Thursday, 7 September 2023

ఒకరికి ఒకరై (10-Sep-23, Enlightenment Story)

ఒకరికి ఒకరై

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁



ప్రతి జీవి శరీరంలో జీవకణాలు ఉంటాయి. అవి సమయోజనీయతతో సమన్వయంతో కలిసి ఉండకపోతే ఘర్షణ ఏర్పడుతుంది. ఫలితంగా సమతుల్యత లోపించి అనారోగ్యం పాలవుతామని శాస్త్రీయంగా నిరూపణ అయింది. అవి సవ్య, అపసవ్య దిశలలో కలిసి శరీరం సంకేతాలకు అనుగుణంగా సాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. లేకపోతే వ్యాధులకు గురవుతాం. 

ఒకరికొకరు సహాయం చేసుకోవడం, పరోక్షంగా ఎవరికి వారు సహాయం చేసు కోవడమే. ఈ రహస్యం తెలియని వాళ్లు ప్రతిదానికీ గొడవ పడతారు. కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు లాంటి చెడ్డ భావాలతో మనసును కలుషితం చేసుకుని బతుకుతుంటారు. ఆత్మాభిమానం అనే పేరుతో భీష్మించుకుని ఉంటారు. మనకు ఇంకొకరితో పనే ముందని గిరి గీసుకుని బతుకు తుంటారు. ఇది ఎవరికి వారు చేసుకునే ఎనలేని నష్టం. 

దీనివల్ల వారు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నిస్సహాయులుగా మిగిలిపోతారు. ప్రకృతితో, సృష్టితో క్రమక్రమంగా సంబంధాలు తెగిపోయి, ఒంటరివాళ్లయిపోతారు. ఇంకొందరు సహాయం చెయ్యకపోగా, ఇతరుల మనసులను పనిగట్టుకుని గాయపరుస్తుంటారు. ఇందులో లేశమాత్రమైనా సందేహం లేదు. వారు ప్రకృతికి, సృష్టికి వ్యతిరేకంగా జీవిస్తున్నవాళ్లు. నిక్కచ్చిగా చెప్పాలంటే వారికి బతకడం రాదు. బతుకులో ఇమడలేరు. నిత్యం విమర్శలతో, నిందలతో, అననుకూల ఆలోచనలతో, పాలలాంటి బతుకులో విషం కలుపుకొంటూ ఉంటారు.

ఆత్మ అందరిలో ఉంది. అది ధరించే శరీరాలన్నింటితో కలిపి పరమాత్మ అయింది. ఆ పరమాత్మ, ఏకత్వ భావనతో అలరారుతోంది. ఏ జీవికి మనం సహాయ నిరాకరణ చేసినా, అది మనల్ని పరమాత్మతత్త్వానికి దూరం చేస్తుంది. సహాయం చెయ్యడంతోనే ఆధ్యాత్మికత మొదలవుతుంది. జీవుడు జీవుడికి సహాయం చెయ్యాలి. జీవుడు దేవుడికీ సహాయం చెయ్యాలి. దేవుడికి సాయమా అని అనుకోకూడదు. దైవం చేస్తున్న పనికి తనవంతు సాయం చెయ్యాలి. శ్రీరాముడికి ఉడుత చేసిన సాయంలా.

భౌతికమైన కంటికి, స్థావర జంగమాత్మక ప్రపంచం అంతా విడిగా ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి భిన్నత్వంలో ఏకత్వం ఉంది. చూసే చూపు మారితే రూపు మారుతుంది. మనసు మారుతుంది. మనుగడ తీరు మారుతుంది. ఎదుటివాడిని ఎందుకు ప్రేమించకుండా ఉండకూడదో, దాని వల్ల కలిగే హాని ఏమిటో అరటిపండు వలిచి పెట్టినట్లు అర్థమవుతుంది.

మనిషి భూమి మీదకు రావడం నుంచి, తనను తాను తెలుసుకొని, తనలోని దైవత్వాన్ని గుర్తించేవరకు ఎంతో సహాయం పొందుతాడు. ఇది అందరికీ తెలియదు. కాని అది నిజం. ఈ దివ్యమైన ఆటలో పక్కవాడికి సహాయం చెయ్యడంలో గొప్పతనం, దివ్యత్వం ముందుగా ఎవరు గుర్తిస్తారో. వారే తమ ప్రయాణం చక్కగా సాగించి ధన్యులవుతారు!

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...