గోదా కల్యాణం :
విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ఆండాళ్ లేదా గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారం. రామాయణంలో సీతలాగానే ఆమెకూడా అయోనిజ. జనకునికి సీత నాగేటిచాలులో దొరికినట్లు గోదాదేవి విష్ణుచిత్తునికి తులసీవనంలో దొరికింది. మనందరి కళ్లకూ రాతిబొమ్మగానే కనిపించే శ్రీరంగనాథుణ్ణి పెళ్లాడి ఆయనలోనే లీనమైపోయింది. అప్పటినుంచి ఆమె ఆండాళ్ అయింది. ఆండాళ్ అంటే రక్షించడానికి వచ్చినది అని అర్ధం. ఆమె దొరికినప్పుడు విష్ణుచిత్తుడు పెట్టుకున్న పేరేమో కోదై అంటే పూలదండ. తాను ముడిచి విడిచిన పూలను స్వామికి ఇచ్చి, ఆముక్తమాల్యద అని పేరు తెచ్చుకుంది. చూడికుడుత్త నాచ్చియార్, నప్పిన్నైప్పెరాట్టి, ఆండాళ్ అని వివిధ పేర్లతో ప్రస్తుతులు పొందిన ఆమె శ్రీరంగనాథుని ఇల్లాలు కావడం వెనుక తిరుప్పావై వ్రత మహిమ దాగుంది. ధనుర్మాసం నెలనాళ్లూ గోదాదేవి రోజుకొక్క పాశురంతో తిరుప్పావై గానంతో శ్రీరంగనాథుని అర్చించింది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి పాండ్యరాజు కలలో కనిపించి వివాహానికి ఏర్పాట్లు చేయమన్నాడు. వివాహానికి తరలిరావలసిందిగా విష్ణుచిత్తులకు కబురందింది. రాజు పంపిన పల్లకీనెక్కి కల్యాణానికి తరలి వెళ్తూ విరహోత్కంఠిత అయిన గోదాదేవి మరో ప్రబంధం రచించింది. అది ద్రవిడ సాహిత్యంలో నాచ్చియార్ తిరుమొళిగా ప్రసిద్ధి కెక్కింది. ఒక రాతిబొమ్మను మానవకాంత పెళ్లాడే చిత్ర దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. శ్రీరంగంలోని చిత్రవీధిలో నిండిపోయిన అశేష జనవాహిని మధ్య పల్లకి దిగింది పెళ్లికూతురు. దేవాలయపు ఉత్తరపు వీథిలో భోగి పండుగనాడు గోదాకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ తంతు ముగిసిన మూలమూర్తికి అప్పగింతలు పెట్టడానికి పాండ్యరాజు వంటివారంతా తోడురాగా కన్యాదాత పెరియాళ్వార్ అమ్మను తోడ్కొని వెళ్లారు. గర్భాలయంలో శేషశయన మూర్తిగా దర్శనమిచ్చే శ్రీరంగనాథుని పాదాలను గోదాదేవి స్పృశించింది. స్వామి పాదాల వద్దసాక్షాత్తూ మహాలక్ష్మిలా ఆమె కూర్చునేంత వరకూ అందరికీ కనిపించి ఆయనలో లీనమయ్యింది.
No comments:
Post a Comment