జ్ఞానంవల్లనే దుఃఖనాశనం -2
🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺
మరి అజ్ఞాన మెట్టిది అంటే- విషయముల యధార్థాన్ని గ్రహించుటే జ్ఞానం. కనపడుతున్న జగత్తును గ్రహించుటకు సైన్సుకూడా పరిశ్రమచేస్తున్నది. ఫిజిక్స్, కెమిస్ట్రీ యీ మొదలైన శాస్త్రములందు పరిశోధనలు చేసే సైంటిస్టు జ్ఞానతృష్ణలో మునిగి తనకష్టాలను మరచిపోతాడు. సంగీతరసమందు మునిగినవారు కూడా తమ కష్టాలను మరచి పోతారు. అయితే, ఈ మరపు తాత్కాలికమే కాబట్టి దుఃఖాన్ని చప్పగా తుడిచిపెట్టదు, అట్టి దుఃఖనాశనం పరమార్థజ్ఞానం వల్లనే కలుగుతుంది.
కష్టాలు కాపురముండవు, ఈనాటి దుఃఖాలు ఇంకోనాటికి గణనకురావు, కాలమే అన్నిదుఃఖాలనుమాన్పుతుంది. జ్ఞానియైనవాడు నేటి కష్టాలను, మరి ముప్పదేండ్లు ముందుకు వెళ్లి చూచి నవ్వుకుంటాడు. అలా చూచినపుడు దుఃఖములంతగా బాధించవు. జ్ఞానులది తస్థదృష్టి తమబాధ లింకెవరివో, ఎచటివారివో అన్నట్లు దేశకాలాలకు దవ్వుగా నిలచి వారు చూస్తారు.ఆర్తసేవనం చేసేవారు ఆర్తులపట్ల కేవలం ఉపకార బుద్దితో చేస్తారను కోగూడదు. ఆర్తసేవయందు ఉపకార పరత్వం లేకపోలేదుగాని, నిజానికది సేవావ్రతులకు చిత్తశుద్దిని ప్రసాదిస్తుంది. ఉపకారం పొందినవారికి సంతుష్టి ఉండకపోగా, ఉపకరించినవారిపట్ల కృతజ్ఞతకూడా ఉండదు. నేను చేసినమేలు మరచిపోయినాడే వీడని నువ్వు ఆగ్రహం చెందగూడదు. వాని కృతఘ్నతయే నీ సంకల్పశుద్ధికి సాక్ష్యమని సంతోషించు. పరోపకారమనేది విడంబంకోసం, కీర్తికోసంకాదు. నీవుచేసిన మేలువల్ల ఎదుటివాని కేమిలాభం కలిగిందా అనే విచారణకు పోక, దానివలన నీ శీలమునకు, నీ ఆత్మకు కలిగిన లాభాన్ని తలచుకొని సంతుష్టి హించాలి.
సత్కర్మాచరణంవల్ల, మనశ్శరీరాల నదుపులో ఉంచు కొనుటవల్ల ఇటువంటి జ్ఞానం చేకూరుతుంది. నియమపూర్వకమైన ఈ సదాచరణం ఈశ్వరభక్తికి దారిచూపుతుంది. సకల భూతములందు భక్తుడీశ్వరునే దర్శిస్తాడు. భూతజాలమంతా అతనికీశ్వరుడే. ఈశ్వరుని సేవించినట్లే అతడు జీవకోటిని సేవిస్తాడు. అదే నిజమైన పరోపకారమంటే. పరోపకారనిరతి జ్ఞానానికి సాధనము, ఫలము కూడా అవుతుంది. దేవాలయము నకు గోపురాన్ని కట్టించినవాని మనస్సు ఆ గోపురమంత ఉన్నతము, విశాలము అవుతుంది. పరోపకారబుద్ధి లోకమంతట విస్తరించి, లోకాన్ని తనలో ఇముడ్చుకొంటుంది. విశ్వమంతటిని పరోపకారి తన కౌగిటిలోకితీసుకొని జగత్కుటుంబి అవుతాడు.
జ్ఞానుల సాంగత్యముగూడా జ్ఞానహేతు వవుతుంది. జ్ఞానులతో కలిసివుంటూ, వారు చేసే మంచిపనులుచూస్తూ, వాటిని గూర్చి చింతిస్తూవుంటే మనకుగూడా దయాధర్మమలు లలవడుతవి. మహాపురుషులసాన్నిధ్యము వేలకొలది ప్రజలను పరిశుద్ధులను చేసి ఉద్ధరిస్తుంది. అట్టి మహానీయులు సర్వమతము లందు, సకలదేశములందు. అపుడపుడు అవతరిస్తూఉంటారు. అట్టివారి ఉపదేశములన్నిటికీ సారమొక్కటే అయినా, తదనుయాయులు అభినివేశం కొద్దీ వాటిని మారుస్తారు. వాటికి మరికొన్నిటిని చేరుస్తారు. ధర్మసమయములుగా వాటిని కరుడు గట్టిస్తారు. వీరివల్లనే మానవజాతికి ఏకత్వంకరువైపోయి. భేదములు తలఎత్తుతూవుంటవి. మతకర్తలగు పూర్వాచార్యులు మళ్ళా అవతరిస్తారనుకోండి వారందరు కలియబలికికొంటారనుకోండి. వారందరు బోధించిన సత్యమెక్కటే కనుకవారికి భేదభావమే పొడసూపదు.
సశేషం పార్ట్ -3 రేపటి కథలో
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment