Monday, 13 February 2023

అనుష్ఠానం (14-Feb-23,Enlightenment Story)

🌞అనుష్ఠానం - తోటివారిని సంతోష పెట్టేదో, సాటివారి కన్నీరు తుడిచేదో, ఏదైనా అనుష్ఠానమే!🌞

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

నేను ఎప్పుడు అనుష్ఠానానికి కూచున్నా సరిగ్గా టాయిలెట్స్ కడిగే అమ్మాయి అప్పుడే వస్తుంది. మనిషి బక్కపలచగా నీరసంగా ఉంటుంది. జక్కంపూడి నుంచి రానూ, పోనూ 50/-ఇచ్చి ఆటోలో వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మంగళ, శుక్రవారాల్లోనే వస్తుంది. మొదట్లొ కొంచెం విసుక్కున్న మాట నిజమే! కానీ, ఆ అమ్మాయికి ఆకలి, అరడజను ఆడపిల్లల ఆలనా, పాలనా తప్ప మన సెంటిమెంట్ పట్టదు అని గ్రహించా. నాలాంటి వారు నలుగురు పని చెబితేనే ఆరోజు గడుస్తుంది ఆ ఇంటిల్లిపాదికి. ఆటో చార్జీలు, దాన్లో మళ్ళీ ఆసిడ్ బాటిల్, ఫినాయిల్ కి పెట్టుబడి పోగా, మిగిలే యాభయ్యో, వందో రూపాయల కోసం మనం అసహ్యించుకునే పనిని ఆప్యాయంగా చేస్తుంది. అటువంటి అమ్మాయిని ఇవ్వాళ శుక్రవారం, పైగా పూజ మధ్యలో ఉన్నా, రేపురా అని ఎలా అనగలను? అలా అంటూ...."అన్తశ్చరతి, భూతేషు, గుహాయామ్, విశ్వమూర్తిషు" అంటూ మననం చేస్తుంటే పూజిస్తున్న దేవుడు తెల్లబోడూ? ‘చదువుతున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి?’  అని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోను?  అందుకే పూజ ఆపి, ఆ అమ్మాయి పని అయి, పంపాకే శేషానుష్ఠానాన్ని సాగిస్తున్నా. ఇక్కడే నాకు సందేహం వచ్చింది! అసలు "అనుష్ఠానం" అంటే ఏమిటని! అనుష్ఠానం ఒక పవిత్రమైన పదం.

పదం ఎంత గంభీరమో, దాని అర్ధం కూడా అంతే గూఢం. భగవంతుడికి సంబంధించిన పదం కాబట్టి దీని అర్ధం విలక్షణంగానూ, విస్తృతంగానూ, ఉంటుంది. "ఫలానాలా చేస్తేనే అనుష్ఠానం" అని గిరి గీసి చెప్పటానికి లేకుండా "గిరి" అంత ఉన్నతమైన విలువ కలది. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతునిలానే అనిర్వచనీయం. సమాజ హితంకోసం ఏకాగ్రతతో చేసే అనుష్ఠానం, ధ్యానం లేదా తపస్సు, ఒక దృఢమైన సంకల్పశక్తిగా లోకకల్యాణానికి ఎలా మారుతుందో…. మహానుభావుల చరిత్ర చూస్తే తెలుస్తుంది. మరి మనం అలా చెయ్యాలంటే అంత మానసిక, శారీరక, తుష్టి, పుష్టి మనకి ఉందా? అంత ఏకాగ్రత మనం సంపాదించుకోగలమా? 

ఒక ఆహ్లాదమైన అనుష్ఠానాన్ని చెబుతా. ఆ మధ్య హంసల దీవికి వెళ్ళా. నాకు తెలుసు అక్కడ బెస్తవారి పిల్లలు ఉంటారు. వాళ్ళకి చేపలు, సముద్రం, తప్ప వేరే లోకం తెలియదు. కార్లు, బైకులు వేసుకొచ్చి సముద్రంలో దిగి ఆటలాడుతూ, తింటూ, తాగుతూ ఉండే మనుష్యులని ఆశ్చర్యంగా, ఆశగా చూస్తూ దూరంగా ఉంటారు. నేను వారికి సర్ ప్రైజ్ ఇద్దామని "కొన్ని వేఫర్లు..కొన్ని మిల్క్ డైరీ చాకలెట్స్ తీసుకెళ్లి పిలిచా" అవి చూపిస్తూ. ముందు రామంటూ అడ్డంగా తల ఊపుతూ పారిపోయారు. తర్వాత దూరంగా నన్ను చూస్తూ నిలబడ్డారు. ఒకళ్లిద్దరు గుడిసెలో దూరి వాళ్ళమ్మకి చెప్పినట్లున్నారు. ఆవిడ తల బైటపెట్టి నన్ను చూసి ఏమనుకుందో ఏమో!! వాళ్ళకి ఏదో చెప్పింది. అప్పుడు వాళ్ళు భయం భయంగానే  నాదగ్గరకి వచ్చారు. అప్పుడు నేను చాకలెట్స్ ఇస్తూ వాళ్ళ వివరాలు కనుక్కుంటూ కబుర్లు చెప్పా. ఆ వేఫర్స్, చాకలెట్స్, వాళ్ళు ఎప్పుడూ తినలేదట! ఎవరూ ఇవ్వలేదట!! అసలు వాళ్ళని చేరదీసి ఇలా పలకరించింది లేదనే  చెప్పారు. మాటల్లో సముద్రం గురించి ఎన్ని విషయాలు చెప్పారో?? ఆశ్చర్యం వేసింది. అలలు, వారి వలలు, చేపలు, తెరచాపలూ, బోటులు, కడలి అటు పోటులూ.... ఇలా మా మధ్య స్నేహం కుదిరిన ఆ గంట అలా అలలా జారిపోయింది. నా హృదయం అల జారిన మెత్తని ఇసుకగా మారిపోయింది. కొందరు ఆ చాక్ లెట్స్ కాగితాలు దాచుకున్నారు జేబుల్లో. ఆడపిల్లలయితే నెమ్మదిగా తింటూనే ఉన్నారు.

చెలియల కట్ట దాటిన  ఆ చిన్నారుల స్వచ్ఛ దరహాస తరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పరుగున వెళ్లి వాళ్ళు దాచుకున్న గవ్వలూ, ఆల్చిప్పలు, నత్తగుల్లలు, ఇత్యాదివి పోటీపడి చూపించారు. "అచ్చంగా నన్ను తీసుకోమని" ఒకరిద్దరు కోరారు కూడా. నాకు ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆ "శైశవ తపన" చూస్తే ఎంత ముచ్చటేసిందో!!

నేనిచ్చిన చిన్న కానుక్కే వాళ్ళ మొహాలు లైట్ హౌస్ లా మారి వింతకాంతి పుంజం విరబూసి జీవితం పట్ల నాకున్న దృక్కోణానికి దిశానిర్దేశం చేసాయా? అనిపించింది. చాలు, ఈ జీవితానికి, ఆ పసి మనసుల సమక్షంలో నేను చేసుకున్న "చిన్ని అనుష్ఠానం". ఇలా చేసే "అనుష్ఠానాలు" కాకుండా కొన్ని చేయకుండా ఉంటే "అనుష్ఠానాలుగా" మారేవి ఉన్నాయి. ఉదాహరణకు తన దారిన తాను పోతున్న కుక్కనో, పందినో ఊరికే కొట్టడం, నడుస్తున్న వారి మీద రోడ్డుపై నిలిచిన వాననీళ్లు పడేలా బళ్లు వేగంగా నడపడం,       అందుతున్నాయి కదా అని అనుమతి లేకుండా పక్కవారి పూలు, కాయలు కోసేయడం, ఇలాంటివి చేయకుండా ఉంటే ‘అనుష్ఠానం’ చేసినట్లే!!

ఇలా రాస్తూ పోతే ఎన్ని రకాల అనుష్ఠానాలైనా చెప్పచ్చు, చేస్తూ పోవచ్చు. తోటివారిని సంతోష పెట్టేదో, సాటివారి కన్నీరు తుడిచేదో ఏదైనా *అనుష్ఠానమే*మీరూ ఆలోచించండి, ఆరంభించండి. శరీరానికి ఎంత కాంతి, మనసుకి ఎంత శాంతి!

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...