Saturday, 14 October 2023

బామ్మా మాట - స్త్రీలను గౌరవించటం మన సంప్రదాయం (15-Oct-23, Enlightenment Story)

స్త్రీలను గౌరవించటం మన సంప్రదాయం

🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁

స్త్రీలను గౌరవించటం మన సంప్రదాయం. ఈ వాక్యాన్ని బస్సులలోనూ ఇతర ప్రదేశాలలోనూ చూస్తూ ఉంటాం. అలా చెప్పుకోవలసి రావటం ఎంత దురదృష్ట కరం? నిజానికి భారత దేశంలో ఆ  సంగతి చెప్పవలసిన అవసరం లేదు. రాకూడదు.  స్త్రీలను మాతృ భావంతో చూసి నమస్కరించటం అనాదిగా మన సంస్కృతిలో అంతర్భాగం. 

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

అని ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారు అని ఊరుకోకుండా స్త్రీలను గౌరవించని చోట చేసిన పనులన్నీ నిష్ఫలమౌతాయని కూడా నొక్కి వక్కాణించటం జరిగింది. శాస్త్ర వాక్యం పట్ల లక్ష్యం లేని వారికి కూడా స్త్రీలని గౌరవించటం ఎంత అవసరమో పురాణ కథల ద్వారా మన మహర్షులు తెలియ చేశారు.  మహిషాసురుడు తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరాడు. అది కుదరదు . వేటి వేటి వల్ల, ఎవరి ఎవరి వల్ల మరణం వద్దో అవి పేర్కొనమన్నాడు బ్రహ్మ. 

స్త్రీలు తప్ప మరెవరి వల్ల తనకు మరణం లేకుండా వరం అడిగాడు. ఎందుకంటే మిగిలిన అందరి వల్ల మరణం లేకుండా  బ్రహ్మ చేస్తే చాలట! స్త్రీల వల్ల తనకు భయం లేదట!  స్త్రీల పట్ల ఎంత చులకన భావం!! కనుకనే దేవతలందరు తమ తమ శక్తుల నన్నిటిని ఏకీకృతం చేయగా శ్రీదేవి ఆవిర్భవించింది. మహిషాసురుని మట్టుపెట్టింది.

శుంభ నిశుంభులు కూడా అంతే. సరస్వతిగా అవతరించి వారిని సంహరించింది. 

ఒక వ్యక్తి అని కాకుండా స్త్రీ అనే దృష్టితో తక్కువగా చూసిన వారందరు నశించినట్టు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఒక స్త్రీని(సీతను) మోసం చేసి ఎత్తుకు వెళ్ళిన కారణంగా రావణుడు బంధు మిత్రులతో , పరివారంతో పాటు నశించాడు. ఇష్టం లేదన్నా వినక రంభను విసిగించినందుకు రావణుడు శాపానికి గురి అయ్యాడు. 

ఒక స్త్రీని(ద్రౌపదిని) జుట్టు పట్టుకుని అవమానించిన కారణంగానే కౌరవ వంశం, అంటే, ధృత రాష్ట్రుని సంతతి  అంతా నశించింది. ఇష్టం లేని స్త్రీని బలవంతంగా కోరినందుకు కీచకుడు తమ్ములతో పాటుగా దుర్మరణం పాలయ్యాడు.

స్త్రీల నందరిని మాతృ సమానలుగా చూడటం మన సమాజంలో చిన్నతనం నుండి నేర్పిస్తారు. అందులో భాగమే ఆడువారందరినీ “అమ్మా!” అని పిలవటాన్ని అలవాటు చేయటం. అయితే దాని పట్ల దృష్టి పెట్టక పోవటం వల్ల, విదేశీ సంస్కృతి పట్ల ఉన్న మోజు వల్ల మన అలవాట్లు పాతవి, పనికి రానివి అనే అభిప్రాయం ఏర్పరచుకొని, అనుసరించక పోవటం వల్ల ఈ గొప్ప సంప్రదాయాన్ని గుర్తు చేసుకోవలసిన అవసరం కలిగింది.  రాముడు రావణుడు ఇద్దరు పరాక్రమ శాలురే అయినా ఒకరు నాయకుడు మరొకరు ప్రతి నాయకుడు అవటానికి వారికి స్త్రీల పట్ల ఉన్న అభిప్రాయమే కారణం. శ్రీ రామ చంద్రుడికి సీత తప్ప లోకంలోని స్త్రీ లందరు తల్లి వంటి వారు. రావణుడు తల్లిని తప్ప స్త్రీలందరను కామ దృష్టితో చూశాడు.

ప్రతినిత్యం పాదాలకి నమస్కరించటం వల్ల  సీతా దేవి కాళ్ళకు పెట్టుకునే నూపురాలను మాత్రమే గుర్తించగలనని లక్ష్మణుడు సుగ్రీవుడు తమకు దొరికిన ఆభరణాలను చూపినప్పుడు అంటాడు. నమస్కరించేది మాతృ భావంతోనే కదా1

ప్రహ్లాదుని సద్గుణాలని పేర్కొంటూ “ కన్ను దోయికి అన్య కాంత లడ్డంబైన మాతృ భావము చేసి మరలు వాడు” అంటాడు  పోతన. ఐదారు సంవత్సరాల వయసున్న వాడికి మరొక రకమైన భావం కలుగుతుందా? అని వంకర ప్రశ్నలు వేసిన కుహనా మేధావులు కూడా ఉన్నారు. వినగానే ఎవరికైనా నిజమే కదాని అనిపిస్తుంది. ఆలోచిస్తే కదా అందులోని అర్థం తెలిసేది?

స్త్రీలను కామ దృష్టితో చూడక పోయినా గౌరవ భావంతో ఎంత మంది చూస్తున్నారు? ఆడది అని చాలా చులకన చేసి మాట్లాడటం అందరికి అనుభవమే. తల్లి నయితే మనుషులైన వారు ఎవరూ అగౌరవ పరచరు కదా! లోకంలోని ఆడువారి నందరినీ తన తల్లితో సమానంగా భావించి గౌరవ భావంతో చూసాడన్న మాట ప్రహ్లాదుడు. అందులోనూ ప్రహ్లాదుడు పర ధన , స్త్రీ హరణం కాని, కుదరనప్పుడు అనుభవించటం కాని సహజ లక్షణమైన రాక్షస వంశంలో జన్మించిన వాడు. కనుక పర స్త్రీలను తల్లి వలె గౌరవించాడు అని ప్రత్యేకంగ చెప్ప వలసి వచ్చింది.

సన్న్యాసం స్వీకరించిన పీఠాధిపతులు కూడా స్త్రీలను గౌరవించే సంప్రదాయం సామాన్య ప్రజలకు తెలియ చేయటానికి ప్రతి రోజు తమ నిత్య పూజ పూర్తి అయిన తరువాత ఒక ముత్తైదువను పూజించి, నమస్కరించి కాని భిక్షను స్వీకరించరు. పెద్దలు చెప్పిన దానికన్న చేసిన దానిని చూసి నేర్చుకునేది ఎక్కువ కదా!


🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...