నిన్ను నువ్వు మలచుకో!
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
’శాంతం, సహనం, ప్రేమ, అనురాగం, ఆనందం, సహకారం, ఉపకారం’ అనే తత్వాలు కలిగినవారిని ఉత్తములుగా పరిగణిస్తారు. వీటికి వ్యతిరేక గుణాలు కలుపు మొక్కల్లా మనిషి మదిలో మొలకెత్తుతూ ఉంటాయి.
వెలుగు వెనకాలే చీకటి, సుఖం వెనక దుఃఖం, శాంతికి అశాంతి, ప్రేమకు ద్వేషం, అనురాగానికి అహంకారం, ఆనందానికి విషాదం. ఇలా ఎన్నో వ్యతిరేక లక్షణాలు మదిని చొరబడి చోటు చేసుకొంటాయి. మెల్లిగా పెత్తనం చలాయిస్తాయి.
వివేకం, విచక్షణాజ్ఞానం కలిగిన వ్యక్తి తనలో పుట్టిన ఈ వ్యతిరేక లక్షణాలను ఎప్పటికప్పుడు పంట పొలంలోని కలుపు మొక్కల్లా ఏరి పడేస్తాడు. తెలివిగా ముందుకెళ్తాడు. బలహీనుడు దాసోహం అంటూ ఆ వికారాలకు లొంగిపోతాడు.
మనిషి మనసు కురుక్షేత్రం లాంటిది. అందులో దైవగుణ సంపద కలిగినవారు పాండవులు, అసురగుణం కలిగినవారు కౌరవులు.
క్షీరసాగర మథనం సమయంలో విషం, అమృతం రెండూ పుట్టినట్లు- మానవ మానస సాగరంలో ఈ రెండు గుణాలూ మిళితమై ఉంటాయి. అలజడులు లేపడమే చెడుగుణ స్వభావం. మనం మంచికి చోటివ్వాలి. చెడును తరిమికొట్టాలి.
అరిషడ్వర్గాలు మన అంతఃశ్శత్రువులు.
వాటిలో మొదటిది కామం. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉండటమన్నది సహజం. అనుకొన్నది తీరింది లెమ్మనుకొని హాయిగా ఊపిరి పీల్చుకొంటూండగానే దాని వెనకాలే మరో కోరిక పుట్టుకొస్తూనే ఉంటుంది. అది తీర్చుకొనేందుకు చేయరాని పనులు చేయాల్సివస్తుంది. కోర్కెల కోరల్లో చిక్కుకొన్నవారికి మనశ్శాంతి ఉండదు.
రెండోది క్రోధం. దీన్ని క్రోధాగ్నిగా ఉదాహరించారు. నిప్పు లక్షణాలన్నీ దీనికున్నాయి. ఇది తాను ఆవహించిన యజమానిని కాల్చి బూడిద చేస్తుంది. అటుపై ఎదుటివారిని తాకుతుంది. వెంటనే వాళ్ల నెత్తురును వేడెక్కించేస్తుంది. దీని మొదటి లక్షణమే అది. ఆ ప్రభావం గుండెమీద, మెదడుమీద చూపుతుంది. క్రోధంతో మనిషి వివేకం కోల్పోతాడు.
పీనాసితనమే లోభం. లోభి తాను తినడు. ఇతరులకు ఇవ్వడు.
పరమాత్ముడు జీవులను భ్రమింపజేయడానికి పుట్టించిన మనోదశ మోహం. లేనిది ఉన్నట్లు, కానిది అవునన్నట్లు తోచేలా చేస్తుంది. బుద్ధిహీనతకు కారణం అవుతుంది.
మదం ఆవహించిన వ్యక్తి అంతటా- అన్నింటా తానే గొప్ప అంటాడు. తనంతటివాడు మరెవ్వడూ లేడని గొప్పలు చెప్పుకొంటాడు. మదం ఆవహించిన వ్యక్తి గుడ్డివాడితో సమానం అంటుంది నీతిశాస్త్రం.
మాత్సర్యానికి మరోపేరు అసూయ. సహించలేకపోవడం, ఓర్వలేకపోవడం వంటి లక్షణాలు దీనికున్నాయి. నరంమీద లేచిన నారికురుపులాగ ఇది మనిషిని ఓ చోట నిలకడగా నిలబడనివ్వదు. లోలోపలే సలుపుతూ ఉంటుంది.
ఈ అరిషడ్వర్గ మూకను వాటి మానాన అలా వదిలేసే బదులు మనకు అనుకూలమైన హితషడ్వర్గంగా మలచుకోవచ్చు.
దేన్నయినా కోరుకోవడం మానవ లక్షణం. చెడును కోరుకోకుండా ‘సద్గతి’ని ఇచ్చే మోక్షాన్ని కోరుకోవడం మంచిది. దానికి కావాల్సిన చిత్తశుద్ధిని కోరుకోవడం ఉత్తమం. మంచి జరిగేది ఏది కోరినా ఫలితం మధురంగానే ఉంటుంది. చెడు అన్న ప్రతి విషయంపై కోపగించుకోవడం తప్పుకాదు. మంచికి ఊతమిచ్చే కోపం మనిషికి ఉత్తమ స్థితిని కలగచేస్తుంది.
సద్గుణ సంపదల్ని అధికంగా కూడబెట్టుకోవడంలో లోభిగా ఉన్నా ఫర్వాలేదు. ఆత్మచింతన కావాల్సినంత పెంచుకోవడంలో తప్పేలేదు.
భగవత్ చింతనపై మోహం పెంచుకోవాలి. సద్గ్రంథ పఠనంపై మోహం చూపవచ్చు. ఆత్మజ్ఞానం, జీవన్ముక్తిపై మోహం ఉత్తమం.
ఆత్మజ్ఞానం కలిగి అహంబ్రహ్మాస్మి అన్న దర్పం కలిగి ఉండటం తప్పుకాదు.
లౌకిక సుఖ దుఃఖాలపై మాత్సర్యం మంచిదే. అరిషడ్వర్గాలకు బుద్ధి చెప్పేలా ఆ ఆరింటినీ హితషడ్వర్గంగా మలచుకొంటే- జీవితం. ఆనందో బ్రహ్మ!
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment