*అందమే ఆనందం*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
'మనం ఆనందంలో పుట్టాం... ఆనందంగానే ఉన్నాం' అంటాడు ఒక వేదాంతి. అందుకు సాక్ష్యంగా 'ఆకాశం బ్రహ్మ... ఆనందం బ్రహ్మ' అంటాడు. ప్రపంచంలో నూటికి తొంభైమంది అదేమిటో తెలియనట్లు కనిపిస్తారు. ఏదో పోగొట్టుకున్నవా రిలా, దేని కోసమో వెదుకుతున్నట్లుగా అనిపిస్తుంది. తల్లి ఒడిలోనో ఉయ్యాల్లోనో పడుకుని, కాళ్లు చేతులు ఊపుతూ ఆనందంగా కేరింతలు కొట్టే పిల్లల్ని చూసిన ప్పుడు మనం ఆనంద స్వరూపులమేనన్న ఎరుక కలుగుతుంది. పెరిగి పెద్ద అవుతున్నకొద్దీ ఆ ఆనందం తరిగిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ప్రశ్నకు సమాధానం మన లోపలే ఉంది.
సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ ఉత్తమమైనదంటారు. అయితే, అడుగడుగునా మనిషి ఆనందానికి దూరం అవుతుండటానికి కారణం అజ్ఞానం లేదా అవిద్య అంటారు. విజ్ఞులు. ఏ జీవికీ లేని ఆలోచనా శక్తి, వివేచనా జ్ఞానం ఉన్నప్పటికీ, అవి పని చేయకపోవడం వల్ల, బిడ్డను చంకలో పెట్టుకుని ఊరంతా గాలించే తల్లిలా చాలామంది తల్లడిల్లుతూ ఉంటారు. ఎక్కడ ఆనందం ఉన్నదో జాడ తెలి యక, వెతకకూడని చోట దాని కోసం వెతుకుతూ ఆయాసపడుతుంటారు.
ఆనందం ఒక అనుభూతి. అది పర మాత్మ స్వరూపం. వస్తు ప్రపంచంలో అది కనిపించదు. కనిపించే ప్రతి వస్తువూ నశిస్తుంది- బుద్ధుడు. మన ఇంద్రియాలు సాధా రణంగా బయటి ప్రపంచాన్నే పట్టు కుని వేలాడుతూ ఉంటాయి. చూపు అందాన్ని, వినికిడి సుస్వరాన్ని, నాసిక సువాసనను, నాలుక సురుచిని కోరతాయి. పువ్వు వాడిపోతుంది. రాగం ఆగిపో తుంది. సెంటు సువాసన కొంతసేపటికి మాయమవుతుంది. తినగ తినగ తీపి చేదవుతుంది. కాలాధీనమైన వస్తు ప్రపంచంలో అన్నీ తాత్కాలికమైనవే! వాటిపై ఆధారపడ్డ ఇంద్రియాలకు, ఆపై మనసుకు, నిలకడ కరవైపోతుంది. ఆవేదన, అన్వే షణ మళ్ళీ ప్రారంభం అవుతాయి. ఇంద్రియాలకు తాత్కాలికంగా కలిగే తృప్తిని సుఖం అని, మనసులో చెలరేగే ఉల్లాసాన్ని సంతోషం అని అంటారు. అంతకు మించిన ఆనందం కోసం మానవ హృదయం ప్రతి క్షణం తపిస్తూ ఉంటుంది.
ఆనందం కోసం బయట వెతకడం మాని, అంతరంగంలో అన్వేషించమంటారు అనుభవజ్ఞులు. బంధానికైనా, మోక్షానికైనా మననే కారణం అంటుంది గీత. గనిలో పనిమనిషిలా మనో దీపాన్ని వెలిగించుకుని, హృదయ మందిరాన్ని ప్రవే శిస్తే, సాగర మధనంలో అమృత భాండంలా, అంతరంగ మథనం ద్వారా మనం ఆనంద రసాన్ని ఆస్వాదించవచ్చు. మన లోపల ఉన్న ఒక అద్భుత ప్రపంచాన్ని 'లో చూపు'తో అందుకోవచ్చు.
ఆనందం తరగని ధనం. అమృతంలాగా అంతం లేనిది. 'ఆనందామృతం' అన్న పదబంధమే అందుకు ప్రబల నిదర్శనం. మానసిక స్థితి శీతోష్ణ పరిస్థితుల పైన ఆధారపడినంత కాలం, ఆనందం అందని ద్రాక్షపండే! ధ్యాననిష్ఠలో మనసును నియంత్రించి, ఏకాగ్రబుద్ధితో ఆనంద స్వరూపాన్ని, నాదబిందు కళారూపాన్ని ఆరాధించే యోగికి ఆనందం కరతలామలకం అవుతుంది.
ఆ బ్రహ్మాది దేవతలకు అందని దివ్యానుభూతిని ధ్యానయోగంలో సంపాదించు కోవాలి. అందుకు సాధనకు మించిన రాజమార్గం కనిపించదు. తరగని అందం సాక్షాత్కరించినప్పుడు కరిగిపోని ఆనందం వరిస్తుంది. హృదయారవిందంలో అన వరతం రసీభవించే ఆనంద రసస్వరూపుడు ఆ భగవంతుడొక్కడే. అదే అందం! దాని అనుబంధమే ఆనందం! అందుకే 'అందమే ఆనందం' అన్నాడు కవి.
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
Excellent sir.
ReplyDelete