Monday, 15 May 2023

ఆదర్శమూర్తి - శ్రీ హనుమాన్ (17-May-23, Enlightenment Story)

 *ఆదర్శమూర్తి*

🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸

రామనామం ఎక్కడున్నా భాష్పపూరిత జలనయనాలతో కనిపించేరూపం ఒక్క ఆంజనేయునిదే అయఉంటుంది. చిన్నతనంలోనే సూర్యబింబాన్ని అందుకోబోయన చిరుత మారుతి ఎంతబలవంతుడో ఎవరికైనా అర్థమవుతుంది. అట్లాంటి ఆ బలశాలి సముద్ర లంఘనం చేయడానికి ఎవరు బలాఢ్యులో అని సందేహపడుతుంటే అసమానపరాక్రమశాలి అయ ఉండికూడా తనకు బలమున్నది అన్న సంగతి చెప్పకుండా అందరితో సహా తాను సందేహమనస్కుడయ్యాడు. అంటే ఇక్కడ మనం ఎంత ప్రతిభావంతులమయనా దాన్ని ఎదుటివారు గుర్తించాలి కాని మనకే మనం విర్రవీగకూడదని తెలుస్తోంది కదా. ఇలా ప్రతి అంశంలోను ఆంజనేయుడు మానవులకు మార్గదర్శిగా ఉన్నాడు. మాట్లాడే నేర్పున్న మనిషికి విచక్షణాబుద్ధితో ఎట్లా మాట్లాడాలో నేర్పించడానికి ఆంజనేయుని మాటతీరును పరికిస్తే చాలు.

కుశాగ్రబుద్ధితో కార్యసాఫల్యం కావాలంటే ఆంజనేయులవారే మనకు మార్గదర్శి. సముద్రలంఘనం చేయడంమంటే ముక్కుకు సూటిగా వెళ్లడం కాదు.. దారిలో వచ్చే ఆపదలను, అనుభవావలను అర్థం చేసుకొంటూ ముందుకుపోవాలని చేసి చూపించాడు సురస, సింహికల బారిన పడకుండా ఎలా తప్పించుకున్నాడో అట్లానే స్నేహహస్తాన్ని చాచిన మైనాకుణ్ణి కూడా మనసునొప్పించకుండా దూరంగానే ఉంచాడు. అతి అయతే పాయసం కూడా చేదే. కనుక మైనాకుడు అందుకోమన్నా ఆతిధ్యాన్ని రామకార్యనిమిత్తం వెళ్తున్నాను అంటూ తిరస్కరించాడు.

ఎంతటి బలవంతులైనా అధికార బలం, అంగబలం, అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నా సంయమం లేకపోతే సర్వం నాశనం అవుతుందని గుర్తించాలి. సంపదఉందని అంగబలం ఉందని విర్రవీగితే అవి దైవబలానికి ఏనాటికి సరితూగవని, అధర్మానికి కొమ్ముకాయవని రావణునికి హితబోధ చేసిన ధీశాలి అంజనీసుతుడు. విభీషణుణ్ణి దగ్గరచేర్చుకుని ఆదరించడంలో తప్పులేదుచెప్పి మంచివారికి మంచివారుతోడైతే మహత్ కార్యాలు జరుగుతాయని నిరూపించాడు. అంటే ఎక్కడ ఏవిషయాన్ని బుద్ధితో ఆలోచించాలో నేర్పించాడు. మంచి చేయడానికి కాలహరణం చేయక్కర్లేదని నేర్పించాడు. శోకమూర్తిగా నున్న సీతమ్మను ఓదార్చిన హనుమన్న భోగలాలసతో కన్నుమిన్ను కానకుండా ఉన్న సుగ్రీవునికి బుద్ధి చెప్పి కోపావేశంతో రగిలిపోయే లక్ష్మణుడిని శాంతింపచేయడానికి ముందుకు నడువమని చెప్పాడు. అటువంటి హనుమంతుణ్ణి ఈ కలియుగంలో కలిబాధలను తీర్చమని వేడుకుంటారు. ఆకుపూజలు, వడమాలలు వేసి ఆంజనేయుని తమకు అండదండగా ఉండాలని మొక్కుకుంటారు. పిశాచాదిబాధలను దూరం చేసుకోవడానికి కూడా ఆంజనేయుని ముమ్మారు తలిస్తే చాలంటారు ఆంజనేయుని భక్తులు.

హనుమంతుని వ్రతముచేయడం, అరటితోటలో ఆంజనేయుని స్తుతించడమూ, ఆంజనేయునికిష్టమైన రామాయణ పారాయణ ఇవన్నీ కూడా కేసరినందనుని అనుగ్రహాన్ని పొందడానికి ఉపాయాలేనంటారు మారుతి భక్తులు.

ఇవన్నీ కాదు రామాయణంలో హనుమంతుడు ఏవిధమైన నడకను కలిగిఉన్నాడో బాగా పరిశీలించి ఆవిధంగా మనం మన నడవడిని తీర్చి దిద్దుకుంటే మనుగడఎంతో బాగుంటుందని చాలామందే నమ్ముతారు. ఆంజనేయుని చూసి సేవాధర్మం, భక్తుని ధర్మం, కర్తవ్యదీక్ష ఎలా ఉండాలో తెలుసుకొంటే నిత్యజీవితంలో కార్యసాఫల్యతను సాధించవచ్చు. కుశాగ్రబుద్దిని అలవర్చుకోవచ్చు. కష్టనష్టాలు కలిగినప్పుడు మనో ధైర్యాన్ని కోల్పోకుండా మానవత్వంతో చరించవచ్చు. అందుకే ప్రతివారికీ రామభక్తుడు, ఆంజనేయుడు ఆదర్శమూర్తిగాను, ఆరాధనీయుడుగాను కనిపిస్తాడు.

🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...