*నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో అర్థం, పరమార్థం ఉంది*
🍁🍁🍁 🍁🍁🍁 🍁 🍁🍁🍁 🍁🍁🍁 🍁 🍁🍁 🍁🍁🍁 🍁
కొద్ది గంటల్లో రోదనధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి. కుటుంబసభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో నిమగ్నమవుతారు.
మనవలు, మనవరాళ్లు ఆటపాటల్లో మునిగి పోతారు. ఓ యువతీ యువకుల జంట రొమాంటిక్ గా ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. మరికొందరు దగ్గర్లో ఉన్న టీషాపులో బాతాఖానీకి బయల్దేరుతారు.
అప్పటివరకూ ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన - శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన పిండోదకం, విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిర్రుబుర్రులాడుతాడు.
ఈ లోగా నీ దగ్గరి బంధువు ఒకాయన - ఆఫీసులో శెలవు దొరకని కారణంగా నీ అంత్యక్రియలకు హాజరవ్వలేక పోయానని నీ భార్యతో మొక్కుబడిగా వాపోతాడు.
మరునాడు వెళ్ళిపోయినవాళ్ళు వెళ్ళిపోగా - మిగిలిన వాళ్ళల్లో ఒకాయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు. మరొకాయన దానికి వంత పాడుతాడు.
నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకొని, కడుపు కట్టుకుని కూడబెట్టిన కోట్లు విలువ జేసే ఆస్తుల్ని పంచుకొనే విషయంలో నీ పుత్రరత్నాలు పేచీ పడతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణాపైసలతో లెక్కలేసి వాటాలు తేల్చేసుకుంటారు. అప్పటికింకా నువ్వు పోయి నిండా నాల్రోజులు కూడా కాలేదు సుమా! మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కక్కళ్ళుగా జారుకొంటారు. విదేశాల నుండి వచ్చిన బంధువులైతే, పదకొండో రోజు తరువాత వెళ్ళబోయే విహారయాత్రకు ఇప్నట్నించే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.
నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబరుకు వచ్చే ఫోన్లని నీ కొడుకో, కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు, రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు.
అంతలో, తమ ఎమర్జెన్సీ లీవు అయిపోవడంతో కొడుకులు, కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు.
నెల తిరగక ముందే, మీ అర్థాంగి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వుతుంది. అంతకుముందే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు, షికార్లు చుట్టబెట్టేస్తుంటారు.
మొత్తంగా, నెల లోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్నవాళ్ళు - అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే - నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా!! ఒక పండుటాకు ఓ మహావృక్షాన్నుంచి ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా రాలిపోతుందో, అంతే వేగంగా 'నీవారు' అనుకున్న అందరి స్మృతిపథం లోంచి నువ్వు కనుమరుగై పోతావు.
నీ మరణానంతరం కుడా - అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు. పండుగలు ఒకదానివెంట మరోటి వస్తూనే ఉంటాయి. సినిమాతారలకి రెండు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు కుక్క మరో యజమానిని వెతుక్కుంటుంది.
అంతలో, నీ సంవత్సరీకాలు రానే వస్తాయి. నీ పెళ్ళి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా! నీ గ్జ్నాపకార్థం అతిథులకి పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు, కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది.
ఈ కార్యక్రమంతో నీకు, ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. నీ గురించి మాట్లాడుకునే వారు గానీ, నిన్ను తలచుకునే వారు గానీ దాదాపుగా ఉండరు.
ఇప్పుడు చెప్పండి !!
ఇన్నాళ్ళూ మీరు పాకులాడింది ఎవరికోసం? దేనికోసం తెగ హైరానా పడిపోయావు? నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే, నీ తపనకూ, తాపత్రయానికీ ఏమన్నా అర్థం ఉందా?
జీవితంలో ముప్పాతిక భాగం నీవాళ్ళనుకునే వాళ్ళకోసం, వారి మెప్పు పొందటం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా! వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా?
ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి, నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో అర్థం, పరమార్థం ఉంది కదూ!!!
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment