మనం చేసిన పాపాలకి శిక్ష
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు. కానీ తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని చేసేస్తూ ఉంటాం. ఈ విషయంలో మన సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది. మనం చేసే అన్ని తప్పులు (పాపాలు) మూడిటితోనే చేస్తాం. (1) కాయిక (శరీర గత); (2) వాచిక (మాటతో); మరియు (3) మానసిక (మనసుతో). ఆ తప్పులు ఏమిటో తెల్సుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం.
🌺 ఒకవేళ ఆ తప్పులు చేసినట్లైతే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పేరు. ఇవి ఎవరికి వారే వ్యక్తిగతంగాపరీక్షించుకుని మార్పు చెందే సుళువైన మార్గం.
(1) కాయిక (శరీరగత) పాపములు: మనుధర్మ శాస్త్ర ఆధారంగా…
🌺 శ్లోకం: అదత్తాముపాదానం హింసాచైవా విధానతః, పరదారోపసేవా చ శరీరం త్రివిధం స్మృతం.
🌺 అర్థం: అన్న్యాయముగా డబ్బు సంపాదించడం, హింస చేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, పరస్త్రీ సంగమం.. ఇవి శరీరముతో చేసే పాపములు (తప్పులు).
🌺 ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము: దేవ ద్విజ గురు ప్రాఙ్ఞ్య పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే.
🌺 అర్థము: దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ఙ్ఞానులను పూజించడం, శరీరమును శుచిగా ఉంచడం, పవిత్రమైన ఆచారములు, డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం, బ్రహ్మచర్యము (తన భార్యతో తప్ప ఇతర స్త్రీలయందు కామ దృష్టి లేకపోవడం), ఇతరులను హింసించకుండా ఉండడం.. ఇవి శారీరిక తపస్సులు.
(2) వాచిక (మాటతో) పాపములు:
🌺 శ్లోకము: పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశః, అసంబద్ధ ప్రలాపశ్చ వాఙ్ఞ్మయంస్యాచ్చతుర్విధం.
🌺 అర్థం: కఠినముగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను నిందిస్తూ మాట్లాడడం, వ్యర్థమైన/పనికిమాలిన మాటలాడడం.. ఇవి వాక్కుతో చేసే తప్పులు.
🌺 ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
🌺 శ్లోకము: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్ఞ్మయం తప ఉచ్యతే.
🌺 అర్థము: ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం, ఇష్టముగా మరియు మేలుకలిగించే విధంగా మాట్లాడడం, యదార్థము మాట్లాడడం, వేద శాస్త్రములను పఠించడం, పరమేశ్వరుని నామ జపం చేయడం.. ఇవి వాక్కుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సనబడుతుంది.
(3) మానసిక పాపములు:
🌺 శ్లోకము: పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం, వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం.
🌺 అర్థము: ఇతరుల డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలనే ఆలోచన, పరులకి కీడుతలపెట్టే ఆలోచన, శరీర అభిమానము.. ఇవి మనసుకి సంబంధించిన పాపములు.
🌺 ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
🌺 శ్లోకము: మనః ప్రసాదః సౌమ్యత్త్వం మౌనమాత్మ వినిగ్రహ:, భావ సంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే.
🌺 అర్థము: మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం, శాంత భావం, సదా భగవచ్చింతన చేసే స్వభావం, మనోనిగ్రహం, అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవడము.. ఇవి మానసిక దోషములను పోగొట్టే తపస్సులనబడతాయి. అన్నిటిలోకి మానసిక తపస్సు చాలా గొప్పది. ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే. మనందరం ఈ నిముషం నుండే అభ్యాసం మొదలెడదాం.
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment