*తృప్తితోనే పరమానందం!*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
"గురూజీ! నేను ఈ గ్రామములో ధనికుణ్ణి. విరివిగా దాన ధర్మాలు చేస్తుంటాను. తమరు మా గ్రామానికి వచ్చిన శుభ సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేశాను. మీరు దయతో మా ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాను.
"ఓ కోటీశ్వరుడా! విశ్వాన్ని సృష్టించినా, నిగర్వముగా ఉండే పరమాత్ముని కన్నా ధనికుడెవరు ? మేరు పర్వతమంత ధనం కూడా ఆయనకు చిల్లి గవ్వతో సమానం. ప్రకృతి దాన గుణానికి మరో పేరు. అది అందరికీ అన్నిటినీ ఇస్తూనే ఉంటుంది. అలాంటి ప్రకృతిని ప్రపంచానికి దానం చేసిన మహాదాత ఆపరమాత్మ. ఆయన దాతృత్వం ముందు ఎవరూ అధికులు కారు.
నేను మర్యాదలు ఆశించను. నీకంటే ముందు ఈ పేద వడ్రంగి తన ఇంటికి భోజనానికి పిలిచాడు. నేను ఎవరి ఇళ్ళకు వెళ్ళను. అది తెలిసే అతడు ఇక్కడికే ఆహారం తెచ్చాడు. నువ్వు కూడా అలాగునే చేయవచ్చును!" అని అన్నాడు గురు నానక్.
ఆ మాటలు విన్న కోటీశ్వరుడు "అలాగే గురు మహరాజ్ !" అంటూ తన సేవకులతో విందు భోజనాన్ని పరుగుల మీద అక్కడికి తెప్పించాడు.
గురునానక్ చుట్టూ ఆ గ్రామ ప్రజలు చేరారు. ఎవరి ఆహారం గురువు మెచ్చుకొంటాడో అని అందరూ కుతూహలంతో చూస్తున్నారు. వండ్రంగి తెచ్చిన ఆహారంలో ముతక గోధుమ పిండి రొట్టెలు, రెండు మామిడి పళ్ళు వున్నాయి.
ధనికుడు తెచ్చిన ఆహారంలో మేలు రకం గోధుమ పరోటాలు, పసందైన మామిడి రసాలు ఉన్నాయి. గురునానక్ కుడి చేత్తో, వండ్రంగి తెచ్చిన మామిడి పండు తీసుకొన్నాడు. ఎడమ చేత్తో ధనికుడు తెచ్చిన మామిడి పండు తీసుకున్నాడు.
ముందుగా వండ్రంగి తెచ్చిన మామిడి పండును గట్టిగా పిండాడు. అందు లోంచి పాలు వచ్చాయి. అందరూ ఆశ్చర్యపోయారు.
మామిడి పండులోంచి పాలు రావడమేమిటని ?
అప్పుడు ధనికుడు తెచ్చిన తెచ్చిన పండును పిండాడు గురునానక్. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎర్రని నెత్తురు కారింది. ధనికుని నోట మాట రాలేదు.
ఓ ధనికుడా ! ఈ వడ్రంగిది కష్టార్జితం. రెక్కల కష్టంతో సంపాందించినది. అందుకే అది పాలతో సమానం. నువ్వు అవినీతితో, పేదలను పీడిస్తూ కూడబెట్టిన సొమ్ము నెత్తుటి కూడుతో సమానము. అందువల్లన మాలాంటి సాధువులు తినకూడదు.
భగవంతునికి, సాధువులకు కష్టార్జితమే సమర్పించాలి. ఎవరికి వారు కష్టార్జితం తింటేనే, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. అన్యాయార్జితం అనారోగ్యాన్నీ , అనేక కష్టాలను తెచ్చిపెడుతుంది.
అందుకే అత్యాశకు బానిసలు కాకండి. లభించిన దానితో తృప్తి పొందండి. తృప్తితోనే పరమానందం లభిస్తుంది.
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment