చెట్టులా బతకాలి
🌺🍀🌺🍀🌺🍀🌺
పాలసముద్రం చిలికితే లక్ష్మితోపాటు కల్పవృక్షం ఉద్భవించిన కథ అందరికీ తెలిసిందే. గోవులకు తల్లి కామధేనువులాగానే, చెట్లకు జనని కల్పవృక్షం కావచ్చు. సృష్టిలో మనిషికంటే ముందే చెట్లు ఉన్నాయంటారు శాస్త్రవేత్తలు. భారతదేశంలో వైద్యానికి పనికిరాని మొక్క గాని, చెట్టుకాని లేవని ఆచార్య నాగార్జునుడు రుజువు చేశాడంటారు. మనం చెట్లను దైవాలుగా పూజిస్తాం.
మరికొన్ని దేశాల్లోనూ ఈ ఆచారం ఉంది. కొబ్బరి చెట్టును కల్పవృక్షంతో పోలుస్తారు. ఆ చెట్టులో పనికిరానిదంటూ ఉండదు. రైతుకు ఎన్ని కొబ్బరి చెట్లు ఉంటే అంత సంపన్నుడు. భూమాతకు చెట్లు శ్వాసకోశాలు. ఇలాంటి చెట్లను విచక్షణా రహితంగా నరికి పారేస్తున్నారు. మంగళకరమైన పచ్చదనాన్ని పరిహరించి మరుభూములుగా మార్చుకుంటున్నాం.
ఒకప్పుడు ఇంటింటా వేప, మామిడి వంటి వృక్షాలు ఉండేవి. విశాలమైన ఆవరణలు కనిపించేవి. ఇప్పుడు మనసుల మాదిరే ఇళ్లూ ఇరుకైపోయాయి. కొందరి ఇళ్లలో తులసి మొక్క కూడా కనిపించడం లేదు. తులసి దేవతాంశ కలిగిన ఔషధంగా చెబుతారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు తులసి సంజీవని లాంటిది. సత్వరం ఉపశమనం కలిగిస్తుంది.
దేవతా వృక్షాలు, ఔషధశక్తి గల మొక్కలు భగవంతుడు భారతదేశానికి ప్రసాదించిన వరాలు.లక్ష్మణుడి ప్రాణరక్షణ చేసిన సంజీవని మన దేశ అద్భుతం. సృష్టి రహస్యాన్నంతా తనలోనే దాచుకున్నట్టు చిన్న విత్తనం విచ్చుకుని మౌనంగా మహావృక్షమై సేవలకు సిద్ధమైపోతుంది. పక్షులకు, పాంధులకు స్వాగతం పలుకుతుంది.
ప్రాణుల్లో ఉత్తమ ప్రాణిగా జన్మించిన మనిషి దైవం తరవాత దైవం అంతటివాడు. ఆపదల్లో ఆదుకొనేవాడే దైవం. కాని, బ్రహ్మవంశంలో పుట్టిన రావణుడు లోక కంటకుడైన రాక్షసుడు అయినట్లు, సృష్టి రక్షకుడిగా ఉంటాడని భగవంతుడు భావించిన మనిషి విధ్వంసకుడిగా మారిపోయాడు. విశాల దృక్పథంతో మామిడి చెట్టులా విస్తరించాల్సిన మానవత్వం, స్వార్థంతో కొమ్మలు లేని తాడిచెట్టులా ఎదిగింది. ఇదే మనస్తత్వాన్ని వారసత్వం అందిపుచ్చుకొంటోంది.
మనిషితనం నేతి బీరకాయలో నెయ్యి అవుతోంది. ప్రపంచానికి చెట్టుకు మించిన గురువు లేడు. మౌనంగా ఎదగడమే కాదు, జీవిత పర్యంతం వివిధ సేవలందించి, అది మౌనంగానే తనువు చాలిస్తుంది. చెట్టు మరణించినా, బూడిదయ్యే వరకు మనిషికి ఉపయోగపడుతూనే ఉంటుంది. చెట్టుకు ప్రాణమే కాదు- మనసు కూడా ఉంటుంది. మనసుతో వినగలిగితే వృక్ష విలాపాలు మనల్ని దుఃఖ వివశుల్ని చేస్తాయి. చెట్టు జీవితమే గొప్ప సందేశం. ఆదర్శానికి చెట్టు మారుపేరు. అది అర్థం చేసుకోగలిగితే, మనిషి చెట్టులా బతకడానికి ఇష్టపడతాడు.
ఒక మనిషి సమాజం కానట్టే, ఒక చెట్టు వనం కాలేదు. వనసీమలు శాంతి నిలయాలు. తపోభూములకు వనాలు ఆలవాలాలు. సృష్టిలోని అందాలకు అడవులు నెలవులు. అదొక ప్రత్యేక ప్రపంచం. చిత్ర విచిత్రాలైన జీవరాసులుంటాయి. ఎలాంటి అపకారం చెయ్యకుండా చూసి ఆనందించాలి తప్ప, వాటి ప్రశాంత జీవితానికి భంగం కలిగించకూడదు.
ఒక చెట్టు నరికితే ఎన్నో పక్షులు అనాథలవుతాయి. ఒక అడవి నరికేస్తే ఎన్నో ప్రాణులు ఆధారం కోల్పోతాయి. కుటుంబ పెద్ద మరణిస్తే ఎలాగో, ఒక మహావృక్షాన్ని నేల కూల్చినా అంతే. చెట్లు ప్రాణవాయువునిచ్చే దేవతలు.
ఏ చెట్టూ తన ఫలాలను తాను తినదు. ఉపకార బుద్ధితోనే జీవిస్తుంది. అలాగే మరణిస్తుంది. మనిషి చెట్టును చూసి బతుకును బాగుచేసుకోవాలి. పరోపకార బుద్ధిని అలవరచుకోవాలి. అప్పుడు ఆ మనిషి మరణించినా స్మృతి వనంలో గంధపు చెట్టుగా చిరకాలం ఉండిపోతాడు!
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment