Tuesday, 30 May 2023

నిజమైన సంతృప్తి ఎక్కడ? (05-June-23, Enlightenment Story)

 *నిజమైన సంతృప్తి ఎక్కడ?*

💥💥💥💥💥💥💥💥💥           

ఎందరో చక్రవర్తులు ఈ భూమిని పాలించారు. సుదీర్ఘకాలం పాలన చేశారు. ఎన్నో విజయాలు సాధించారు. ఎన్నో సుఖాలు అనుభవించారు. ఎన్నో అద్భుత నిర్మాణాలు చేశారు. కానీ ఏ ఒక్క మహారాజూ ‘పొందవలసినది పొందాను, అంతా అనుభవించాను’ అనే తృప్తితో గతించలేదు.

దేవతల నుంచి దివ్యాస్త్రాలను పొందిన మహావీరుల గురించి మన ఇతిహాసాలు చెబుతాయి. వీరు బాహ్య శత్రువులను జయించారే తప్ప, అంతఃశత్రువులను గెలవలేకపోయారు.

ఆ మహావీరులెవ్వరూ మానసిక ఉన్నతికోసం దైవ శక్తులను కోరలేదు. వారి తపస్సులో కేవలం విజయకాంక్ష తప్ప మరొకటి లేదు. ఈ దివ్యాస్త్రాలూ నిష్ఫలమైన సందర్భాలున్నాయి.

గొప్పగొప్ప అస్త్రాలే హనుమను ఏమీ చేయలేకపోయాయని రామాయణం చెబుతోంది. అర్జునుడు వరాలకోసం శ్రీకృష్ణుణ్ని ఆశ్రయించలేదు. అందుకే దివ్యజ్ఞానామృతాన్ని (భగవద్గీత) పొందగలిగాడు. 

కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థిస్తే, ఆ చిట్టా పెరుగుతుందే కానీ దైవబలం పెరగదు.దేనివల్ల ఆనందాన్ని, శాంతిని, సంతృప్తిని పొందుతామో తెలియక, మనిషి ఇంద్రియాల చేతిలో మోసపోతున్నాడు.

వేటగాడు జింకను వేటాడినట్లే, వాంఛలు మనిషిని వేటాడుతున్నాయి. కల్పవృక్షం ప్రసాదించే భోగాలూ క్షణికానందాన్నే ఇస్తాయి. మనిషి ఎన్ని తీర్థాలను, దేవతలను సేవించినా, విషయవాంఛల నుంచి బయటపడనిదే ప్రయోజనం ఉండదు.

’విషయవాంఛలు’ అనే శత్రుసేన ఈ శరీరాన్ని ఆక్రమించింది. ఇంద్రియాలతో పొందే అనుభూతులే వాటి గజబలగం. కామ క్రోధాదులే వాటి ఆయుధాలు. అహంకారం వాటికి సేనాపతి. ఇంద్రియాలు వాటి పతాకం. దేహమనే రాజ్యంలో అంతరంగమనే రాజప్రాకారాన్ని ఇవి చుట్టుముట్టాయి.

’బుద్ధి’ అనే మంత్రిని చీకటి గదిలో బంధించాయి. మనసు అనే రాజును బానిసను చేశాయి. ఎంతటి పరాక్రమశాలి అయినా బాహ్యంగా కనపడే శత్రువులతో తలపడగలడు. కాని, కంటికి కనపడకుండా తనలోనే తిష్ఠవేసిన ప్రత్యర్థులతో పోరాడలేడు. ఇంద్రియ నిగ్రహం, బుద్ధి వికాసంతోనే ఇది సాధ్యమవుతుంది.

ఇంద్రియాలను అరణ్యంతో పోల్చారు పెద్దలు. అడవిని సులభంగా దాటాలంటే దాని గురించి తెలియాలి. అలాగే ఇంద్రియాల కిటుకు తెలిస్తే, ఇంద్రియారణ్యాన్ని సులభంగా దాటగలుగుతాం.

ఇంద్రియాలు మనసును ఎలా మాయచేస్తాయో, మనిషి సూక్ష్మదృష్టితో గమనించాలి. చర్మ సౌందర్యంతో మనసును మోహింపజేసే కళ్లు, వాటి వెనకనున్న రక్తమాంసాలను కప్పిపుచ్చుతుంది. సుగంధాలను అందించే ముక్కు, దుర్గంధమైన దేహంలోనే తాను కూడా ఉన్నాననే స్ఫురణను మరపిస్తుంది. రుచులను మనసుకు అలవరచే నాలుక, వాటి చాటున దాగిఉన్న రోగాలను దాచిపెడుతుంది. ఇక శ్రవణేంద్రియమైతే (చెవులు) మనిషిని సత్కార తిరస్కార మాటలతో మభ్యపెడుతుంది. ఇలా అన్ని ఇంద్రియాలూ మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి.

మనిషిలోనే ఉంటూ, మనిషిని నడిపించే ఈ ఇంద్రియాలను మనసు స్వాధీనపరచుకోవాలి. వినటం, చూడటం, స్పృశించటం, గ్రహించటం… ఇలా మనం చేసే అన్ని పనులూ ఇంద్రియ కార్యకలాపాలే. ప్రతి ఇంద్రియానికీ దైవ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి అనే రెండు స్వభావాలు ఉంటాయి.

సత్కర్మలు, సత్ప్రవర్తన, సత్‌ సాంగత్యం ఇంద్రియాల్లో దైవప్రవృత్తిని నింపుతాయి. అవి ఇంద్రియారణ్యం నుంచి బయటపడే మార్గం చూపిస్తాయి. బుద్ధి వికాసానికి తోడ్పడతాయి.

మనసును ఇంద్రియాలకు దూరంపెట్టి, బుద్ధికి చేరువ చేయాలి. అప్పుడే అంతరంగంలో తిష్ఠవేసిన విషయవాంఛలనే శత్రువులను జయించగలం. ఇంద్రుడు అనే ఇంద్రియాధిపతి (మనసు)కి, బృహస్పతి అనే బుద్ధి హితబోధ చేస్తే… ఆనందం, శాంతి, సంతృప్తి ఎక్కడ లభిస్తాయో మనిషి గ్రహించగలుగుతాడు.✍️

!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...