Friday, 3 November 2023

గంగయ్య జువ్వి చెట్టు(07-Nov-23, Enlightenment Story)

 🍁ప్రత్యుపకారం🍁

🕉️🌞🌎🏵️🌼🚩

పులిచెర్లలో గంగయ్య అనే తాపీ పనివాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ పట్నం వెళ్ళి పనిసేవాడు. ఆ వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన బియ్యమో, రాగి-జొన్నలో కొనుక్కుని, కాలినడకన ఊరికి తిరిగి వచ్చేవాడు.

అతను వచ్చే దారిలోనే, ఊరికి దగ్గరగా పెద్ద జువ్వి చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు కింద ఓ పెద్ద చీమల పుట్ట ఉండేది. గంగయ్య ప్రతిరోజూ ఆ పుట్ట దగ్గర ఆగేవాడు. తను తెచ్చుకున్న ధాన్యపు మూటని విప్పి, ఒక చారెడు ధాన్యం తీసి, ఆ పుట్ట చుట్టూ పోసి ఆనక మెల్లగా నడచుకుంటూ ఇంటికి పోయేవాడు.

అది చూసి కొందరు నవ్వుకునేవాళ్ళు: "వీనికి ఇదేమి పిచ్చి?! తను ఏమైనా దానకర్ణుడ-నుకుంటున్నాడో ఏమో. ఇతనికే ఏమీ లేదు కదా, తినేందుకు?! అయినా కష్టపడి సంపాదించిన సొమ్మును ఇంటికి తీసుకుపోయి దాచుకోక, నేలపాలు చేస్తాడు. తిక్కే, వీడికి!" అని అనుకునేవాళ్ళు.

తనని ఎవరు ఎన్ని మాటలన్నా, గంగయ్య మటుకు వారి మాటల్ని చెవికి ఎక్కించు-కునేవాడు కాదు. కాలం గడిచే కొద్దీ ఆ చెట్టు కాస్తా జనాల భాషలో 'గంగయ్య జువ్వి చెట్టు' అయ్యింది. చీమలు అతడిని గుర్తించినాయో లేదో గాని, అతడు మాత్రం చీమలకు గింజలు వెయ్యని దినమే లేదు.

అలా ఉండగా ఆ ప్రాంతంలో క్రమంగా వర్షాలు తగ్గిపోసాగినై. ఒక ఏడాదైతే అక్కడి నేల మొత్తం బీటలు వారింది; చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు అన్నీ ఎండిపోయాయి! భూమిలో తేమ తగ్గిపోయింది. జువ్విచెట్టుకు కూడా నీరు చాల లేదు. అందుకని అది తన కొమ్మలకు, రెమ్మలకు నీటి సరఫరా తగ్గించింది. దానితో చిన్న చిన్న కొమ్మలు అన్నీ ఎండిపోసాగినై. క్రమంగా ఆ చెట్టును ఆశ్రయించి నివాసం ఉంటున్న పక్షులు కూడా వలస పోసాగాయి!

గ్రామంలో‌ జనాలంతా వాడుకొన్న నీళ్ళు పోయేందుకు ఓ మురికి కాలువ ఉండేది. అది గంగయ్య జువ్వి చెట్టుకు కొంత దూరంనుండే పోతుండేది. మరి ఈ చీమలకు ఆలోచన ఎట్లా వచ్చిందో ఏమోగాని, చెట్టు చుట్టు ప్రక్కల ఉన్న నేలను అంతా గుల్ల బార్చాయి. మురికి కాలువ వరకూ నేలకు చిన్న చిన్న రంధ్రాలు వేసి దారులు ఏర్పరచాయి.

చూస్తూ చూస్తూండగానే మురికి కాలువల్లో‌ని తేమ ఈ దారులను అంటుకున్నది. నెమ్మదిగా చెట్టు దగ్గరి వరకూ వచ్చి చేరింది. ఆ సంగతి తెలియగానే జువ్వి చెట్టు నులివేళ్ళు ఆ వైపుకు సాగాయి. తేమను అందిన జువ్వి చెట్టుకు ప్రాణం‌ లేచి వచ్చినట్లయింది. త్వరలోనే అది మళ్ళీ పచ్చగా అయ్యింది. అంతకు ముందున్న రూపాన్ని సంతరించుకుంది. వలసపోయిన పక్షులు కూడా తిరిగి తమ గూళ్లలోకి చేరుకున్నాయి ఆనందంగా.

చెట్టు చీమలనడగలేదు. చీమలు చెట్టుకు చెప్పలేదు. పక్షులు చెట్టుకు చెప్పిపోలేదు. అవి తిరిగి చెట్టునడిగి రాలేదు.

ప్రకృతి ఎవరి ప్రమేయమూ లేకుండా తనపని తాను సాగిస్తూనే ఉంటుంది. జీవుల మధ్య అవినాభావ సంబంధం అర్థం కానిది.

తర్వాత కొన్నేళ్లకు ఒకసారి ప్రకృతి మళ్ళీ వికటించింది. ఈసారి చిన్న గాలితో మొదలై, ఓ మోస్తరు వానగా మారి, చివరికి అదే కుండపోత వర్షమై, మన్ను మిన్ను ఏకమైనట్లు కురవసాగింది వాన! గంగయ్య ఇల్లు ఊరికి కొంచెం ఎడంగా ఉండేది. ఎండిన వాగు ప్రక్కనే, ఓ రాళ్ళగుట్టకు దగ్గరగా ఉండేది అతని ఇల్లు. అక్కడ అతనితో బాటు మరో‌ మూడు నాలుగు ఇళ్ళు ఉండేవి అంతే.

కొద్ది సేపటికి వంకల నీళ్ళు అన్నీ చేరుకునే సరికి, వాగులో ప్రవాహం మొదలైంది. దాంతో కాలనీవాసులకు అందరికీ‌ భయం వేసింది. అందరూ తమ తమ ఇళ్ళు వదిలి దూరంగా‌ పోయి, ఎత్తైన ప్రాంతాల్లో తల దాచుకున్నారు.

గంగయ్యకు ఎందుకనో భయం అనిపించలేదు. వేరే ఎక్కడికో‌ పోయి ప్రాణాలు కాపాడుకోవాలని కూడా అనిపించలేదు. పొంగుతున్న వాగుని, వానలో తడుస్తున్న జువ్వి చెట్టుని చూస్తూ అతను అక్కడే కూర్చున్నాడు.

రాను రాను ప్రవాహ ఉధృతి పెరిగింది. మెల్లగా గంగయ్య ఇంటి వైపు నేల కోతకు గురవ్వసాగింది. ఆ సరికే వంకలోకి రకరకాల వస్తువులు కొట్టుకొచ్చినై. గ్రామంలోకి నీళ్ళు వచ్చేసాయి. చాలామంది ఇళ్ళలోని వస్తువులు నీళ్ళపై తేలుతున్నాయి. ఇక మిగిలింది గంగయ్య ఇల్లు ఒక్కటే. " అది కూడా కూలిపోతుంది.. మొత్తం వంకలో పడి కొట్టుకొని పోతుంది- ఖాయం" అనుకున్నారు అందరూ.

అదేమి చిత్రమో గాని, అప్పటికప్పుడు పెద్ద బండరాయి ఒకటి గుట్ట పైనుండి జారి పడింది. ఆ శబ్దానికి అందరూ భూకంపం వచ్చిందేమో‌ అన్నట్లు ఉలిక్కిపడ్డారు. పడటం పడటం అది వంకలో పడింది! ప్రవాహ వేగానికి అడ్డంగా దొర్లుకొని, గంగయ్య ఇంటి పునాదిని ఆనుకొని నిలబడింది. ఆ ఒక్క బండ అడ్డు ఉన్నందువల్లనే నీటి ప్రవాహపు దారి మళ్ళింది. వాగు మొత్తం అవతలి ఒడ్డును ఒరుసుకొని పారింది!

వర్షం నిలిచి వాతావరణం‌ శాంతించేందుకు వారం రోజులు పట్టింది. చూడగా గంగయ్య ఇంటి పునాది ఏమాత్రం కోత పడలేదు. ఇల్లు చెక్కుచెదరలేదు. గంగయ్య తిరిగివచ్చి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు.

గంగయ్య చీమలకు ఆహారం అందించి-నందుకు ప్రతి ఫలంగా ఏ దేవుడో వచ్చి అతనికి సాయం అందిస్తారు అనుకున్నారు కదూ?! ఈ కథలో అట్లా జరగలేదు. మనం మానవతతో, ప్రతిఫలాన్ని ఆశించకుండా, 'తోటివారికి సాయం చేయటం మన కర్తవ్యం కదా' అనుకొని పని చేస్తూ పోతే, ఏదో ఒకనాడు-ఎప్పుడో‌ ఒకప్పుడు- ఎవరో ఒకరు తోడుగా నిలచి, మనకు సాయం అందిస్తారు. ఇది సున్నితమైన ధర్మం. గంగయ్య తనకు తెలీయకుండా చీమలకు సాయమందించాడు. ఆ సాయం ఊరికే పోలేదు. అది మరోరూపంలో అతనికి సాయంగా అందింది.

ఇతరులకు చేసే సాయం ఏనాటికీ వృధా పోదు!!🤘

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


1 comment:

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...