Monday, 10 April 2023

ప్రకృతి ధర్మము (16-Apr-23, Enlightenment Story)

 🥀 ప్రకృతి ధర్మము 🥀

✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.

⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

ఒకానొకపట్టణమునకు దూరమున గల వనప్రదేశమందు ఒక తపస్వి కుటీరాన్ని నిర్మించుకొని ధ్యానాదికార్యములను ఒనర్చుకొనుచుండెను. ఏకాంత స్థలమగుటవలనను, విక్షేపజనకములైన పరిస్థితులెవ్వియు లేకుండుటచేతను ఆ తపస్వి తన ధ్యానానుష్ఠానములను నిరాటంకముగ కొనసాగించుకొనుచు, ఆనందముగ జీవితమును కొనసాగించుచుండెను.

ఒకనాడు మిట్టమధ్యాహ్నము ఒక రాజకుమారుడు అరణ్యములలో సంచారము సల్పుచు, దప్పికగొని నీరు త్రాగుటకై ఆ తపస్వి కుటీరమునకు వచ్చెను. తాపసి రాకుమారునికి దాహోదకమును ఒసంగి ఉపశాంతిని కలుగజేసెను. అనంతరము అతనితో ఆ తపస్వి “మీరెవరు? ఎచటినుండి వచ్చుచున్నారు?" అని అడిగెను.

అందులకు ఆతడిట్లు ప్రత్యుత్తరమొసంగెను, “మహాత్మా! నేనొక రాజకుమారుడను. మా తండ్రి ఈ సమీప ప్రాంతమునకంతటికిని మహారాజు. మాది జితేంద్రియ వంశము. నా పేరు జితేంద్రియకుమార్. మా తండ్రి పేరు జితేంద్రియ మహారాజ్, మా తల్లి పేరు జితేంద్రియ రాణి. నా ధర్మపత్ని పేరు జితేంద్రియదేవి"

రాజకుమారుని ఆ వాక్యములను వినగనే తపస్వికి ఆశ్చర్యము కలిగి, వారి వంశీయులు వాస్తవముగ జితేంద్రియులా! లేక నేతిబీరకాయవలె పేరుకు మాత్రము గొప్పగా అట్లు చెప్పుకొనుచున్నారా! పరీక్షింపవలెను అను ఉద్దేశ్యముతో రాజకుమారుని తన కుటీరమందే కొంత తడవు ఉండులాగున చెప్పి తాను హుటాహుటిగ రాజప్రాసాదమునకు పయనమైపోయెను.

రాజును సమీపించి అతనితో ఇట్లనెను -"ఓ భూసురో త్తమా! నీకు ఒక్కడే కుమారుడు. అతడు భీకరారణ్యములో సంచరించుచున్నాడు. ఒకవేళ జంతువులచే అతనికేదైన ప్రమాదము వాటిల్లి అకస్మాత్తుగ దేహవియోగమైనచో మీరేమి చేయుదురు?"

ఆ వాక్యములను విని నృపాలుడు ఏమాత్రము ఆవేదనపడక తపస్వితో గంభీరముగ ఇట్లు పలికెను - 

"ఓ తాపసోత్తమా! విధివిలాసమును ఎవరు తప్పించగలరు? పుట్టినప్పటినుండి మృత్యువు జీవుని వెంబడించుచునే యుండును. ఈనాడో, రేపో లేక కొన్ని వత్సరములో ఏనాడైనను పుట్టిన ప్రాణి చావక మానదు.

మృత్యుర్జన్మనతాం వీర దేహేన సహజాయతే|

అద్యవా౬బ్దశతాన్తేషు మృత్యుర్వై ప్రాణినాం ధ్రువమ్||

"జన్మించువారికి మృత్యువు వెనువెంటనే యుండును. ఎప్పటికైనను జీవునకు మరణము ఖాయము. ఇందు దిగులుపొందవలసినది ఏమియునులేదు. బ్రతకిన నాలుగు రోజులు భగవంతుని స్మరించుచు పుణ్యము నార్జించుటయే జీవుని యొక్క కర్తవ్యము!"

భూపాలుని ఆ విజ్ఞతాపూర్వక వచనములను విని తాపసుడు లోలోన సంతసించి, రాణి వద్దకు వెళ్లి,  "అమ్మా!నీ కుమారుడు ప్రమాదవశాత్తు ఎపుడైన మరణించినచో ఏమిచేయుదువు?" అని ప్రశ్నింపగా,  ఆమె జంకు గొంకు లేకుండ ఈ ప్రకారము పలికెను

"జాతస్య హి ధ్రువో మృత్యుర్ద్రువం జన్మమృతస్య చ! 

తస్మాదపరిహార్యే౬ర్ధే న త్వం శోచితు మర్హసి ||

"మహాత్మా పుట్టిన ప్రాణి చావకమానదు. చచ్చిన ప్రాణి కర్మశేషము ఉన్నంతవరకు పుట్టకమానడు. ఇక శోకించుట దేనికి? బ్రతికియున్న నాలుగు రోజులు రామా, కృష్ణా అని భగవన్నామస్మరణ చేయుచు పుణ్యమును సంపాదించు కొనుటయే మానవుని కర్తవ్యము!"

రాణియొక్క మహత్వపూర్ణములగు ఆ తాత్వికవచనములను విని తపస్వి ఆనందభరితుడయ్యెను.

తదుపరి రాజకుమారుని సతీమణి యొద్దకు వెళ్ళి "అమ్మా! నీ పతి అరణ్యములో సంచరించుచున్నాడు. ప్రమాదవశాత్తు అతనికి దేహవియోగమైనచో ఏమిచేతువు?" అని ప్రశ్నింపగా, ఆమె ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

“మహాశయా! తమకు తెలియనిదేమున్నది? ఈ ప్రపంచమున పిపీలికాది బ్రహ్మపర్యంతము గల సమస్తము ఒకానొక మహత్తరశక్తికి లోబడియే పనిచేయుచున్నది. విధిని ఎవరు తప్పించగలరు? బంధువులు, కుటుంబీకులు, మిత్రులు ధర్మసత్రము నందు యాత్రికులవలె కలిసికొని మరల విడిపోవునట్లు కొలదికాలము ఒకచోట కలిసికొని మరల ఎవరిదారిన వారు పోవుచుందురు.

ఏకవృక్ష సమారూఢా నానాజాతి విహంగమా:! ప్రభాతే విదిశో యాన్తి కా తత్రపరిదేవనా॥

"సాయంకాలమున ఒక చెట్టుపై రకరకముల పక్షులన్నియు గుమిగూడి తెల్లవారగనే ఎచటికో ఎగిరిపోవునట్లు ఋణానుబంధముచే జీవులున్ను ఒక కుటుంబమున కలసికొని మరల ఎవరికివారు వేరైపోవుచుందురు. ఇది ప్రకృతి ధర్మము. జగన్నియమము. ఇట శోకింపనేల"

రాజకుమారుని సహధర్మచారిణి యొక్క ఆ విజ్ఞతా పూర్వక వాక్యములను విని తపస్వి లోలోన పరమానందపడుచు, తిరిగి తన కుటీరముయొద్దకు వెళ్లి తన కొఱకై అచట వేచియున్న రాజకుమారునితో,  "నాయనా! మీ రాజ్యముపై శత్రువులెపుడైన దండెత్తి వచ్చి రాజవంశమునంతను చిత్తుగ నాశనమొనర్చివైచినచో నీవేమి చేయుదువు?" అని ప్రశ్నించెను.

అతడే మాత్రము కినుక వహింపక ధైర్యపూర్వకముగ ఇట్లు పలికెను - "తాపసోత్తమా! ఈ ప్రపంచమున ఏది శాశ్వతము? ఇంతరకెందఱు రాజులు రాలేదు! పోలేదు! వారందరూ ఏమైరి? ఎవరైన స్థిరముగనుండగలిగిరా? నదీ ప్రవాహమున కొన్ని కట్టెపుల్లలు ఒక చోట కలిసికొని మరల తరంగముల తాకిడికి వేరైపోవునట్లు ఒక కుటుంబమునగాని, ఒక వంశమున గాని కొందఱు జీవులు కలిసుకొని కొంతకాలము వ్యవహారము సలిపి మరల మృత్యుముఖమున పడి ఎవరిదారినవారు పోవుచున్నారు.

ఇదం కాష్ట మిదం కాష్టం నద్యాం వహతి సంగత:| 

సంయోగాచ్చ వియోగాచ్చ కా తత్ర పరిదేవనా||

కాబట్టి,  వియోగమందు దుఃఖపడనేల? బ్రతికిన కొలది రోజులు జగత్ర్పభువగు పరమాత్మను సేవించి, ధ్యానించి, పవిత్ర జీవితమును గడుపుటయే జీవులకు శరణ్యము"

రాజకుమారుని వాక్యములను విని తపస్వి ఆనంద డోలికలలో ఊగులాడుచు జితేంద్రియవంశమను పేరునకు తగినట్లుగనే కుటుంబసభ్యులందరును గొప్ప ఆధ్యాత్మికానుభూతి కలిగియున్నారని సంతసించి రాజు కుమారుని ఆశీర్వదించి పంపివైచెను.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️


No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...