*నేను కొనబోయే ఆవు కథ*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
పేరొందిన హాస్య కళా మూర్తి గోపాల్ భాండ్ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో, ఆయన ఇంటి ప్రక్కనే పేద దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు. ఆ భార్యాభర్తలిద్దరికీ, పాపం, పగటి కలలు కనే అలవాటు ఉండేది. ఒక రోజున గోపాల్ భాండ్ వింటుండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళను మించి మరొకళ్ళు కోతలు కోస్తూ పగటి కలలు కనటం మొదలు పెట్టారు.
భర్త అన్నాడు: " నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే, నేనొక ఆవును కొంటాను" అని.
భార్య శృతి కలిపింది- "అప్పుడు నేను పాలు పిండుతాను. మనకు చాలా కుండలు అవసరమౌతాయి మరి. నేను వెళ్ళి, కొన్ని కుండలు కొనుక్కురావాలి" అని.
"బాగుంది, బాగుంది. మరి ఇంక ఆ ఐదో కుండ దేనికి?" అడిగాడు భర్త.
"మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలికి ఇవ్వటం కోసం ఈ ఐదో కుండ!" అన్నది భార్య.
"ఏంటీ!? మిగులు పాలు మీ చెల్లెలికి ఇస్తావా?! ఎంతకాలంగా చేస్తున్నావు, ఈ పని? నాకు కనీసం చెప్పకుండా, నా అనుమతి లేకుండా, ఇంత నాటకం ఆడుతున్నావా?" అని భర్త అరుస్తూ, కోపం పట్టలేక కుండల్ని విసిరేసి, అన్నింటినీ పగలగొట్టేశాడు.
ఇక భార్య తిరగబడింది- " ఆవు ఆలనా, పాలనా చూసేది నేను! పాలు పిండేది నేను! మిగులు పాలతోనాకేది ఇష్టమైతే అది చేస్తాను!" అని.
"దుర్మార్గురాలా! నేను రాత్రింబవళ్ళూ చెమటోడ్చి పనిచేసి, డబ్బులు కూడబెట్టి, ఆవును కొంటే, ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలికి పోసేస్తావా? ముందు నిన్నేం చేస్తానో చూడు" అని గర్జిస్తూ, భర్త తన చేతికందిన మూకుళ్లనూ, గిన్నెల్నీ భార్య మీదికి విసిరేశాడు.
ఇంట్లోంచి వింటున్న గోపాల్ భాండ్ కి చాలనిపించింది. అతను పక్కింటికెళ్ళి అడిగాడు అమాయకంగా- "ఏమైంది? వంట సామాన్లన్నీ ఎందుకు విసిరేస్తున్నారు?" అని.
" మా ఆవు పాలన్నీ తీసుకెళ్ళి, ఈమె తన చెల్లెలికి పోసేస్తోంది!" అన్నాడు భర్త.
"మీ ఆవా?!" అడిగాడు గోపాల్ భాండ్.
"అవును. తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు!"
"ఓహో, ఆ ఆవా? మీకు ఈరోజున ఇంకా ఆవు లేదు, కదూ?" అడిగాడు గోపాల్.
భర్త అన్నాడు- " చూస్తూండు. ఎప్పటినుండో అనుకుంటున్నాను. నేనొకదాన్ని తెస్తున్నాను త్వరలో" అని.
"ఓహో ఇప్పుడు అర్థమైంది, నా కూరగాయల తోట ఎప్పుడూ నాశనం ఎందుకౌతున్నదో!" అని గోపాల్ అకస్మాత్తుగా ఓ చింత బరికె చేతపుచ్చుకొని అతని మీదికి ఉరికాడు.
"ఆగు..ఆగు... నన్నెందుకు కొడుతున్నావు?" అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు పక్కింటాయన.
"నీ ఆవు! నీ ఆవు మా తోటలోకి జొరబడి, నా చిక్కుళ్ళనీ, దోసపాదుల్నీ ఇష్టం వచ్చినట్లు నమిలేస్తోంది. నువ్వు దాన్ని అట్లా వదిలేశావు!" అని చిందులేశాడు గోపాల్.
"ఏ చిక్కుళ్ళూ, ఏ దోస పాదులు? నీ కూరగాయల తోట ఎక్కడుంది అసలు?"
*నేను నాటబోతున్న చిక్కుళ్ళూ, నేను పెట్టబోతున్న దోసపాదులు! నేను పెంచబోతున్న కూరగాయల తోట! నేను ఎంతో కాలంగా దాన్ని గురించి ఆలోచిస్తుంటే, మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తోంది దాన్ని!" అన్నాడు గోపాల్ ఊపిరి బిగబట్టి*
పొరుగింటివాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నై. కలలన్నీ విరిగి, ఆకాశం నుండి నేలకు దిగి వచ్చారు. ఆపైన కొద్ది సేపటికి అందరూ కలిసి నవ్వుకున్నారు.
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment