సౌభాగ్యదాయిని *అట్లతద్ది*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు , ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి , పూజా మందిరంలో పీఠమును పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత దేవికి అట్లు , ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ , ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ. ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు , సౌభాగ్యం కలకాలం నిలవడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది అట్లతద్దె జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం.
అట్లతద్దినాడు తెల్లవారు జామున పిల్లలు అన్నం , గోంగూర పచ్చడి , పెరుగుతో కడుపునిండా తింటారు. అట్లతద్దోయ్ ఆరట్లోయ్ , ముద్ద పప్పోయ్ మూడట్లోయ్ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలు మాత్రం పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు.
*అట్లతద్ది కథ*
అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు, మంత్రి కూతురు ,సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి , మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.
ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది. అమ్మా కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో’ అన్నాడు. రాజ కుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడషోపచారాలతో ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ వ్రతానికి ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని పేరు వచ్చింది. అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రత భంగం చేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాకుమారికి పెళ్లయింది.
కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు. ఆమె ఎంతో బాధపడింది. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది. పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. వారు ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు. అయితే మర్నాడు ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు చంద్రోదయ ఉమా వ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడయ్యాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్యంతో తులతూగుతారు.
అట్లతద్ది అంతరార్థం
త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం.
ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.
రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది.
ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు , పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి , ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు , 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని , శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం , 11 తాంబూలం వేసుకోవడం , 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.
సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలు సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా , పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు.
*అట్లతదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం*
!! చాంపేయ గౌరార్థ శరీరకాయై !! కర్పూర గౌరార్థ శరీరకాయ !!
!! ధమిల్ల కాయైచ జటాధరాయ !! నమశ్శివాయై చ నమశ్శివాయ !!
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment