Thursday, 14 March 2024

అమ్మ - ఓపికకు మారు పేరు (15-Mar-24, Enlightenment Story)

అమ్మ - ఓపికకు మారు పేరు         

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

మనం ఎంత పెద్ద అయినా, అమ్మ మనకి ఎంత తెలిసినా ఇంకా ఇంకా అమ్మ మనల్ని ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. మనం ఎప్పటికి అమ్మలా ఆలోచించ గలుగుతాం అని నాకు అనిపించే క్షణాలు ఎన్నో!*

 నేను నా పిల్లలతో వున్న ప్రతి సారీ  మా అమ్మ మాతో ఉన్నట్టు నా పిల్లలతో ఉన్నానా? అమ్మలా అన్ని చేస్తున్నానా? అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించు కుంటాను. ఒక్కసారీ తృప్తిగా నేను మా అమ్మ మాకు చేసినట్టు నా పిల్లలకి చేస్తున్నాను అని అనిపించదు. అమ్మ తో సరిసమానం కావటం కష్టం అని పోల్చి చూసుకోవటం మానేసాను.

చిన్నప్పుడు రాత్రి అందరి భోజనాలు అయ్యి మేము మంచాలు ఎక్కి రేడియో లో పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మ వంటింటిని మర్నాటి కోసం సిద్ధం చేసే పనిలో ఉండేది. స్టవ్ కడగటం, వంటిల్లు కడగటం, మంచినీళ్ల బిందెలు తోమటం ఇలా..అమ్మ పని చేస్తుంటే వెళ్లి సాయం చేయాలి అని తోచక పోగా అమ్మా త్వరగా రా, ఎంతసేపు పని చేస్తావ్ అని పిలిచేదాన్ని.


అమ్మ వస్తూనే నిద్ర పోయేది. అమ్మా నీకు నీరసం రాదా? రోజంతా పని చేస్తావు? అని అడిగితే అమ్మ స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉండేది , "అమ్మని కదమ్మా ! నీరసం ఉండదు" అని.*

అది విని చిన్నప్పుడు ఓహో అమ్మలకి నీరసం రాదేమో అనుకునేదాన్ని. ఎక్కడకి అన్నా వెళ్లి వచ్చాకా కాళ్ళు నొప్పులు అని మేమంతా కూర్చుంటే అమ్మ చకచకా పనులు చేసేసేది. మళ్ళి నాది సేమ్ క్వశ్చన్, అమ్మ సేమ్ ఆన్సర్. ఇంక నేను ఫిక్స్ అయిపోయా 'అమ్మలకి నీరసం, కాళ్ళు నొప్పులు, విసుగు లాంటివి వుండవు అని.*

అందుకే రాత్రి అందరం పడుకున్నాకా అమ్మ వీధి గుమ్మం తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెడుతున్నా, బట్టలు ఉతికి ఎర్రటి ఎండలో మోకాళ్ళ నొప్పులతో మేడ ఎక్కి ఆరేసినా నాకు చీమ కుట్టినట్టు కూడా ఉండేది కాదు. అమ్మ కి బోలెడు ఓపిక , అంత పిల్లలకి ఉండదు, కాబట్టి మనం ఎంత ఓపిక ఉంటే అంతే పని చేయాలి, ఓపిక లేక పోతే రెస్ట్ తీసుకోవచ్చు అనుకునేదాన్ని.


ఇప్పుడు 73 ఏళ్ల వయసులో కూడా మేడం చకచకా పనులు చేయటానికి ముందుకు ఉరుకు తుంది. అలసట ఉండదా అంటే 'అమ్మని కదమ్మా , పిల్లల కోసం చేస్తుంటే అలసట గా ఉండదు' అంటుంది.*

మా అందరికి ఇష్టం అయినవి అడగాలే కానీ వంటింటిలోకి ప్రవేశించి ఎన్ని గంటలు అయినా విసుగు లేకుండా వండేస్తుంది. పైగా మేము చేస్తాం అంటే ' వద్దమ్మా , అలసి పోతారు అంటుంది.' ఇన్నేళ్లు వచ్చినా మేము పిల్లలమే  అమ్మ కి.*

పెళ్లి అయ్యి ఇన్నేళ్లు అవుతోంది , ఇప్పటికీ పచ్చళ్ళు, ఆవకాయలు, కారప్పొడులు, మెంతి పొడులు, చారు పొడి ఏవీ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. నాకు రాదు అని అమ్మ గట్టిగా నమ్మి అన్నీ  చేసి పంపిస్తుంటుంది.

*అల్లం పచ్చడితో సహా అమ్మ చేయటం , నాన్న జాగ్రత్త గా ప్యాక్ చేసి పంపించటం. మేము వాటిని అందుకుని తిని అమ్మా సూపర్ అంటే ఆవిడ తృప్తి చూడాలి. పొరపాటున ఎప్పుడన్నా నేను చేసుకుంటాను, నువ్వు ఎందుకు కష్టపడటం అంటే, 'నీ మొహం నీకు రాదు, అయినా నీకు ఖాళీ ఎక్కడ ? అలసి పోతావ్ ,  అలాంటి పనులు పెట్టుకోకు ' అంటుంది.*             

అమ్మ కి అలసట ఉండదు ఇది ఇప్పటికీ అమ్మ చెప్పే సూత్రం. ఆ సూత్రం అర్ధం ఏంటో నేను అమ్మ అయ్యాకా తెలిసింది. అమ్మ ని చూస్తే ఎక్కడ లేని నీరసం వచ్చి , కూర్చుని అమ్మతో పనులు చేయించుకుంటానా?’*

మా పిల్లలిద్దరూ ఏమడిగినా ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. వాళ్ళు అడిగింది చేసి పెట్టేదాకా నీరసం గుర్తు రాదు. ఇప్పుడు మా పిల్లలు అడుగుతారు 'అమ్మా నీకు నీరసంగా ఉండదా? అని.' నేను మా అమ్మ నాకు చెప్పిన డైలాగ్ వాళ్ళకి చెబుతాను. రేపు వాళ్ళు అమ్మలు అయ్యాకా దాని అర్ధం తెలుస్తుంది వాళ్ళకి.*

*తరం తరం నిరంతరం అమ్మకి నీరసం ఉండదు.*


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

2 comments:

  1. Hello andi, ee content nenu maa amma gari kosam rasi na fb time line lo post chesanu. ikkada naa peru teesi post chesaru.

    ReplyDelete
  2. https://www.facebook.com/ivramadevi/posts/pfbid02e53K8wzkB7TLKaVrPVo3oRG179agcawhjWK1msXncRb1PaRxba8RRc5JeqX9zPq6l

    ReplyDelete

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...