*అష్టావక్ర మహర్షి !*
🔥🌹🔥🌹🔥🌹🔥🌹
బాహ్య సౌందర్యం కన్న అంతః సౌందర్యం గొప్పదని తన నడవడికతో చెప్పకయే చెప్పిన మహిమాన్విత మూర్తి అష్టావక్రుడు. అష్టావక్రుడు అనే గొప్ప విద్యాశక్తిసంపన్నుడైన మహర్షి ఉండేవాడు. ఈతని తండ్రి ఏకపాదుడు అనే భ్రాహ్మణుడు.ఈయనకు "కహోలుడు" అని కూడా ఇంకొక పేరు.అతను నిరంతర తపోనిరతుడు.వేదవేత్త.ఉద్దాలకుడి చెల్లెలు సుజాత ను పెళ్ళిచేసుకున్నాడు.ఏకపాదుని దగ్గరకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనం చేస్తూ ఉండేవారు.శిష్యకోటితో కాలక్షేపం చేస్తూ భార్య సుజాత తో కలసి జీవించసాగాడు ఏకపాదుడు.సుజాత గర్భవతి అయ్యింది.అష్టావక్రుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే తన తండ్రి ఏకపాదుడు తన శిష్యులచే నిరంతరము వేదాధ్యయనము చేయించటం విని తండ్రితో ఇలా పలికాడు. "తండ్రీ!నిరంతర వేదాధ్యయనముచే శిష్యులను మిగుల బాధించుచున్నారు.అందువలన వారి ఆరోగ్యము పాడగును!" - ఆమాటలకు ఏకపాదునికి కోపంవచ్చి " నా అధ్యాపనమును గురించి వక్రభాష్యం చేసావు (వక్రముగా పలుకటం) కావున నీవు అష్టవక్రములతో (ఎనిమిది వంకరలతో) పుట్టుము" - అని తల్లి గర్భమున ఉన్న శిశువును(తన కుమారుని) శపించాడు.
కొంత కాలానికి అష్టావక్రుడు పుట్టకముందే భార్య కోరిక మేరకు ధనార్జనకోసం జనక మహారాజు సభకు వెళ్ళాడు.ఆ సభలో వరుణుని కుమారుడైన "వంది" చేతిలో వాదనలో ఓడిపోయాడు.పందెం ప్రకారము ఓడినవారు జలమజ్జితులై ఉండాలి.నియమం ప్రకారం ఆ ఏకపాదుడు జలములందు ముంచివేయబడ్డాడు.
ఎనిమిది వంకరలతో పుట్టిన అష్టావక్రుడూ తన మేనమామ ఉద్దాలకుడి ఇంటిలో అతని కుమారుడైన శ్వేతకేతువుతో కలసి వేదాభ్యాసము చేసాడు.ఒక సందర్భములో శ్వేతకేతు మాటలకు కుపితుడై అష్టావక్రుడు వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్ళి "నా తండ్రి ఎవరు? ఎక్కడ ఉన్నారు? " అని అడుగుతాడు. దానికి సుజాత "నీ తండ్రి ఏకపాదుడు.ధనార్జన కోసం జనకుని రాజ్యమునకు వెళ్ళారు" అని చెపుతుంది. తత్వజ్ఞాని ఐన అష్టావక్రుడు విషయం గ్రహించి శ్వేతకేతుతో కలిసి జనకుని రాజ్యమునకు వెళ్తాడు.తిన్నగా ఆస్థానము లోపలికి వెళ్ళబోతుంటే ద్వారపాలకులు అడ్డుపడి పిల్లలకు ప్రవేశార్హత లేదని చెపుతారు.వారితో అనేక శాస్త్ర విషయాలు చెప్పేసరికి మారు మాట్లాడకుండా అష్టావక్రునికి లోపలికి వెళ్ళటానికి దారినిస్తారు.
అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు దగ్గరకు వెళ్ళి "వంది"తో వాదిస్తానని చెపుతాడు.ఇంత చిన్న బాలుడవు వంది తో వాదకు కుదరదు అన్న జనక మహారాజుతో వాదించి తన శక్తి సామర్ధ్యాలు తెలియచేసాడు.అష్టావక్రుడు జనక మహారాజుతో చేసిన వేదాంత చర్చయే "అష్టావక్ర సమ్హిత".ఆత్మజ్ఞానాన్ని అందించే సంకీర్తనము,శాంతి,నిర్వేదము,జీవన్ముక్తి మొదలైన విషయాలపైన ఎన్నో వేదాంత విషయ వివరణలు ఈ గ్రంధములో ఉన్నాయి.జనకుడు వంది తో వాదనకు అంగీకరించాడు.వాద ప్రతివాదనలలో చివరకు వంది ని బాలుడైన అష్టావక్రుడు ఓడించాడు.జలమజ్జితుడైన తన తండ్రి ఏకపాదుని విడిపించాడు.జనకుడు అష్టావక్రుని చేత అద్వైత వేదాంత సిద్ధాంత రహస్యములను తెలుసుకున్నాడు.తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతో సంతోషించి నదిలో స్నానం చేయించి తన కుమారుని అష్టవంకరలు పోయేటట్లుచేశాడు.
సుందరాకారము పొందిన అష్టావక్రుడు వదాన్య మహర్షి కుమార్తె ఐన సుప్రభ ను వివాహమాడి పుత్రులను పొందాడు.ఆదర్శప్రాయమైన గృహస్థాశ్రమాన్ని సాగించాక అష్టావక్రుడు పుష్కర తీర్థములో తపస్సు చేసి మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీ కృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి మరణించి గోలోకమునకు పోయి మోక్షమును పొందాడు.
అష్టావక్రుని గురించి అనేక గాధలున్నాయి.ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా, ఈతని కురూపమును చూసి రంభాది అప్సరసలు నవ్వినందున, వారు దొంగలచే పట్టుబడునట్లు శపించాడు.అనంతరము వారు క్షమించమని వేడి నృత్యగీతములను అష్టావక్రుడికి వినిపించారు.అందుకు సంతోషించిన మహర్షి ఏమి కావాలి అని అడుగగా వారందరూ విష్ణుమూర్తితో పొందును కోరారు.వారి కోరిక విన్న అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జన్మించి ఆతని పొందగలరు అని పలుకుతాడు. ఆయన అనుగ్రహం కారణంగా గోపికారూపులైన కృష్ణుని భార్యలు గాను,శాప కారణంగా కృష్ణ నిర్యాణానంతరము సముద్రము ద్వారకను ముంచేస్తుంది కాబట్టి, కృష్ణుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు కృషుని భార్యలైన వారిని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళుతున్నప్పుడు వారు దొంగలచేత పట్టుబడి నగలు తదితర వస్తువులను సర్వము కోల్పోతారు.అంత ధీరుడైన అర్జునుడు దొంగల చేతిలో ఓడిపోయి ఏమీ చేయలేని స్థితికి చేరుతాడు.
పూర్వజన్మలో అష్టావక్రుడు దేవలుడు.ఇతడు మాలావతి ని వివాహము చేసుకొని సంతానము పొంది విరాగై తపస్సు చేస్తూ ఉండగా అతని తపస్సు కు వేడిపుట్టి ముల్లోకములను బాధించసాగింది.ఇంద్రుడు దేవలుని తపస్సు భగ్నం చేయాలని రంభను పంపితే ఆతను చలించలేదు.అందుకు రంభ కోపముతో మరుజన్మలో నీవు అష్టావక్రుడవై జన్మించమని శపించింది.తర్వాత వెంటనే పశ్చాత్తాపంతో శాపవిమోచనం కూడా తెలియచేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది.ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు.
తండ్రిని జలబంధము నుండి తరింపచేసిన తనయుడు.దివ్య మహిమోపేతుడు.అతి తేజస్వి.లోకపూజితుడు అష్టావక్రుడు.
సర్వేజనాసుఖినోభవంతు🙏
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment