ఏకాత్మ బుద్ధి
💥💥💥💥💥💥💥💥💥
దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే సందేహము ప్రతి వాడికి కలుగుతుంది ఎందుకంటే దేవుడు కనపడడు కాబట్టి. అందుకే పోతన ఒక ఆణిముత్యం లాంటి పద్యం మనకు అందించాడు.
ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే॥ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడు లేడు అనే సందేహం వదిలిపెట్టాలి. భగవంతుని కోసం వెదకాలి. దానికి మార్గం ధ్యానమార్గం ఉత్తమమైంది.
||సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః||||సర్వథా వర్తమానో..పి స యోగీ మయి వర్తతే॥
ఎవరైతే సకలభూతములలో ఉన్న నన్ను భేదబుద్ధి లేకుండా చూస్తాడో అటువంటి ఎక్కడ ఏ కాలంలో ఏవిధంగా ప్రవర్తించినా, అతడి మనసు మాత్రం ఎల్లప్పుడు నాయందే లగ్నం అయి ఉంటుంది.
కాకపోతే మనకు ఉండవలసిన లక్షణం మనకన్నా పెద్దలు, గురువులు, శాస్త్రాలు చెప్పింది వినడం. మనకు లేని లక్షణం అదే! ప్రతి వాడూ నాకు అంతా తెలుసు అనుకుంటాడు. వాడికి ఏమీ తెలియదు అన్న విషయం వాడికి తెలియదు. అదే అజ్ఞానం. వినదగు నెవ్వరు చెప్పిన అనే మాట అందుకే వచ్చింది. కాబట్టి భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు అని గ్రహించాలి.
పాలలో వెన్న లాగా, కట్టెలో నిప్పులాగా, నువ్వులలో నూనె లాగా దాగి ఉన్నాడు. మధిస్తే కనపడతాడు. ఎన్ని ఆభరణాలు ఉన్నా అందులో ఉండే మూలపదార్థం బంగారం. రకరకాల కుండలు ఉన్నా అందులో ఉండే మూలపదార్థం మట్టే. అలాగే అన్ని జీవరాసులలో ఉండే వాడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మలోనే అందరూ ఉన్నారు.
కాబట్టి సమస్త జీవరాసులు పరమాత్మ స్వరూపాలే అని భావించాలి. ఎవరికీ, దేనికి అపకారం చేయకూడదు, ద్వేషించకూడదు. ఇతర మానవుల పట్ల, జీవరాసుల పట్ల దయ, కరుణ కలిగి ఉండాలి. అన్ని జీవరాసులయందు ఏకత్వ బుద్ధి కలిగి ఉంటే, పరమాత్మ మనకు కనపడతాడు. దానినే ఏకాత్మ బుద్ధి అని అంటారు. జీవులలో భేదం చూడకూడదు. ఆ ప్రకారంగా జీవులలో బేధ బుద్ధి లేకుండా ప్రవర్తించేవాడు. బయట ప్రపంచంలో తిరుగుతున్నా వాడి మనసు మాత్రం ఎల్లప్పుడూ పరమాత్మయందే లగ్నమై ఉంటుంది. అతడు సమాధి స్థితిలో ఉన్నా, ప్రాపంచిక వ్యవహారాలు చక్కబెడుతున్నా ఒక్కటే. దిక్చూచిలో ముల్లు ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది అలాగే జ్ఞాని మనసు ఎల్లప్పుడూ భగవంతుని వైపు తిరిగి ఉంటుంది.
ఆత్మజ్ఞానం పొందినవాడు మరలా ప్రాపంచిక సుఖముల వంక మళ్లడు. కాబట్టి ఆత్మజ్ఞానం పొందినవాడు, మరలా అధోగతి పాలు కాకుండా చాలా జాగ్రత్త పడాలి. బయట ప్రపంచంలో తిరుగుతున్నా మనసు మాత్రం పరమాత్మయందే లగ్నం చేయాలి. అతడే నిజమైన జ్ఞాని అనిపించుకుంటాడు.
🕉️🙏భగవద్గీత చదవండి, అర్ధం చేసుకోండి 🙏 🕉️
🕉️🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🕉️🙏
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment