుకున్నాడు.
నిమిషానికో మర్రిచెట్టు దాటుతా ఏడో నిమిషానికి చివరి చెట్టును చేరుకున్నాడు. క్షణానికో గూడు దాటుతా ఏడో క్షణానికి చివరి గూడు చేరి తలుపు తట్టినాడు. అప్పుడు ఆ గూట్లో నుంచి ధగధగా మెరిసిపోతా వున్న బంగారు రెక్కలను విదిలించుకుంటా బైటకొచ్చింది. ఈ పిల్లోన్ని చూసి “చూడు... వచ్చిందారినే మర్యాదగా వెనక్కు తిరిగి చూడకుండా ఐనా వెళ్ళిపో... లేదా నేనడిగే ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పి నీకు కావలసినదాన్న తీసుకోని పో" అనింది. అప్పుడా పిల్లోడు ఏ మాత్రం బెదపడకుండా “అడుగు చెబుతాను" అన్నాడు. ఆ పక్షి అడగడం మొదలు పెట్టింది. అదట్లా అడగడం ఆలస్యం ఆ పిల్లోడు క్షణం గూడా ఆలస్యం చేయకుండా ఠకీమని సమాధానం చెప్పడం మొదలు పెట్టినాడు.
1. లోకంలో అన్నిటికన్నా వేగమైనది ఏది?
జ. మనసు
2. ఎంత దాచినా దాగనిది ఏది?
జ. అబద్దం
3. పోతే తిరిగిరానిది ఏది?
జ. పరువు
4. ఎంత పంచినా తరగనిది ఏది?
జ. విద్య
5. భార్యాభర్తల మధ్య వుండాల్సినది ఏమిటి?
జ. నమ్మకం
6. మనషులు నాశనం కావడానికి కారణం?
జ. అసూయ
7. మనిషి గొప్పవాడయ్యేది ఎప్పుడు?
జ. ఇతరుల కోసం బతికినప్పుడు.
ఆ పిల్లోడిచ్చిన జవాబులన్నీ విని ఆ పక్షి చానా ముచ్చటపడింది. “ఆహా... ఎన్నాళ్ల నుండో ఈడికి ఎంతోమంది వస్తా వున్నారు. జవాబులు చెప్పలేక రాళ్ళుగా మారుతా వున్నారే గానీ... నీ మాదిరి చక్కగా సమాధానం చెప్పినవారు ఎవరూ లేరు. చెప్పు... నీకేం కావాల్నో" అనింది. అప్పుడా పిల్లోడు జరిగిందంతా చెప్పి "మా అమ్మానాన్నలు యాడున్నారు. వాళ్ళని, మమ్మల్ని కలుపు" అన్నాడు.
సరే అని పక్షి ముందు వాళ్ళ చెల్లెలిని ఆడికి పిలుచుకోనొచ్చి ఇద్దరినీ బంగారు రథంపై కూచోబెట్టుకోని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకోని పోయింది. జరిగిందంతా తెలుసుకున్న వాళ్ళమ్మ పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకోని ముద్దుల మీద ముద్దులు పెడతా కళ్ళనీళ్ళు పెట్టుకోనింది. ఆ తరువాత అందరూ రథమెక్కి యువరాజు దగ్గరికి చేరుకున్నారు. పెళ్ళాన్ని చూడగానే రాజు చానా సంబరపడినాడు. పక్కనున్న ఇద్దరు పిల్లలు తమ పిల్లలే అని తెలుసుకోని ఆనందంతో అందరినీ దగ్గరికి తీసుకున్నాడు.
జరిగిందంతా తెలుసుకోని భటులని పిలిచి “పోండి... పోయి యువరాణి అక్కలిద్దరినీ పట్టుకోని గుండు కొట్టించి, సున్నం బొట్లు పెట్టి, ఊరకుక్కల మీద వూరంతా వూరేగించి వురెయ్యండి" అని చెప్పినాడు. దానికి యువరాణి అడ్డంపడి “వద్దు రాజా... ఏది ఏమయినా వాళ్ళిద్దరూ నాతోపాటు రక్తం పంచుకొని పుట్టినోళ్ళు. వాళ్ళ బాధ నాకూ బాధే. ఈ ఒక్కసారికి వదిలేయండి" అనింది. చెల్లెలి మంచితనం తెలుసుకోని అక్కలిద్దరూ కళ్ళనీళ్ళు పెట్టుకొన్నారు. పరుగు పరుగున వచ్చి ఆమె కాళ్ళ మీద పడినారు. ఆమె వాళ్ళని పైకి లేపి “జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుండీ అందరం కలసిమెలసి వుందాం హాయిగా" అనింది.
రాజు తన పెండ్లాం పిల్లలు తిరిగి వచ్చినందుకు సంతోషంతో వూరువూరంతా విందు భోజనాలు పెట్టించినాడు. నేను కూడా తినడానికి నా పెండ్లాం బిడ్డలతో కలసి పోతావున్నా. మీరు కూడా ఇక చదవడం ఆపి వెంటనే బైలు దేరండి.
సమాప్తం
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment