ముగ్గురు కూతుళ్ళు -2
🍀🌺🍀🌺🍀🌺🍀🌺 .
అట్లా కొంతకాలం గడిచినాక... ఆ రాజ్యంలో రైతులు వేసిన విత్తనాలు మొలకలై, మొలకలు మొక్కలై, మొక్కలకు పూవులై, పూవులు కాయలై, కాయలు విత్తనాలై పంటలు ఇంటికి చేరుతావున్న దశలో యువరాణికి మళ్ళా కడుపు పండింది. ఈసారి రాజు ఆమెని కాలు కింద పెట్టనీయకుండా అడుగడుగునా దాసీలని పెట్టి మరింత అపురూపంగా చూసుకోసాగినాడు. అట్లా ఒకొక్క నెలా దాటి కాన్పుకు దగ్గర పడింది.అనుకోకుండా అప్పుడే ఆ రాజ్యాన్ని ఆనుకొని వుండే అడవుల్లో కొన్ని దొంగల ముఠాలు చేరినాయి. వాళ్ళు రోజూ గుంపులు గుంపులుగా ఊర్ల మీద పడి దొరికినోన్ని దొరికినట్లు చంపుతా కనబడినదల్లా దోచుకోని పోసాగినారు. జనాలంతా భయపడి రాజు దగ్గరికి పోయి “రాజా! వాళ్ళు మామూలోళ్ళు గాదు. ఒకొక్కడు ఒకొక్క ఏనుగంత బలంగా వున్నాడు. వాళ్ళని ఆపడం మా వల్ల కావడం లేదు. నీవే మమ్మల్ని ఎట్లాగైనా కాపాడాల. లేకుంటే ఊర్లు వదిలిపోవడం తప్ప మాకు వేరే దారి లేదు" అని కాళ్ళ మీద పడినారు. రాజు 'సరే' అని పెండ్లాన్ని పిలిచి “మళ్ళా కానుపప్పుడే పోవలసి వస్తా వుంది. ఈసారి జాగ్రత్త. నేను వచ్చేసరికి బోసినవ్వులతో కిలకిలకిల నవ్వుతా వున్న కొడుకునో కూతురినో నా చేతుల్లో పెట్టాల. ఆరోగ్యం జాగ్రత్త" అని చెప్పి పోయినాడు.
అట్లా పోయిన వారం రోజులకు ఆమెకు నొప్పులు మొదలయినాయి. ఎప్పట్లాగే అక్కలిద్దరూ చెరోపక్కన చేరి “ఏం భయపడొద్దు చెల్లీ. మేమున్నాం గదా... కళ్ళు మూసుకొని కాసేపు బాధ బిగబట్టు, చిరునవ్వులొలికే చిన్నారి నీ పక్కనుంటాది" అంటా కాన్పుకు తీసుకోనిపోయినారు. ఆమెకు కాసేపటికి చందమామ లెక్క చక్కని పాప పుట్టింది. వెంటనే అక్కలిద్దరూ చెల్లెలికి మత్తుమందు కలిపిన నీళ్ళిచ్చి ఆమె లేచేలోగా ఆ పాపను అక్కడి నుంచి తీసుకోని పోయి ఒక పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలేసి, ఒక చచ్చిపోయిన పాపని తెచ్చి పక్కన పన్నబెట్టినారు.
ఆమెకిదంతా తెలీదు గదా... దాంతో మత్తు దిగినాక కూతురు చనిపోయుండటాన్ని చూచి “అరే... అప్పుడు కొడుకు, ఇప్పుడు కూతురు. ఏమి రాత రాసినావురా దేవుడా నుదుటి మీద" అంటా కళ్ళనీళ్ళు పెట్టుకోనింది. అంతలో అక్కలిద్దరూ చెరోపక్కన చేరి “ఏం బతుకే నీది... ఎప్పుడూ చచ్చిపోయిన పిల్లోల్లని కంటా వున్నావు. పాపం ఎన్నో ఆశలతో వురుకులు పరుగుల మీద వచ్చే నీ మొగునికి నీ మొగం ఎట్లా చూపిస్తావే పాపిష్టిదానా" అంటూ సూటిపోటి మాటలన్నారు. దాంతో ఆమెకు చానా బాధ వేసి రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆ రాజ్యాన్ని వదిలేసి ఎవరికీ కనబడనంత దూరం వెళ్ళిపోయింది. అక్కడ ఒక ఇంట్లో ఎవరూ లేని అనాథనంటూ పనికి చేరి బతకసాగింది. అక్కలిద్దరూ చెల్లెలు వెళ్ళిపోవడంతో చానా సంబరపడినారు.
అక్కడ అడవిలో దొంగలను వేటాడుతా వున్న యువరాజు మీద ఆకాశంలోంచి పగడాల వాన కురిసింది. అది చూసి యువరాజు “ఆహా.. ఈసారి నాకు చూడచక్కని కూతురు పుట్టినట్లుంది" అని సంబరపడ్డాడు. కొద్దిరోజుల్లో దొంగలనంతా తరిమేసి పాపను చూడ్డం కోసం వురుకులు పరుగుల మీద ఇంటికొచ్చినాడు.
కానీ అక్కడ పసిపాప కేరింతలు లేవు. అక్కలిద్దరూ దొంగ ఏడుపు ఏడుస్తా నీ పెళ్ళానికి ఈసారి గూడా చచ్చిపోయినోళ్ళే పుట్టినారు. దాంతో నీకు మొగం చూపించలేక రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పా పెట్టకుండా యాడికో వెళ్ళిపోయింది" అంటూ చెప్పినారు. పిల్లనే గాక పెళ్ళాం గూడా పోయినందుకు రాజు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
ఇంతకు ముందు అక్కలిద్దరూ పెట్టెలో పాపను పెట్టి వదిలినారు కదా... అది కొట్టుకోని పోయి కొట్టుకోని పోయి... మళ్ళా అదే ముసలి సాధువుకు దొరికింది. ఆయన ఆ పాపను గూడా బైటకు తీసుకొచ్చి సొంత పిల్లలెక్క అల్లారుముద్దుగా పెంచసాగినాడు. అట్లా ఆడ కొంతకాలానికి పిల్లలిద్దరూ పెరిగి పెద్దగయినారు. ఆయన దగ్గర రకరకాల విద్యలు నేర్చుకున్నారు.
ఆ సాధువు చానా ముసిలోడయిపోయినాడు. చనిపోయే ముందు ఇద్దరినీ పిలిచి “బాబూ... మీకు మీ పుట్టుక గురించి ఒక్క నిజం చెప్పాల. మీరు నా సొంత పిల్లలు కాదు" అంటూ జరిగిందంతా చెప్పి చనిపోయినాడు.
పిల్లలకు తమ అమ్మానాన్నా ఎట్లా వుంటారో, ఎక్కడుంటారో తెలుసుకోవాలనిపించింది. కానీ చెప్పేవాళ్ళు ఎవరూ లేక బాధపడసాగినారు.
పిల్లలకు తమ అమ్మానాన్నా ఎట్లా వుంటారో, ఎక్కడుంటారో తెలుసుకోవాలనిపించింది. కానీ చెప్పేవాళ్ళు ఎవరూ లేక బాధపడసాగినారు.
ఆ పిల్లల ఇంటి పక్కన ఒక తోట వుంది. దాంట్లో లోకంలో యాడా దొరకనన్ని రకరకాల పండ్ల చెట్లు వున్నాయి. వాటి కోసం ఒక బంగారు పక్షి అక్కడికి వచ్చింది. సూర్యుని కిరణాలు పడి దాని ఒళ్ళంతా ధగధగా మెరవసాగింది. లోకంలో ఎన్నో పక్షులు చూసినాం గానీ ఇంత అందమైన పక్షిని ఎప్పుడూ చూడలేదు. దీన్ని పట్టి ఇంట్లో వుంచుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నారిద్దరూ. దాంతో వాళ్ళు నెమ్మదిగా దాక్కుంటా దాక్కుంటా దాని దగ్గరికి పోయినారు. లటుక్కున ఆ పక్షిని పట్టుకోబోతే అది అందినట్లే అంది చేయి తాకిన మరుక్షణమే టక్కున మాయమైపోయింది. మళ్ళీ ఎప్పుడూ అటువైపు రాలేదు.
పార్ట్ 3 రేపటి కథలో కొనసాగుతుంది .....
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment