Wednesday, 22 February 2023

హిమాలయ పర్వత శిఖరాల (23-Feb-23,Enlightenment Story)

*మహాభారతంలోని శాంతిపర్వం నుండి*

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🙏🌷🌷🙏🌷🌷🙏

హిమాలయ పర్వత శిఖరాల మీద ఒక బూరుగు చెట్టు ఉండేది. విశాలమైన శాఖలతో, విస్తారమైన కాండంతో ఆ బూరుగు చెట్టు తన తెల్లటి దూదితో మరో మంచుకొండను తలపిస్తూ ఉండేది. ఒక రోజు అటువైపుగా వెళ్తున్న నారదుని దృష్టి ఆ బూరుగు చెట్టు మీద పడనే పడింది.

వేల అడుగుల ఎత్తున ఇంతటి మహావృక్షం మనుగడ సాగించడం సాధ్యమేనా!’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బూరుగు చెంతకు వెళ్లి..నువ్వు అల్లంత ఎత్తున ఇంతగా విస్తరించి ఉన్నావు కదా! మరి నీకు ఏనాడూ ఆ వాయుదేవుని వల్ల నష్టం వాటిల్లలేదా? ఆయన తన పవనాలతో నిన్ను విరిచేందుకు ప్రయత్నించలేదా! నీకూ వాయుదేవునికీ మధ్య ఏమన్నా బాంధవ్యం ఉందా ఏం?’’ అని అడిగాడు నారదుడు.

నారదుని మాటలతో బూరుగు చెట్టుకి పౌరుషం పొడుచుకువచ్చింది- ‘‘వాయుదేవుని స్నేహంతోనో, అతని దయాదాక్షిణ్యాలతోనో నేను మనుగడ సాగించడం లేదు. నన్ను కూల్చేంత సామర్థ్యం వాయుదేవునికి లేనే లేదు. నా బలంతో పోలిస్తే ఆయన బలం ఒక మూలకు కూడా సరిపోలదు,’’ అంటూ పరుషమైన మాటలెన్నో పలికింది.

బూరుగు చెట్టు మాటలను వినగానే కలహభోజనుడైన నారదునికి, మరో కథ నడిపేందుకు అవకాశం చిక్కింది. ‘‘నువ్వు ఇలా మాట్లాడటం సబబుగా లేదు! ఆ వాయుదేవుడు తల్చుకుంటే కొండలనైనా కదిలించేయగలడు. మరి నువ్వు ఇన్నేసి మాటలు అన్న విషయం తెలిస్తే ఆయన నీకు కీడు చేయక మానడు,’’ అంటూనే బూరుగు చెట్టు గర్వంతో వదరిన మాటలన్నింటినీ పూసగుచ్చినట్లుగా వాయుదేవునికి చేరవేశాడు.

బూరుగు చెట్టు తనని కించపరచడాన్ని వాయుదేవుడు సహించలేకపోయాడు. వెంటనే ఆగమేఘాల మీద బూరుగుని చేరుకుని ‘‘ఒకనాడు బ్రహ్మదేవుడు నీ చెంత సేదతీరాడన్న కారణంగా, ఇన్నాళ్లూ దయతలచి నీ జోలికి రాలేదు. నేను చూపిన కరుణ నీలో కృతజ్ఞతను కలిగించకపోగా, గర్వాన్ని రగిలించింది. రేపు ఈపాటికి నిన్ను ఏం చేస్తానో చూడు!’’ అంటూ విసురుగా వెళ్లిపోయాడు.

వాయుదేవుని మాటలకు బూరుగు నిలువెల్లా వణికిపోయింది. ‘ఇప్పటివరకూ తనకు ఎదురులేదన్న పొగరుతో అనకూడని మాటలన్నీ అనేసింది. వాయుదేవునితోనే వైరం తెచ్చుకుంది. నారదుడు చెప్పినట్లు వాయుదేవుడు తల్చుకుంటే కొండలు కూడా కదిలిపోయే మాట వాస్తవమే! అలాంటి తాను మాత్రం ఆ ప్రభంజనుడికి ఎదురొడ్డి ఎలా నిలబడగలదు. ఇప్పుడేం చేయడం!’- ఇలా పరిపరి విధాలా ఆలోచించిన బూరుగు చివరికి ఓ నిశ్చయానికి వచ్చింది. వాయుదేవుడు తనకు నష్టం కలిగించే లోపుగా తానే తన కొమ్మలనీ విరిచేసుకుంది, రెమ్మలన్నింటినీ తుంచేసుకుంది, పూలన్నింటినీ రాల్చేసింది. చిట్టచివరికి ఒక మోడుగా మారింది. ‘ఇప్పుడిక వాయుదేవుడు నష్టపరిచేందుకు నా వద్ద ఏమీ మిగల్లేదు’ అన్న నమ్మకంతో పవనుడి రాక కోసం ఎదురుచూసింది.

మర్నాడు వాయుదేవుడు రానేవచ్చాడు. మోడులా నిలిచిన బూరుగుని చూసి జాలిపడ్డాడు. ‘‘నేను విధించాలనుకున్న శిక్షను నువ్వే స్వయంగా అమలుచేసుకున్నావు. ఇక మీదనైనా అహంకారాన్ని వీడి నమ్రతతో జీవనాన్ని సాగించు!’’ అంటూ సాగిపోయాడు.

పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా, తన పరిమితుల గురించి ఆలోచించకుండా ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియచేస్తోంది. గర్వం ఎప్పటికీ పనికిరాదనే నీతిని పదే పదే వినిపిస్తోంది.

🙏 సర్వేజనా సృజనో భవంతు 🙏🌷🙏🌷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🌷🙏🌷🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...