Friday, 3 November 2023

కుబేరపచ్చ కుంకుమ (08-Nov-23, Enlightenment Story)

 *కుబేరపచ్చ కుంకుమ*

🍁🍁🍁🍁🍁🍁🍁

మన భారతదేశంలో పసుపు-కుంకుమ లను మంగళకరమైనవిగా, 'సౌభాగ్య'చిహ్నాలుగా భావించి, పవిత్రంగా చూసుకుంటారు !! ఏ శుభకార్యానికైనా, పూజలకైనా, ముందుగా సిధ్ధం చేసుకునేవి 'పసుపు-కుంకుమ"లే 

పసుపులో పచ్చి పసుపు , కస్తూరి పసుపు, ఛాయ పసుపు, కొమ్ములు, దుంప పసుపు,అని పలు రకాలు అలాగే కుంకుమలో కూడా పలు రకాలు వున్నాయి 

ఎరుపు, ముదురు ఎరుపు,సింధూరపు రంగు, మీనాక్షీ కుంకుమ,( ఈ కుంకుమ మొగలి పూవుల సువాసనతో వుంటుంది.)మొ..!!..ఎక్కువగా వాడుకలో వున్నాయి..

కానీ 'కుంకుమ'లో 'ఆకుపచ్చ' రంగు కుంకుమ గురించి మనకు తెలీదు !! దీనినే "కుబేరపచ్చ కుంకుమ" అంటారు ఈ కుబేరపచ్చ కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది పురాణాలలో వర్ణించబడిన ఈ కుంకుమ, 'కుబేరునికి చాలా ప్రీతికరమైనది' 

అలాగే'పార్వతీదేవి'కి ప్రీతికరమైన రంగు కూడా, ఈ పచ్చ రంగే' ఈ కుంకుమ' గురించి శివపురాణం యిలా వివరించింది  'పరమశివుని భక్తుడైన కుబేరుడు' ఒకసారి కైలాసానికి వెళ్ళాడట 


అక్కడ ఏకాంతంగావున్న శివపార్వతులను చూశాడట. ప్రతిరోజూ దేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆరోజు 'అంబిక' ను దర్శించగానే 'కామవికారానికి, లోనయ్యాడట ఒక్క క్షణం 'పార్వతీ దేవి'ని, తన భార్యగా ఊహించుకున్నాడట 

'సర్వజ్ఞాని' ఆ సర్వేశ్వరునికి, ఇది తెలియకుండా ఉంటుందా ??సర్వేశ్వరునికి కోపం వచ్చింది శివుని అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైంది శివపార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు. ఆ చూపుల తీక్షణతకు, కుబేరుని దేహం కాలి కమిలిపోయిందట 

కుబేరుడు గడగడా వణికి పోయాడు. పరమశివుని కాళ్ళ మీదపడి,మన్నించమని వేడుకున్నాడు మా ఇద్దరి కోపం వలన ఏర్పడిన యీ ఉగ్రత, మా ఇరువురి శాంత స్వరూపాలు ఒకటైనప్పుడు చల్లదనంగా మారుతుంది 

అప్పుడు ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి, నీ చర్మం కమిలిపోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది అని పరమేశ్వరుడు కుబేరుని, దీవించాడు అప్పుడు కుబేరుడు పరమేశ్వరుడే గతి అని అనేక స్తోత్రాలతో, స్తుతించాడట 

త్వరగానే పార్వతీ పరమేశ్వరులు కుబేరుని కరుణించారట వారి అనుగ్రహంతో కుబేరునికి, స్వస్ధత చేకూరిందట అయినా శరీరం కాలిన ప్రదేశాలలో, తప్పుకి శిక్ష గా, మచ్చలు శాశ్వతంగా వుండిపోయాయట 

పరమేశ్వరుని కంఠం చుట్టూగల నీలం వర్ణం, పార్వతీ దేవి పసిమి ఛాయ {అంబిక మంగళరూపిణిగా దర్శనమిచ్చి నప్పుడు, పసుపు వర్ణంగానే దర్శనమిస్తుంది  ఆ పసుపు వర్ణాన్ని, తన దేహానికి పసుపు నలుగుపెట్టి తీసిన పసుపుతో వినాయకమూర్తిని చేయడం మనకు తెలుసు}

ఈ నీల వర్ణం, ఆ పసుపు వర్ణం రెండూ కలసినప్పుడు, అక్కడ ఒక అద్భుతం జరిగిందట ఆ రెండింటి కరుణా కిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా 'ఆకుపచ్చ'గా మారి పోయిందట 

{నీలం పసుపు రంగులను మిశ్రం చేస్తే, ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది} 

కుబేరుడు ఆ ఆకుపచ్చ మట్టి'ని తన శరీరానికి, పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా, మామూలు స్థితిని పొంది, శివపార్వతుల ఆగ్రహంనుండి విముక్తి పొందాడట, అంతే కాకుండా ఆ పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకొని వెళ్ళి, నిత్యం శరీరానికి ధరించేవాడట ఆనాటి నుండి 'పచ్చరంగు' కుబేరునికి ప్రీతిపాత్రమయిందట 

'పచ్చరంగు కుంకుమ' కుబేర చిహ్నంగా అయి, పురాణాలలో ఎంతో పవిత్రతను సంతరించుకు

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


గంగయ్య జువ్వి చెట్టు(07-Nov-23, Enlightenment Story)

 🍁ప్రత్యుపకారం🍁

🕉️🌞🌎🏵️🌼🚩

పులిచెర్లలో గంగయ్య అనే తాపీ పనివాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ పట్నం వెళ్ళి పనిసేవాడు. ఆ వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన బియ్యమో, రాగి-జొన్నలో కొనుక్కుని, కాలినడకన ఊరికి తిరిగి వచ్చేవాడు.

అతను వచ్చే దారిలోనే, ఊరికి దగ్గరగా పెద్ద జువ్వి చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు కింద ఓ పెద్ద చీమల పుట్ట ఉండేది. గంగయ్య ప్రతిరోజూ ఆ పుట్ట దగ్గర ఆగేవాడు. తను తెచ్చుకున్న ధాన్యపు మూటని విప్పి, ఒక చారెడు ధాన్యం తీసి, ఆ పుట్ట చుట్టూ పోసి ఆనక మెల్లగా నడచుకుంటూ ఇంటికి పోయేవాడు.

అది చూసి కొందరు నవ్వుకునేవాళ్ళు: "వీనికి ఇదేమి పిచ్చి?! తను ఏమైనా దానకర్ణుడ-నుకుంటున్నాడో ఏమో. ఇతనికే ఏమీ లేదు కదా, తినేందుకు?! అయినా కష్టపడి సంపాదించిన సొమ్మును ఇంటికి తీసుకుపోయి దాచుకోక, నేలపాలు చేస్తాడు. తిక్కే, వీడికి!" అని అనుకునేవాళ్ళు.

తనని ఎవరు ఎన్ని మాటలన్నా, గంగయ్య మటుకు వారి మాటల్ని చెవికి ఎక్కించు-కునేవాడు కాదు. కాలం గడిచే కొద్దీ ఆ చెట్టు కాస్తా జనాల భాషలో 'గంగయ్య జువ్వి చెట్టు' అయ్యింది. చీమలు అతడిని గుర్తించినాయో లేదో గాని, అతడు మాత్రం చీమలకు గింజలు వెయ్యని దినమే లేదు.

అలా ఉండగా ఆ ప్రాంతంలో క్రమంగా వర్షాలు తగ్గిపోసాగినై. ఒక ఏడాదైతే అక్కడి నేల మొత్తం బీటలు వారింది; చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు అన్నీ ఎండిపోయాయి! భూమిలో తేమ తగ్గిపోయింది. జువ్విచెట్టుకు కూడా నీరు చాల లేదు. అందుకని అది తన కొమ్మలకు, రెమ్మలకు నీటి సరఫరా తగ్గించింది. దానితో చిన్న చిన్న కొమ్మలు అన్నీ ఎండిపోసాగినై. క్రమంగా ఆ చెట్టును ఆశ్రయించి నివాసం ఉంటున్న పక్షులు కూడా వలస పోసాగాయి!

గ్రామంలో‌ జనాలంతా వాడుకొన్న నీళ్ళు పోయేందుకు ఓ మురికి కాలువ ఉండేది. అది గంగయ్య జువ్వి చెట్టుకు కొంత దూరంనుండే పోతుండేది. మరి ఈ చీమలకు ఆలోచన ఎట్లా వచ్చిందో ఏమోగాని, చెట్టు చుట్టు ప్రక్కల ఉన్న నేలను అంతా గుల్ల బార్చాయి. మురికి కాలువ వరకూ నేలకు చిన్న చిన్న రంధ్రాలు వేసి దారులు ఏర్పరచాయి.

చూస్తూ చూస్తూండగానే మురికి కాలువల్లో‌ని తేమ ఈ దారులను అంటుకున్నది. నెమ్మదిగా చెట్టు దగ్గరి వరకూ వచ్చి చేరింది. ఆ సంగతి తెలియగానే జువ్వి చెట్టు నులివేళ్ళు ఆ వైపుకు సాగాయి. తేమను అందిన జువ్వి చెట్టుకు ప్రాణం‌ లేచి వచ్చినట్లయింది. త్వరలోనే అది మళ్ళీ పచ్చగా అయ్యింది. అంతకు ముందున్న రూపాన్ని సంతరించుకుంది. వలసపోయిన పక్షులు కూడా తిరిగి తమ గూళ్లలోకి చేరుకున్నాయి ఆనందంగా.

చెట్టు చీమలనడగలేదు. చీమలు చెట్టుకు చెప్పలేదు. పక్షులు చెట్టుకు చెప్పిపోలేదు. అవి తిరిగి చెట్టునడిగి రాలేదు.

ప్రకృతి ఎవరి ప్రమేయమూ లేకుండా తనపని తాను సాగిస్తూనే ఉంటుంది. జీవుల మధ్య అవినాభావ సంబంధం అర్థం కానిది.

తర్వాత కొన్నేళ్లకు ఒకసారి ప్రకృతి మళ్ళీ వికటించింది. ఈసారి చిన్న గాలితో మొదలై, ఓ మోస్తరు వానగా మారి, చివరికి అదే కుండపోత వర్షమై, మన్ను మిన్ను ఏకమైనట్లు కురవసాగింది వాన! గంగయ్య ఇల్లు ఊరికి కొంచెం ఎడంగా ఉండేది. ఎండిన వాగు ప్రక్కనే, ఓ రాళ్ళగుట్టకు దగ్గరగా ఉండేది అతని ఇల్లు. అక్కడ అతనితో బాటు మరో‌ మూడు నాలుగు ఇళ్ళు ఉండేవి అంతే.

కొద్ది సేపటికి వంకల నీళ్ళు అన్నీ చేరుకునే సరికి, వాగులో ప్రవాహం మొదలైంది. దాంతో కాలనీవాసులకు అందరికీ‌ భయం వేసింది. అందరూ తమ తమ ఇళ్ళు వదిలి దూరంగా‌ పోయి, ఎత్తైన ప్రాంతాల్లో తల దాచుకున్నారు.

గంగయ్యకు ఎందుకనో భయం అనిపించలేదు. వేరే ఎక్కడికో‌ పోయి ప్రాణాలు కాపాడుకోవాలని కూడా అనిపించలేదు. పొంగుతున్న వాగుని, వానలో తడుస్తున్న జువ్వి చెట్టుని చూస్తూ అతను అక్కడే కూర్చున్నాడు.

రాను రాను ప్రవాహ ఉధృతి పెరిగింది. మెల్లగా గంగయ్య ఇంటి వైపు నేల కోతకు గురవ్వసాగింది. ఆ సరికే వంకలోకి రకరకాల వస్తువులు కొట్టుకొచ్చినై. గ్రామంలోకి నీళ్ళు వచ్చేసాయి. చాలామంది ఇళ్ళలోని వస్తువులు నీళ్ళపై తేలుతున్నాయి. ఇక మిగిలింది గంగయ్య ఇల్లు ఒక్కటే. " అది కూడా కూలిపోతుంది.. మొత్తం వంకలో పడి కొట్టుకొని పోతుంది- ఖాయం" అనుకున్నారు అందరూ.

అదేమి చిత్రమో గాని, అప్పటికప్పుడు పెద్ద బండరాయి ఒకటి గుట్ట పైనుండి జారి పడింది. ఆ శబ్దానికి అందరూ భూకంపం వచ్చిందేమో‌ అన్నట్లు ఉలిక్కిపడ్డారు. పడటం పడటం అది వంకలో పడింది! ప్రవాహ వేగానికి అడ్డంగా దొర్లుకొని, గంగయ్య ఇంటి పునాదిని ఆనుకొని నిలబడింది. ఆ ఒక్క బండ అడ్డు ఉన్నందువల్లనే నీటి ప్రవాహపు దారి మళ్ళింది. వాగు మొత్తం అవతలి ఒడ్డును ఒరుసుకొని పారింది!

వర్షం నిలిచి వాతావరణం‌ శాంతించేందుకు వారం రోజులు పట్టింది. చూడగా గంగయ్య ఇంటి పునాది ఏమాత్రం కోత పడలేదు. ఇల్లు చెక్కుచెదరలేదు. గంగయ్య తిరిగివచ్చి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు.

గంగయ్య చీమలకు ఆహారం అందించి-నందుకు ప్రతి ఫలంగా ఏ దేవుడో వచ్చి అతనికి సాయం అందిస్తారు అనుకున్నారు కదూ?! ఈ కథలో అట్లా జరగలేదు. మనం మానవతతో, ప్రతిఫలాన్ని ఆశించకుండా, 'తోటివారికి సాయం చేయటం మన కర్తవ్యం కదా' అనుకొని పని చేస్తూ పోతే, ఏదో ఒకనాడు-ఎప్పుడో‌ ఒకప్పుడు- ఎవరో ఒకరు తోడుగా నిలచి, మనకు సాయం అందిస్తారు. ఇది సున్నితమైన ధర్మం. గంగయ్య తనకు తెలీయకుండా చీమలకు సాయమందించాడు. ఆ సాయం ఊరికే పోలేదు. అది మరోరూపంలో అతనికి సాయంగా అందింది.

ఇతరులకు చేసే సాయం ఏనాటికీ వృధా పోదు!!🤘

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


మోహం కధ (06-Nov-23, Enlightenment Story)

 🍁మోహం -కధ🍁

🍁🍁🍁🍁🍁🍁

 ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని. మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని,

*ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !! అన్నాడు*

వెంటనే ఆ సాధువు " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.

యజమాని కంగారుపడుతూ. అలా ఎలా కుదురుతుంది ??

పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!" అన్నాడు.

సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.

ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు.మాటలలో సాధువు అన్నాడు, " పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " యజమాని తడబడుతూ " ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి...వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ....." అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే.... యజమాని ఆతిథ్యం... సాధువు అదే మాట ..... యజమాని జవాబు కొంచెం విసుగ్గా.." పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను..వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది " అన్నాడు..

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి

సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు .

అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది.

ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు.. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు.. సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడు.. సాధువు మంత్రజలం దాని మీద జల్లి ,

" ఏమిటి నీ పిచ్చి మోహం ???!కుక్క గా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ?? నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.. యజమాని " ఆ మాట మాత్రం వినలేను..

ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా " అన్నాడు.

మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు . కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు.అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది.. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ  పాము గా...

మంత్రజలం చల్లి, " ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ??? నాతో...................." అన్నాడు

ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా..

సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో " మీ నాన్న ఆ చెట్టు కింద దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది " అన్నాడు.అనగానే కొడుకులు ఎగిరి గంతేసి, కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది

నీతి : గృహస్థాశ్రమం లో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం.

ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి...

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

బ్రహ్మ తలరాత (05-Nov-23, Enlightenment Story)

 బ్రహ్మ తలరాత

🍁🍁🍁🍁🍁🍁🍁

కాశిలో వున్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. ఒకనాడు గంగా నది దగ్గర మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూచి ఛి యదవ పుర్రె ఇప్పుడే తగలాల! మళ్లి స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసింది. అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు.

వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు. బడిలో పంతుళ్ళు కొడతారు. పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఇంట్లోనుండి తన్ని గెంటేస్తారు. ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే వుంటారు. డబ్బు నిలవదు. ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది. బ్రతికినంతకాలం కష్టాలు పడీ పడీ చస్తాడు. వీడు చచ్చిన 500 సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది. అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసివుంది అది చదివి ! బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు. చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి? బ్రహ్మకి అసలు బుర్ర వుందా? అని ఆ పుర్రేని విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడడం అనుకోని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఈ పుర్రె ని దాచాడు. నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రిచెట్టు తొర్రలో ఉన్న పుర్రేని చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక 10 రోజులపాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చి మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి తొర్రలో ఉన్న పుర్రెకోసం చుస్తే కనపడలేదు. వెతికాడు దొరకలేదు. మర్రిచెట్టు తొర్రలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం , సంధ్యా వందనం చేస్తున్నాడు కాని మనసు మాత్రం పుర్రెమీదే వుంది. చేశాం అంటే చేశాం అన్నట్టు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి మీరెందుకు ఇలా వున్నారో నాకు తెలుసులెండి అంది..

ఒసేయ్ పిచ్చి మొహమా! ఎం తెలుసే నీకు?

మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రితోర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించేకదా! ఆ సంగతి నాకు ఎలా తెలుసనుకుంటున్నారా? మీరు రోజు ఆ మర్రితోర్రలో పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పారు. ఓహో! ఇంతకీ ఏమి చేశావే దాన్ని. అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్ళు మరగబెట్టి దానిమీద పోశాను. సలసలా కాగే నునె గుమ్మరించాను, అప్పటికి కసి తీరక కారం చల్లాను. అయిన కోపం తీరక రోట్లో వేసి రోకలిబండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది.

అప్పుడు జరిగింది చెప్పాడు. ఒసేయ్ వెర్రి మొహమా! అది నాపెళ్ళాం కాదే! దానిమీద చచ్చాక కూడా ఆపుర్రే అవమానం పాలై మోక్షం పొందుతుందని రాసి ఉంది. అది ఎలా నిజమౌతుందో చూద్దామని నేను ఆ మర్రిచెట్టు తోర్రలొ ఉంచాను. ఇదిగో నీవల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా! అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది.

బ్రహ్మ రాస్తే నిజమై తీరుతుంది. బ్రహ్మ రాసిన రాత మారాలంటే ఎం చేయాలి?

సద్గురువు కటాక్షం ఉండాలి. అప్పుడే రాతని మార్చుకోవచ్చు. లేదంటే ఇది నేనే చేశాను, నేనే చేయగలను. అనే బ్రమలో బ్రతికేస్తారు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Thursday, 2 November 2023

మనం చేసిన పాపాలకి శిక్ష (04-Nov-23, Enlightenment Story)

 మనం చేసిన పాపాలకి శిక్ష 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు. కానీ తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని చేసేస్తూ ఉంటాం. ఈ విషయంలో మన సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది. మనం చేసే అన్ని తప్పులు (పాపాలు) మూడిటితోనే చేస్తాం. (1) కాయిక (శరీర గత); (2) వాచిక (మాటతో); మరియు (3) మానసిక (మనసుతో). ఆ తప్పులు ఏమిటో తెల్సుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం.

🌺 ఒకవేళ ఆ తప్పులు చేసినట్లైతే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పేరు. ఇవి ఎవరికి వారే వ్యక్తిగతంగాపరీక్షించుకుని మార్పు చెందే సుళువైన మార్గం.

(1) కాయిక (శరీరగత) పాపములు: మనుధర్మ శాస్త్ర ఆధారంగా…

🌺 శ్లోకం: అదత్తాముపాదానం హింసాచైవా విధానతః, పరదారోపసేవా చ శరీరం త్రివిధం స్మృతం.

🌺 అర్థం: అన్న్యాయముగా డబ్బు సంపాదించడం, హింస చేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, పరస్త్రీ సంగమం.. ఇవి శరీరముతో చేసే పాపములు (తప్పులు).

🌺 ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…

శ్లోకము: దేవ ద్విజ గురు ప్రాఙ్ఞ్య పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే.

🌺 అర్థము: దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ఙ్ఞానులను పూజించడం, శరీరమును శుచిగా ఉంచడం, పవిత్రమైన ఆచారములు, డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం, బ్రహ్మచర్యము (తన భార్యతో తప్ప ఇతర స్త్రీలయందు కామ దృష్టి లేకపోవడం), ఇతరులను హింసించకుండా ఉండడం.. ఇవి శారీరిక తపస్సులు.

(2) వాచిక (మాటతో) పాపములు:

🌺 శ్లోకము: పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశః, అసంబద్ధ ప్రలాపశ్చ వాఙ్ఞ్మయంస్యాచ్చతుర్విధం.

🌺 అర్థం: కఠినముగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను నిందిస్తూ మాట్లాడడం, వ్యర్థమైన/పనికిమాలిన మాటలాడడం.. ఇవి వాక్కుతో చేసే తప్పులు.

🌺 ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…

🌺 శ్లోకము: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్ఞ్మయం తప ఉచ్యతే.

🌺 అర్థము: ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం, ఇష్టముగా మరియు మేలుకలిగించే విధంగా మాట్లాడడం, యదార్థము మాట్లాడడం, వేద శాస్త్రములను పఠించడం, పరమేశ్వరుని నామ జపం చేయడం.. ఇవి వాక్కుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సనబడుతుంది.

(3) మానసిక పాపములు:

🌺 శ్లోకము: పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం, వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం.

🌺 అర్థము: ఇతరుల డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలనే ఆలోచన, పరులకి కీడుతలపెట్టే ఆలోచన, శరీర అభిమానము.. ఇవి మనసుకి సంబంధించిన పాపములు.

🌺 ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…

🌺 శ్లోకము: మనః ప్రసాదః సౌమ్యత్త్వం మౌనమాత్మ వినిగ్రహ:, భావ సంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే.

🌺 అర్థము: మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం, శాంత భావం, సదా భగవచ్చింతన చేసే స్వభావం, మనోనిగ్రహం, అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవడము.. ఇవి మానసిక దోషములను పోగొట్టే తపస్సులనబడతాయి. అన్నిటిలోకి మానసిక తపస్సు చాలా గొప్పది. ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే. మనందరం ఈ నిముషం నుండే అభ్యాసం మొదలెడదాం.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు (03-Nov-23, Enlightenment Story)

 🌹అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు....!!!🎉

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. 

🌸ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి

🌿ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి  'మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!") అని చెప్పాడు

🌸శల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా.... అనిపించే శిల్పాలు సృష్టిస్తాను.. 

🌿కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక  వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు

🌸అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు

🌿మృత్యుదేవత ఆ గది లోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు. 

 🌸శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది.  ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో... శిల్పమేదో... కనుక్కోలేక పోయింది

🌿ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళి పోవాలనుకొని  వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి "ఈ శిల్పి" ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది

🌸అంతే !మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు  ఒక్కరుకూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా! ఈ దేవత... అనుకున్నాడు.



🌿 వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో  '' ఏది ? ఎక్కడుంది తప్పు చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు!" అనేసాడు

🌸అపుడు మృత్యుదేవత నవ్వుతూ.... నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి  చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు!ల్"ప్రాణాధార మైన నీ శ్వాసను కూడా నియంత్రించ గలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించ లేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది" అని ఆయన్ను తీసుకెళ్ళి పోయింది

🌿మనం పెంచుకొనే అహంభావం అంత ప్రమాదకరమైనది అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. 

🌸నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి ''నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు'' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం

మీరు గమనించారా ?

🌿'' అహంభావం '' అనే పదం లోంచి  అహం 'తీసేస్తే మిగిలేది ' భావం ' అంటే  ' అర్థం' అర్థమైతే అనర్థం జరగదు....నమస్కారం..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌸🌿🌸🌿🌸🌿🌸

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌸🌿🌸🌿🌸🌿🌸

Wednesday, 1 November 2023

నేను కొనబోయే ఆవు కథ (02-Nov-23, Enlightenment Story)

 *నేను కొనబోయే ఆవు కథ*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

పేరొందిన హాస్య కళా మూర్తి గోపాల్ భాండ్ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో, ఆయన ఇంటి ప్రక్కనే పేద దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు. ఆ భార్యాభర్తలిద్దరికీ, పాపం, పగటి కలలు కనే అలవాటు ఉండేది. ఒక రోజున గోపాల్ భాండ్ వింటుండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళను మించి మరొకళ్ళు కోతలు కోస్తూ పగటి కలలు కనటం మొదలు పెట్టారు.

భర్త అన్నాడు: " నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే, నేనొక ఆవును కొంటాను" అని.

భార్య శృతి కలిపింది- "అప్పుడు నేను పాలు పిండుతాను. మనకు చాలా కుండలు అవసరమౌతాయి మరి. నేను వెళ్ళి, కొన్ని కుండలు కొనుక్కురావాలి" అని.


 *మర్నాడు నిజంగానే భార్య సంతకు వెళ్లి కుండలు కొనుక్కొచ్చింది. భర్త ఆమెను అడిగాడు: " ఏం కొనుక్కొచ్చావు?" అని."ఏముంది? కుండలు! ఒకటి పాలకు, ఒకటి మజ్జిగకు, ఒకటి వెన్నకు, ఒకటి నెయ్యికి!" అన్నది భార్య.

"బాగుంది, బాగుంది. మరి ఇంక ఆ ఐదో కుండ దేనికి?‌" అడిగాడు భర్త.

"మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలికి ఇవ్వటం కోసం ఈ ఐదో కుండ!‌" అన్నది భార్య.

"ఏంటీ!? మిగులు పాలు మీ చెల్లెలికి ఇస్తావా?! ఎంతకాలంగా చేస్తున్నావు, ఈ పని? నాకు కనీసం చెప్పకుండా, నా అనుమతి లేకుండా, ఇంత నాటకం ఆడుతున్నావా?" అని భర్త అరుస్తూ, కోపం పట్టలేక కుండల్ని విసిరేసి, అన్నింటినీ పగలగొట్టేశాడు.

ఇక భార్య తిరగబడింది- " ఆవు ఆలనా, పాలనా చూసేది నేను! పాలు పిండేది నేను! మిగులు పాలతో‌నాకేది ఇష్టమైతే అది చేస్తాను!" అని.

"దుర్మార్గురాలా! నేను రాత్రింబవళ్ళూ చెమటోడ్చి పనిచేసి, డబ్బులు కూడబెట్టి, ఆవును కొంటే, ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలికి పోసేస్తావా? ముందు నిన్నేం చేస్తానో చూడు" అని గర్జిస్తూ, భర్త తన చేతికందిన మూకుళ్లనూ, గిన్నెల్నీ భార్య మీదికి విసిరేశాడు.

ఇంట్లోంచి వింటున్న గోపాల్ భాండ్ కి చాలనిపించింది. అతను పక్కింటికెళ్ళి అడిగాడు అమాయకంగా- "ఏమైంది? వంట సామాన్లన్నీ ఎందుకు విసిరేస్తున్నారు?" అని.

" మా ఆవు పాలన్నీ తీసుకెళ్ళి, ఈమె తన చెల్లెలికి పోసేస్తోంది!" అన్నాడు భర్త.

"మీ ఆవా?!" అడిగాడు గోపాల్ భాండ్.

"అవును. తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు!"

"ఓహో, ఆ ఆవా? మీకు ఈరోజున ఇంకా ఆవు లేదు, కదూ?" అడిగాడు గోపాల్.

భర్త అన్నాడు- " చూస్తూండు. ఎప్పటినుండో అనుకుంటున్నాను. నేనొకదాన్ని తెస్తున్నాను త్వరలో" అని.

"ఓహో ఇప్పుడు అర్థమైంది, నా కూరగాయల తోట ఎప్పుడూ నాశనం ఎందుకౌతున్నదో!" అని గోపాల్ అకస్మాత్తుగా ఓ చింత బరికె చేతపుచ్చుకొని అతని మీదికి ఉరికాడు.

"ఆగు..ఆగు... నన్నెందుకు కొడుతున్నావు?" అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు పక్కింటాయన.

"నీ ఆవు! నీ ఆవు మా తోటలోకి జొరబడి, నా చిక్కుళ్ళనీ, దోసపాదుల్నీ ఇష్టం వచ్చినట్లు నమిలేస్తోంది. నువ్వు దాన్ని అట్లా వదిలేశావు!" అని చిందులేశాడు గోపాల్.

"ఏ చిక్కుళ్ళూ, ఏ దోస పాదులు? నీ కూరగాయల తోట ఎక్కడుంది అసలు?"

*నేను నాటబోతున్న చిక్కుళ్ళూ, నేను పెట్టబోతున్న దోసపాదులు! నేను పెంచబోతున్న కూరగాయల తోట! నేను ఎంతో కాలంగా దాన్ని గురించి ఆలోచిస్తుంటే, మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తోంది దాన్ని!" అన్నాడు గోపాల్ ఊపిరి బిగబట్టి*

పొరుగింటివాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నై. కలలన్నీ విరిగి, ఆకాశం నుండి నేలకు దిగి వచ్చారు. ఆపైన కొద్ది సేపటికి అందరూ కలిసి నవ్వుకున్నారు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...