దేవుడు ఎక్కడ వున్నాడు
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు. *స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా?* కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను.
సాధువు తల ఎత్తి అతని వంక చూసి,. ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు. *దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా?* పరిహాసంగా అడిగాడు అతను. అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు…
"నీకో కధ చెప్తా విను. అది నీ సందేహం తీర్చచ్ఛు…పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు.
ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను". చెప్పిందా పిల్ల.
"ఎవర్ని చేసుకుంటావయితే?" ప్రశ్నించింది తల్లి. "మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు?" ఆడిగిందా అమ్మాయి. "మన ఊళ్ళో ఏం ఖర్మ? మన దేశం.లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు" చెప్పాడు తండ్రి.
"అయితే ఇంకేం? ఆయన్నే చేసుకుంటాను." చెప్పిందా పిల్ల. అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి. తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక 'సరే' అన్నాడు.
ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు. 'నన్ను పెళ్లి చేసుకో ' అని అడగబోతుండగా,
ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది. 'ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు?' అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది..
అతని దగ్గరకు వెళ్లి ఆ విషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది.
'ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప. చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి' అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా,
ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది.
కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే".
కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు. మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది.
భగవంతుని కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే , ఆ భగవంతుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా భగవంతుడు దొరకడు.
అదే భగవంతుని చిరునామా". వెతకవలసిన చోటు మన హృదయం లో ఉన్న పరమాత్మను.భక్తితో ఆయనను దర్శించాలని అనుకోవాలి.✍️
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
Well said sir.
ReplyDelete