*క్షమాగుణం*
🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
ఆలోచనలు లేని స్థితి. అంటే మనసును ఖాళీగా ఉంచుకోవటం. ఆ స్థితి పొందడం ఎంతో ప్రావీణ్యం సంపాదించుకుంటే కానీ వీలుపడదు.ఆ స్థితి పొందడం వల్ల కలిగే జ్ఞానం ప్రత్యేకమైనది.
నేర్చుకొని సంపాదించుకునే జ్ఞానం కన్నా,బుద్ధితో ఆలోచించగలిగే జ్ఞానం కంటే అది భిన్నమైనది, ప్రత్యేకమైనది. జీవితానికి ఉపయోగం లేని ఇతర జ్ఞాపకాలను ఆ జ్ఞానం తొలగించగలుగుతుంది. మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు తొలగిపోవడం కొంతవరకు అందరిలోనూ జరుగుతూనే ఉంటుంది.
ప్రత్యేకంగా తొలిసారి ధ్యానం చేసినపుడు ఇది జరుగుతుంది. ఇదివరకు ఉన్నట్టుగా కాకుండా, అంతరంగం ఖాళీ అయినట్టు గమనిస్తాం. ధ్యానం కొనసాగుతున్న కొద్దీ ఆ స్థితి మరింతగా పెరుగుతుంది. పాత సంస్కారాలన్నీ పోయి, ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తిగా మారుతూ ఉంటాం. ఇదే స్వచ్ఛమైన జ్ఞానమని నిపుణులైన సాధకులు చెప్తుంటారు.
🍁🍁🍁🍁🍁🍁 🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 🍁🍁 🍁🍁🍁🍁
ఒక గ్రామంలో ఓ చిరు వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకులు గ్రామానికి వచ్చిన ఓ సాధువు దగ్గర శిష్యులుగా చేరారు. వారు అతని బోధనల్లో మునిగిపోయి, అతను చెప్పిన పద్ధతులు ఆచరిస్తూ ప్రశాంతంగా ఉంటున్నారు.
తన కొడుకులు బాగా సంపాదించాలని వ్యాపారి కోరిక. వారిని ఎందుకూ పనికిరానివారిగా చేస్తున్నాడని వ్యాపారికి ఆ సాధువుపై కోపం పెరిగిపోయింది. ఓ రోజు కోపంతో ఆ సాధువు దగ్గరికి వెళ్లాడు. అతణ్ని ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అక్కడికి వెళ్లగానే కోపం మరింత పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడున్న పేడను తీసి అతని ముఖంపై విసిరాడు.
సాధువు ముఖమంతా పేడతో నిండిపోయింది. శిష్యులకు కోపం వచ్చింది. సాధువు మాత్రం చిరునవ్వు నవ్వాడు.
ఆ వ్యాపారి అక్కడ ఉండలేక గబగబా ఇంటికి వెళ్లిపోయాడు. అతని మనసు నిండా ఆలోచనలు. ముఖం మీద పేడ వేసినా చిరునవ్వుతో ఉన్న వ్యక్తిని జీవితంలో తను మొట్టమొదటిసారి చూశాడు. రాత్రంతా నిద్రపట్టలేదు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తప్పు చేశాననే భావన అతని మదిలో నిండిపోయింది.
మర్నాడు పొద్దున్నే వెళ్లి సాధువు పాదాలపై పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు తాను క్షమించలేనని చెప్పాడు.
అందరూ విస్తుపోయారు. ‘క్షమించవలసినంత తప్పు నువ్వేం చేయలేదు’అన్నాడు సాధువు.
కానీ వ్యాపారి పశ్చాత్తాపంతో తాను నిన్న వచ్చి అతని ముఖంపై పేడ వేసిన విషయాన్ని గుర్తుచేశాడు.
అప్పుడు సాధువు చిరునవ్వుతో ‘నిన్న ఆ పని చేసిన వ్యక్తి ఈ రోజున లేడు. అంటే ఆ గుణం ఈ రోజున నీలో లేదు. ఈ రోజు నువ్వు ఏ అపకారమూ చేయలేదు. కాబట్టి నిన్ను క్షమించ వలసిన అవసరం లేదు’ అన్నాడు. - అదీ క్షమాగుణం!
ఒక వ్యక్తిని మొదట తప్పు చేశావని నిరూపించి, తర్వాత క్షమించడం క్షమ అనిపించుకోదు. ఆ క్షమించిన విషయం సైతం ఆ వ్యక్తికి తెలియకుండా జరిగిపోవాలి. వారిలో తప్పు చేశామనే భావనే రాకూడదు. - అది సరైన క్షమ.
వారి తప్పును ఎత్తి చూపిస్తున్నావంటే వారిని ఇంకా క్షమించడం లేదని తెలుసుకోవాలి. తప్పు చేశామనే భావన పెద్ద శిక్ష. సాధనతో సంపాదించుకున్న జ్ఞానం ఈ భావన నుంచి తప్పించి జీవితాన్ని విశాల దృక్పథంతో చూసేలా చేస్తుంది. - అదే అసలైన జ్ఞానం.
అవతలి వ్యక్తుల తప్పులను ఎత్తిచూపడమే పనిగా పెట్టుకునేవారు లోకంలో కోకొల్లలు కనిపిస్తుంటారు. వారంతా ఒకసారి తమ తప్పులను గుర్తించగలిగితే, ఎదుటివారిని అర్థం చేసుకోగలుగుతారు.
అంటే, తప్పును సమర్థించాలని కాదు, తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలే కానీ, దాన్ని చేస్తున్న వ్యక్తిని తప్పుబట్టకూడదు.
పై కథలో సాధువు అనుసరించిన విధానం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అంతటి సహనశీలత ఉండకపోవచ్చు. కానీ, అభ్యాసంతో అన్నీ సాధ్యమే!
మన మనసు పారదర్శకంగా ఉంటే, అవతలి వ్యక్తి మనసూ అంతే పారదర్శకంగా కనిపిస్తుంది. మనలో మాలిన్యాలు ఉంటే, ఎదుటివారిలోనూ అవే కనిపిస్తాయి.
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment