సత్యాన్వేషణ
🍁🍁🍁 🍁🍁🍁
సత్యాన్ని తెలుసుకోవడానికి సగుణమా లేక నిర్గుణమా అన్న మీమాంస సదా సాగుతూనే ఉంటుంది. మీమాంస వదిలి సాధనా మార్గంలో పయనిస్తేగాని సత్యదర్శనం కలగదంటారు దార్శనికులు.
ఈ భూమి మీద కళ్లు తెరవగానే కనిపించేది వస్తు ప్రపంచం. ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు; జలమయమైన సముద్రం, నదులు, కొలనులు, బావులు; అంబరాన్ని సంబరంగా తాకడానికి చేతులు చాచే వృక్షాలు; వాటిని నడిపించే కనిపించని వాయువు, నేలపై ఉన్నా నింగికి ఎగసిపడే నిప్పు, రగిలే నాల్కలు; కొండలు, కోనలతో నిండిన నేల- పంచభూతాలను మనిషి ఎలా కాదనగలడు? అంపశయ్య పైన ఉన్న భీష్మాచార్యులకు మొదట విశ్వం, తరవాత విష్ణువు కనిపించారు. సర్వ వ్యాపకమైన విష్ణుత్వాన్ని కురుపితామహుడు కృష్ణుడిలోనే చూడగలిగాడు. తెలిసినదాన్నిబట్టి తెలియనిదాన్ని పట్టుకోవడం సులభం. ఉట్టి కొట్టగలిగితే, స్వర్గం ఎక్కగలనన్న ధైర్యం, ఉత్సాహం ముందుకు నడిపిస్తాయి. ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టి, పెరిగి, గిట్టడం ప్రకృతి సహజమైన మార్పు.
విశ్వరహస్యాన్ని తెలుసుకోవడానికి మూడురకాల ప్రామాణికాల్ని విజ్ఞులు నిర్దేశించారు. ప్రత్యక్ష, అనుమాన, శబ్దప్రమాణాలు మూడూ సత్యాన్వేషణకు తగిన ఉపకరణాలు. కళ్లతో చూడాలి, మనసుతో తెలుసుకోవాలి, జ్ఞానసంపదతో కూడిన వేదమంత్రం ఉపాసించాలి. ఈ మూడింటికీ లొంగని మహత్త్వం యోగసమాధిలో హృదయనేత్రానికే అవగతం అవుతుంది. ఎవరికి వారే అనుభవం ద్వారా అనుభూతి చెందినప్పుడే సత్యసాక్షాత్కారం సాధ్యమవుతుందంటారు యోగీ శ్వరులు. చూపు, చూడదగినది, చూడగలవాడు (దృష్టి, దృశ్యం, ద్రష్ట) మూడూ ఒకటి అయితే నిత్యం, నిఖిలమైన సత్యస్వరూపం విశ్వవ్యాప్తమై విష్ణుసహస్ర నామమై ధ్వనిస్తుంది.
జ్ఞానమార్గంలో కొనసాగేవారికి నిర్గుణధ్యానం, కర్మ మార్గంలో పయనించేవారికి సగుణధ్యానం కలిసివస్తాయని, గురువులు శిష్యుల స్థాయినిబట్టి మార్గనిర్దేశం చేసేవారు. నేను సర్వజ్ఞుడిని అన్న అహంకారంతో అగ్నికార్యాలు మానివేసిన జ్ఞానికన్నా నిష్కామకర్మ చేసే యోగి మిన్న- అంటున్నది భగవాన్ ఉవాచ. విష్ణు సహస్రనామాలు వల్లెవేస్తూ, పాపపు పనులకు ఒడిగట్టేవాడిని నామాపరాధి అంటున్నది శ్రీభాగవతం. సగుణ, నిర్గుణమనే విభేదం కేవలం తాత్కాలికం. ఏరు దాటడానికి తెప్ప అవసరం.
ఏరు దాటాక తెప్పను వదలకపోవడం అవివేకం. ఇహపర సాధన జీవిత పరమార్థం. జ్ఞానం, కర్మ, యోగం, భోగం- అన్నీ సత్యశిఖరానికి చేర్చే సోపానాలు. అంచెలంచెలుగా నిచ్చెనమెట్లు ఎక్కినప్పుడే నింపాదిగా చేరవలసిన చోటుకు చేరుకోవచ్చు. నేలవిడిచి చేసే సాముగరిడీలను నమ్ముకుంటే వైకుంఠపాళి పాము నోట్లో పడ్డ పాచికవలె జారిపడతారు. వైకుంఠానికి బదులు వైతరణికి తరలిపోగలరు.
లోకంలో ఒకరి సహాయం లేకుండా జీవించడంగాని, కార్యసిద్ధి పొందడంగాని సాధ్యం కాదు. పొట్టు సాయంలేకుండా బియ్యపు గింజ మొలవదు. తోడూ నీడా లోకసహజమైన జోడుగుర్రాలు. సగుణం కాదని నిర్గుణం కోసం వెంపర్లాడితే గాడితప్పి బండి బోల్తా కొట్టవచ్చు. సాధన, ఉపాసన జోడుగుర్రాల్లాంటివి. ఈ రహస్యం తెలుసుకున్నప్పుడు నాణేనికి బొమ్మ-బొరుసు లాంటివే సగుణ నిర్గుణ సాధనామార్గాలన్న సమరస భావన కలుగుతుంది. సాధన వేగవంతమై యోగం వరిస్తుంది. సచ్చిదానందం అంటే అచ్యుతానంద గోవిందుడేనన్న సత్యం బోధపడుతుంది.
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment