*తిలా పాపం తలా పిడికెడు అంటే ఏమిటి? *
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁
ఒక గద్ద ఒక పామును తన్నుకుని పోతుంది ఆహారంగా చావుకి దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదలిపెడుతుంది. అదే సమయానికి, గొల్లభామ తలమీది గంపలోని ఒక పెరుగు ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం (గాలి వీచి), పెరుగు ముంతలో విషం పడుతుంది.
ఆ విషయము తెలియక గొల్లభామ పెరుగు ముంతను ఒక భక్తుడుకి అమ్ముతుంది. భక్తుడు ఇంటికి వచ్చిన అతిధికి భోజనం లో వడ్డించగా విషపూరితమైన పెరుగు తిని కాలం చేసేడు
పాము ముందే మరణించింది, గొల్లభామ, గద్ద కూడా మరణించారు. ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమయింది, ఈ బ్రహ్మ హత్యాపాతకాన్ని ఆబ్దీకం పెట్టిన భక్తుడి కాతాలో రాశాడు, చిత్రగుప్తుడు.
భక్తుడి పాపాల చిట్టా చదువుతున్నాడు, చిత్రగుప్తుడు. అప్పుడు భక్తుడు, ధర్మ ప్రభో! ఇది అన్యాయం, ఈ బ్రహ్మహత్యాపాతకం నాది కాదు, నేను అతిధిని పిలిచి ఆయనకు భోజనం పెట్టాను తప్పించి, ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు, అందుకు తప్పు నాది కాదు కనక పాపం నాది కాదన్నాడు.
పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు, గొల్ల భామను విచారించాలి ప్రభో అన్నాడు. గొల్ల భామను పిలిచి ఈ పాపం నీ కాతా లో రాస్తాము, విషమున్న పెరుగు అమ్మేవు కనక, అదీ కాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేశావు కనక అంటే, బాబోయ్! నాది తప్పు కాదండి, నేను పాలు పెరుగు అమ్ముకుంటాను, నాకు ఆ ముంతలో విషం పడిందని తెలియదు, తెలిస్తే అది భక్తుడుకి అమ్మను కదా, నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పేను. గాలికి ఎగిరిపోతే తప్పునాది కాదు, అందుకు నాది తప్పు కాదు, కనక పాపం నాకు సంబంధం లేదంది. గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదా తప్పని, గాలిని పిలిచారు.
గాలి వచ్చి దేవా! వీచడం నా లక్షణం, నా ధర్మం, నేను స్థంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభూ, అని మొరపెట్టుకున్నాడు. సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం? అని పిలిచారు పాముని. పాము ధర్మ ప్రభూ! నా ప్రాణం పోతున్న సమయం, గద్ద కాళ్ళలో ఉన్నాను, ఏమి జరుగుతున్నది నాకేతెలియని స్థితి, ఎక్కడ విషం వదలిపెడుతున్నదీ కూడా చూడగల సమయం కాదు, కనక తప్పు నాది కాదు, ఈ బ్రహ్మ హత్యా పాతకం నాది కాదని మొర పెట్టుకుంది.
అప్పుడు, ఇక మిగిలింది గద్ద కనక గద్దను పిలిచారు, ఈ పాపం నీదేనా? అన్నారు. మహాప్రభో! పాము నా అహారం, గగన విహారం నా లక్షణం, పాము విషం వదులుతొందో లేదో నేను చూడలేదు, అందు చేత పాపం నాది కాదు అంది.
మరి ఇంతకీ ఈ బ్రహ్మ హత్యా పాతకం ఎవరి కాతాలో రాయాలో యమధర్మరాజుకు కూడా బోధ పడలేదు, సమవర్తి అయివుండి కూడా. అప్పుడు సమవర్తి, చిత్రగుప్తుడిని ఈ విషయం మీద గూఢచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు. చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి, ప్రభూ! భూలోకంలో ప్రజలు ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు.
ఒకరు, గద్దది తప్పన్నారు, మరొకరు పాముది తప్పన్నారు, కొందరు గాలిది తప్పన్నారు, మరికొందరు గొల్ల భామది తప్పన్నారు, బుద్ధిమంతులు భోజనం పెట్టిన భక్తుడిది తప్పన్నారు. అందరూ సమానంగా స్పందించారు ప్రభూ! అని నివేదికలో సంగతి చెప్పేడు. మరి కొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు. ఈ పాపాన్ని ఎవరో ఒకరి కాతాలో రాయాలి? కనక, తప్పు ఎవరిదో ఇదమిద్ధంగా తేలలేదు కనక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసీ, తెలియక తీర్పులిచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు.
అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది. దీనినే "తిలా పాపం తలా పిడికెడు" అని అంటారు. అందుకే ఏ సంగతయినా, నేరమైనా చేసింది చేయనట్లు చేయనిది చేసినట్లు, పూర్తిగా తెలియనిదే తీర్పులిచ్చినట్లు మాట్లాడకూడదు.
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
Excellent sir.
ReplyDelete