మానవ జన్మ ఎందుకు
🔥🌹🔥🌹🔥🌹🔥🌹
మంత్రానికి పనికిరాని అక్షరమే ఉండదు. ఏ ఏ అక్షరాన్ని ఏవిధంగా ఉచ్చరించాలో, ఏ స్థలంలో ఉపయోగించాలో, ఆవిధంగా ఉపయోగించి, దాన్ని మంత్రంగా ప్రయోగించడం అనేది మంత్రశాస్త్ర పరిభాష తెలిసినవారికి మాత్రమే సాధ్యమౌతుంది. మందుకు పనికిరాని మూలికలనేవి ఉండవు. మూల మంటే వేరు, ఔషధమంటే మందు. ఏయే చెట్టు వేర్లు, మూలికలు ఉపయోగిస్తే, ఏ రోగానికి మందుగా ఉపయోగించవచ్చు, అనేది ఆయుర్వేద వైద్య రంగంలో నిష్ణాతులైన వారికి మాత్రమే తెలిసిన మర్మం. అయోగ్యులంటే అప్రయోజకులు. దేనికీ పనికిరాని వారు, అసలీ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. భగవంతుని సృష్టిలో దేని ప్రయోజనం దానికి ఉంటుంది.
పిపీలికాది పర్యంతం అంటే చీమ మొదలుకొని ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రయోజనం తోనే సృష్టించబడింది. భగవంతుడి మాయ మనకు అవగాహన కావడమనేది చాల కష్టం. సృష్టిలో పనికిరాని మనిషి ఉన్నాడా అంటే ఉండడు, అందరూ ఏదో ఒక విధంగా పనికివస్తారు.
యోజగః తత్ర దుర్లభః !!
యోజగః = చక్కగా ఆలోచించ గలిగినవాడు, దుర్లభః = అరుదు. అంటే దేనిని ఏ విధంగా ఉపయోగిస్తే అది ప్రయోజనకారిగా ఉంటుందని, చక్కగా యోచించి, ప్రయత్నం చేసి, ఆచరించ గలిగె వారే ఈ సృష్టిలో చాలా అరుదని దీని అర్థం.
“జీవులేనుబది నాల్గు లక్షల చావు పుట్టుక లిక్కడా ఎవరు చేసిన కర్మము వారనుభవించే దక్కడా”
అని చాటుతుందొక తత్త్వగేయం. ఈ సృష్టిలో జీవరాశులు 84 లక్షల రకాలు. ఇన్ని ప్రాణుల లోను మానవుడనే ప్రాణి ఉన్నతమైన వాడు, విశిష్టమైన వాడు. కారణం, కన్ను, ముక్కు, చెవి వంటి పంచేంద్రియములతో పాటు, జ్ఞానమనే ఆరవ ఇంద్రియంద్రియములతో విశిష్టమైంది. ఇతర ప్రాణుల నుండి మనిషిని వేరుచేసేది విచక్షణాజ్ఞానం.
ఏది మంచి, ఏది చెడు, ఏది పాపం, ఏది పుణ్యం. ఏది అక్రమం, ఏది సక్రమం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విచక్షణాజ్ఞానం కలవాడు మానవుడు. ఏది ధర్మం..? ఏది అధర్మం..? అని మనం ప్రశ్నించు కొంటే మహాభారతంలో దీనికి సరైన సమాధానం లభిస్తుంది.
“ఒరు లేయవి యొనరించిన నరవర! యప్రియము తన మనంబునకగు నొరులకు నవి సేయకునికయ పరాయణము ధర్మపథముల కెల్లన్”
ఇతరులు, ఎదుటి వారు ఏ పనిని చేసిన యెడల నీ మనస్సుకు అప్రియము, అంతే కష్టం కలుగునో, ఆ పనిని నీవు ఇతరుల యెడ చేయవలదు. అంటే ఇతరులకు కష్టం కలిగించే ఏ పనీ నీవు చేయవద్దు. ఇదే అన్ని ధర్మాల కంటే పరమధర్మము. నీ కర్తవ్యమును నీవు నిర్వర్తిస్తూ, అందరికి ప్రయోజనకరమైన పనులు, నిస్వార్థమైన సేవలు చేస్తూ జీవించిన యెడల మానవజన్మ సార్థకమగును.
🙏ఓం నమో నారాయణాయ🙏
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment