*దృష్టి ఆ ఒక్కదాని మీదనే*
🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸
ఒక యువకుడు భగవాన్ రమణ మహర్షిని “సాధనకు గురువు కావాలి గదా?” అని అడిగాడు. “ఔను, కావాలి” అన్నారు భగవాన్.
“సద్గురువును ఏవిధంగా నిర్ణయించుకోవాలి? గురుస్వరూపం ఎటువంటిది?” అన్నాడా పృచ్చకుడు. ఎవనియందు నీ మనస్సు లగ్నమౌతుందో, వాడే గురువు. సద్గు రువు ఇతడని నిర్ణయించడం ఎట్టా? వారి స్వరూపం ఎటువంటిది? అంటే శాంత శమదమాదులతో కూడి, సూదంటు రాతివలె దృష్టిచేతనే ఆకర్షింపగల శక్తి సంపన్నత, సమత్వం ఎవరియందు స్థిరంగా ఉంటవో వారే గురు స్వరూపులు.
గురు స్వరూపం తెలుసుకోవాలంటే, తన స్వరూపమేదో తెలుసుకోవాలి ముందు. తన స్వరూపమేదో తెలియనప్పుడు, గురుస్వరూపమే విధంగా తెలుస్తుంది? గురు స్వరూపం చూడాలంటే, లోకాన్నంతా గురు రూపంగా చూడాలి.” “అది తెలుసుకొనేందుకు మాత్రం గురువు కావద్దా?” అన్నాడా యువకుడు. “అది నిజమే. లోకంలో ఎందరో మహనీయులున్నారు. నీ మనస్సు ఎవరియందు లగ్నమౌతుందో, వారిని గురువుగా నమ్ముకో. గురియేగదా గురువు?” అన్నారు భగవాన్.
ఆ యువకుడంతటితో తృప్తి చెందక, సమకాలికులగు పెద్దలపేర్లు కొన్ని ఏకరువుపెట్టి, “వారికా లోపం వుంది. వీరికీ లోపం ఉంది, వారేవిధంగా గురువౌతారు? వీరేవిధంగా గురువు కాగలరు?" అని ఆక్షేపించుట కారంభించాడు.
ఆ యువకుడు తిరిగి తిరిగి అదే ధోరణితో మాట్లాడబోతో, ఒక భక్తులు వారించారు. భగవానదిచూచి “ఉండండయ్యా, మీరు ఎవరూ మాట్లడకండి. వారి చిత్తమొచ్చినంత సేపు మాట్లాడనీయండి. వారు తెలిసినవారు. మనమంతా వారికి తగ్గి ఉండాలి. చూస్తూనే వున్నా, వచ్చినప్పటి నుంచీ ఇదంతా మూటకట్టుకొని, మూల కూర్చున్నారు. రోజుకు రోజు కాస్త, కాస్త జరిగి దగ్గరకొచ్చారు. ఈ రోజు నేను ఒకఱ్ఱున్నానని మూట విప్పారు. ఇదంతా బయటికి రావద్దూ? ఈ లోకమంతా వెదకి గురుస్వరూపం నిర్ణయిస్తారట. వీరు గురువుగా వరించే యోగ్యత ఇంతవరకూ ఎవరివద్దనూ కనుపించలేదట.
దత్తాత్రేయులు, లోక గురువు గదా? వారు లోకమంతా నాకు గురువే నన్నారట. చెడ్డచూస్తే చేయరాదని తోస్తున్నది. అందువల్ల అదీ గురువే. మంచిచూస్తే చేయాలనిపిస్తున్నది గనుక ఇదీ గురువే. మంచిచెడ్డలు రెండూ నాకు గురువులేనన్నారు.
వేటగాడు దోవ అడిగిన తన మాట వినిపించుకొనక పక్షిని గురిపెట్టి కొట్టడం చూచి 'నాయనా, నీవు నాకు గురువువు' అని నమస్కరించారట. 'పక్షిని చంపటం చెడ్డదైనప్పటికీ లక్ష్యముంచి బాణం వేయడం చూచి, నా మనస్సు ఈ విధంగా ఈశ్వరునియందు లక్ష్యముంచి అనుసంధించాలని బోధిస్తున్నావు గనుక, నీవొక గురువువు' అన్నారట. ఇదేవిధంగా ఏదిచూస్తే, అదే గురువని చెప్పి కడకీ శరీరమే గురువన్నారు. ఏమంటే నిద్రలో ఈ శరీరం లేదుగదా? ఈ లేనిదానియందు దేహాత్మ భావన కూడదని బోధిస్తున్నది. అందువల్ల ఇదీ గురువే నన్నారు.
వారు లోకమంతా గురువుగా భావిస్తే, వారిని లోకమంతా గురువని కొండాడింది. ఈశ్వర విషయమూ అంతే. లోకమంతా ఈశ్వరమయంగా ఎవరు చూస్తారో వారిని ఈశ్వరుడని లోకం పూజిస్తుంది. మనమెంతో లోకమంతే. 'యద్భావం తద్భవతి' అన్నారు.
పెద్దతోట ఉంటుంది. కోకిలవస్తే, మంచి పండ్ల నిమిత్తం మామిడి చెట్లు వెదుకుతుంది. కాకి వస్తుందనుకో. అది వేపచెట్లు వెదుకుతుంది. తుమ్మెదలు; తేనెకొరకు మంచి పూలను వెదికితే, ఈగలు మలాన్నన్వేషిస్తవి. సాలగ్రామం కావలసినవాడు రాళ్ళన్నీ త్రోసివేసి అది ఒక్కటీ గ్రహించి పూజిస్తాడు. ఆ సాలగ్రామం రాళ్ళలోనే ఉంటుంది. చెడు ఉంటనే మంచి తెలుస్తుంది. చీకటి ఉంటేనే, వెలుగు శోభిస్తుంది. మాయ ఉంటేనే ఈశ్వరుడున్నాడు.
సారగ్రాహి నూరింటిలో ఒక్క మంచి దొరికితే చాలు. ఆ ఒక్కటీ గ్రహించి, తొంబదితొమ్మిది త్రోసివేసి ఇదొక్కటి చాలురా మనకు, దీనితో లోకమంతా జయించ వచ్చు ననుకుంటాడు. వారి దృష్టి ఆ ఒక్కదాని మీదనే ఉంటుందని మేఘ గంభీరధ్వనితో పలికి విరమించారు.
🙏భగవాన్ శ్రీ రమణులు🙏
🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment