Friday, 5 April 2024

ఈ భూమ్మీదకు ఏమీలేకుండా వచ్చాం (06-Apr-24, Enlightenment Story)

ఈ భూమ్మీదకు ఏమీ లేకుండా వచ్చాం

🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 

ఈ భూమ్మీదకు ఏమీ లేకుండా వచ్చాం. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళేదీ లేదు. మహాత్ములు జీవితానుభవ సారంగా మనకు అందించిన వేదోక్తులివి. వీటి గురించి తెలుసుకుందాం.

ఒక్కోసారి మన ముందున్న వ్యక్తికి మంచో, చెడో చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. గతాన్ని నెమరేసుకుని అతడు మన పట్ల ప్రదర్శించిన వైఖరిని, సంభాషణ తీరును బేరీజు వేసుకుని ఉపకారమో, అపకారమో చేయడానికి ఉపక్రమిస్తాం.


ఆత్మరక్షణార్థం శరణు కోరిన, అవసరార్థం చేయిజాపిన శత్రువుకైనా సహాయం చేయాలన్నది పెద్దల మాట. ఎదుటి వ్యక్తిలోని గుణగణాలు ఎంచకుండా సహాయం చేసేవాడే నేర్పరి అంటాడు సుమతీ శతకకారుడు. నేర్పరి అంటే లౌక్యం తెలిసినవాడు. మంచివాళ్లకు సహాయం చేస్తే మంచితనం వృద్ధి చెందుతుంది. చెడ్డవాళ్లకు మంచి చేస్తే మనసు మారి మంచివైపు తిరిగే అవకాశం మెండుగా ఉంటుంది. ఆపన్నహస్తం అందించిన వ్యక్తికి, అతడి వల్ల సహాయం పొందిన వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉంటాడు. సమాజంలో బతకడానికి కావలసింది అదే కదా. ఇచ్చిపుచ్చుకోవడమే సంఘ జీవనానికి ఆలంబన. అందుకే సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకునేవాడు నేర్పరి.

శూర్పణఖ చెప్పిన మాటలు వినడం వల్ల రావణబ్రహ్మ బుద్ధి పెడదారి పట్టి మహాసాధ్వి సీతను చెరపట్టాడు. యుద్ధంలో తోడపుట్టినవారిని, తనకు జన్మించినవారిని, లంకను కోల్పోయి చివరికి తానూ మట్టి కరిచాడు. రాజ్యకాంక్షతో దుర్యోధనుడు మామతో కలిసి పాండవులను మాయాజూదంతో ఓడించి అడవులకు పంపాడు. పాండవులకు కనీసం అయిదూళ్లు ఇచ్చినా చాలని నెరపిన రాయబారాన్ని సైతం తృణీకరించాడు. కురుక్షేత్ర మహాయుద్ధం దాకా తరలి వెళ్ళి కౌరవుల మరణానికి కారకు డయ్యాడు. వీరెవ్వరికీ మంచి రుచించలేదు. అధర్మం వినాశన హేతువవుతుందని విజ్ఞులు హెచ్చరించినా మనసుకు పట్టలేదు. సర్వం కోల్పోయి, పురాణాల్లో అధర్మ పరులుగా ముద్రపడ్డారు.

అనుభవజ్ఞుల మాట వినకుండా మనసు లోలకం చెడువైపు వాలితే రామాయణ, మహాభారతాల్లోని యుద్ధ ఘట్టాలు పునరావృ తమవుతాయి. కోలుకోలేని లోటును కలిగిస్తాయి. అయినదానికి కానిదానికి ఉచిత సలహాలిచ్చేవాళ్లు మన చుట్టూ ఉంటారు. వినడం తప్పు కాదు, విన్న వెంటనే పర్యవసానం ఆలోచించకుండా కార్యాచరణకు పూనుకొనే వేగిరపాటు ఉండకూడదంటారు పెద్దలు. ఆలోచనల్లో సమయం వృథా అయినా ఫరవాలేదు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకోవాలి. మన వల్ల లేశ మాత్రం తప్పు జరిగినా, మన వ్యక్తిత్వం మీద మచ్చ పడుతుందన్న జాగరూకతతో ఉండాలి. చెడు అనకపోవడం, వినకపోవడం, చూడకపోవడం... సాధువు లక్షణాలు కాదు, మనిషికి ఉండాల్సిన నైతిక గుణాలు.

కొందరు తమకు కష్టం కలగకపోయినా, నష్టం జరగకపోయినా మంచి చేయడానికి ముందుకురారు. మరికొందరు తాము కొవ్వొత్తిలా కరిగిపోతూ మానవీయ స్పందనలతో ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతారు. కలలోనైనా చీమకు సైతం అపకారం తలపెట్టడానికి జంకుతారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పాటును అందించేవారు ఉంటారు. సమాజమే తనవాళ్లుగా సేవాభావ దృక్పథంతో జీవనయానం సాగించేవాళ్లుంటారు.

జనంలోంచి పుట్టుకొచ్చే నాయకులు పరోపకార చింతనతో, ఉదారబుద్ధితో, సతతం సామాజిక సేవచేయాలన్న తపనతో బాధ్యత నిర్వహించాలి. విస్తృత పరిధిలో సేవచేసే భాగ్యం దక్కడం వరం. మన దగ్గర ఉన్నది ఇవ్వడానికి తర్కవితర్కాలు, అస్మదీయ భేదాల అవసరం లేదు.

ఈ భూమ్మీదకు ఏమీ లేకుండా వచ్చాం. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళేదీ లేదు. మహాత్ములు జీవితానుభవ సారంగా మనకు అందించిన వేదోక్తులివి. తామరాకు మీద నీటిబొట్టులా మెలగితే మనకు అవసరం లేనిది, ఎక్కువైనది అలవోకగా, తారతమ్యాలు చూడకుండా ఇతరుల అవసరాలకు ఇవ్వగలం.  చేతనైనంత మంచి చేయగలిగితే చాలు- మానవజన్మకు సార్ధకత లభిస్తుంది.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...