Wednesday, 19 April 2023

కొత్తావకాయ, కొత్తకాపురం - వేసవి ప్రత్యేకం (20-Apr-23, Enlightenment Story)

 కొత్తావకాయ, కొత్తకాపురం (వేసవి ప్రత్యేకం)

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

బడినుంచి ఇంటికిరాగానే అమ్మని వెతుక్కున్నట్టు అన్నాలకి కూర్చోగానే ఆవకాయ జాడీ ఎక్కడుందో వెతుకుతాయి కళ్లు. వేడివేడిగా కలగూరపప్పు, మువ్వొంకాయ కూర, ముక్కలపులుసూ ఉన్నాసరే, ఆవకాయ కనబడకపోతే ఇళయరాజా పాటలో ఫ్లూటెక్కడా వినబడనట్టు లోటుగా అనిపిస్తుంది. 


ఈలోగా అ ఓమూల ఆలయప్రాంగణంలో పూలచెట్టులా నేనున్నానంటూ ధీమాగా పలకరిస్తుంది పింగాణీ పిల్ల. అసలీ ఆవకాయ జాడీలతో మనకు బోల్డన్ని జ్ఞాపకాలు.

మా చిన్నతనంలో వంటింట్లో నీలంరంగు చెక్కతలుపుల బీరువా తెరవగానే పదునెక్కిన పాతవాసన వచ్చేది. అదో రకమైన ఘాటు. తలుపులు మూసేసి మళ్లీ వెంటనే తెరవాలనిపించేంత వ్యసనం. తీరా తెరిచిచూస్తే  మూతికి గుడ్డ బిగించి కట్టిన పొడవాటి జాడీ ఒకటి అలా నిలువుగా మా పెదనాన్నలా గంభీరంగా కనబడేది... కిందంతా పట్టుపంచెలా తెల్లగానూ, పైనేదో లేతపసుపు ఉత్తరీయం కప్పుకున్నట్టుగానూ!

ఆ జాడీని ఏ పదిరోజులకోసారో చూసేవాళ్లం. దాన్ని పెద్దావకాయ అనేవారు అమ్మానాన్నా గుండ్రంగా, గునగునలాడుతూ మా పెద్దత్తయ్యలా కనబడే చిన్నజాడీ ఒకదాన్ని ఎప్పుడూ అన్నాల దగ్గర పెట్టేది అమ్మ. ఎందుకంటే పెద్దావకాయ తియ్యడానికి మడీ తడీ అంటూ చాలా హడావిడుంటుంది .

ఎవరితోనూ మాటాడకుండా అత్యంత శ్రద్ధతోనూ, ఇంకా బోలెడంత శుభ్రతతోనూ స్టీలు గరిటొకటి పట్టుకుని అమ్మ బయల్దేరిందంటే మా ఇలవేల్పు సినిమాలో కె.ఆర్. విజయని చూసినంత భయభక్తులతో చూసేవాళ్లం. 

అలా తిన్నగా వంటింట్లోకెళ్లి కిడ్నాప్ చేసిన హీరోయిన్‌ నోట్లోంచి గుడ్డలు తీసినట్టు వాసినిగుడ్డ విప్పేది. ఆనక పెద్దజాడీలోంచి చిన్నజాడీలోకి దఫదఫాలుగా ఆరేడు గరిటెల ఆవకాయ నింపుతుండేది. గరిటె బయటపడిన ప్రతిసారీ కమ్మని నూనెవాసన, కళ్లనీళ్లొలికించే ఆవఘాటూ తగిలేవి. ఇక వెల్లుల్లావకాయైతే మధ్యమధ్యలో ఒక్కొక్కటి కనబడి ‘ఏరా, బావున్నావా?’ అని మమ్మల్ని పలకరించుకుంటూ జాడీలోకి జారుకునేవి.

ఇదంతా చూస్తూ ఎదిగాం. 

అసలు ఈ ఆవకాయల కోసం పెళ్లివారిలా నెలముందునుంచీ హడావుడి చేసేవారు నాన్నగారు. బారామాసి కాయలైతే ఊట బావుంటుందని, ఏడాదంతా పాడవదని అవే తెచ్చేవారు. పోనీ ఇప్పట్లా ఆ కాయలవాడి పక్కనే గోనెపట్టా వేసుక్కూర్చుని ముక్కలు కొట్టే అబ్బాయి చేత కొట్టించేవారా? ఎబ్బే! అలాచేస్తే సంతృప్తుండదుట. 

మాయింట్లోది కాకుండా పక్కింట్లోంచి మరో కత్తిపీటో, మర కత్తిపీటో తెచ్చేవారు. అదేంటో పక్కవాళ్ళ కత్తిపీటలే బావుండేవి ఎప్పుడూ! వాటితో ఈయన మొత్తం కాయలన్నిటినీ అరగంటలో తరిగేసేవారు. అప్పుడు పిల్లలం ఐదుగురం శుభ్రంగా ఉతికిన తెల్లటి గుడ్డలొక ఐదు తీసుకొచ్చి ముక్కల బేసిన్ చుట్టూ కూర్చునేవాళ్లం. స్నానం చేయించాక చంటిపిల్లల్ని తువ్వాలుతో తుడిచినట్టు తడిలేకుండా ముక్కలన్నిటినీ తుడిచి ఇచ్చేసేవాళ్లం. జీడిమీద ఉండే పల్చటి పొరల్ని చాకుతోనో, చెంచాతోనో తియ్యడమంటే నాకు భలే సరదాగా ఉండేది.

ఈలోగా అమ్మానాన్నా కారాలూ మిరియాలూ... సారీ, కారాలు, ఉప్పూ కలిపిన ఆవపిండితో సిద్ధంగా ఉండేవారు. ఏళ్లతరబడి అందరి నోళ్లలోనూ నానుతున్న అంబటి సుబ్బన్న నువ్వులనూనె ఓపక్కగా కేజీ సైజు హార్లిక్స్ సీసాలోంచి బంగారంలా మెరిసిపోతూ ఎప్పుడెప్పుడు శివుడి జటాజూటంలోంచి కిందకి దూకుదామా అని ఎదురుచూసే గంగలా ఉండేది. ఆవకాయలో ఒలకగానే ఆత్మానందం దానికి. ఇక ఏడాదంతా ముక్కల్నీ, పిండినీ, మనల్నీ సంతోషంగా ఉంచాల్సిన బాధ్యతంతా తనదే కదా! అక్కణ్ణుంచి ఆ నూనె తాలూకా కమ్మదనం కాస్తా అమ్మదనంలా మారిపోతుంది. 

అబ్బ, ఆవకాయకి ఇంత వర్ణన అవసరమా అని అడుగుతారేమో? అవసరం కాదు. విధాయకం. మా మూడో మేనత్త తన ఏడుగురు కొడుకులకీ పొద్దున్నే ఇంత ఆవకాయేసి గిన్నెడు చద్దన్నం తినిపించేసి బయటికి తోసేసేది. అదే బ్రేక్‌ఫాస్ట్. వీధిలో పిల్లలతో ఆడినంతసేపు ఉత్సాహంగా ఉంటారని, దాని ఉపయోగాలు, పోషకవిలువల గురించి పాఠం చెబుతూండేది. లేకపోతే అంతమందికీ ఇడ్డెన్లూ, దోశలంటూ కూర్చుంటే బట్టలుతకడాలు, అంట్లపనీ, వంటపనీ అయ్యేనా? 

ఇక పెసరావకాయ, మెంతావకాయ, పులిహోరావకాయ అంటూ రకరకాలుగా దశాలంకరణలు చేసినా మెగాస్టార్ మాత్రం ఒరిజినల్ ఆవకాయే! 

చిన్నతనంలో మనం ఉండే మధ్యతరగతి ఇళ్లలో పెళ్లిమాటలైనా, రహస్యాలైనా అన్నీ పిల్లల ఎదురుగానే నడుస్తూ ఉండేవి. అలానే ఊరగాయలు, ఉపవాసాలూ కూడా మనకు ఎలా, ఎప్పుడు, ఎందుకు అనేది బాల్యంనుంచీ తెలుస్తూనే ఉండేవి. ఈ విజ్ఞానానికి అదే కారణం. చదువులదేం ఉంది, తిన్నగా బడికెళితే వంటపడుతుంది. కానీ ఇలా కారాలు, మమకారాలు తెలియాలంటే మాత్రం జీవితాన్ని చదవాలి.

అదృష్టవశాత్తూ తనుకూడా నాలాగే అటువంటి ఒళ్లోనే పెరిగి, అలాంటి బళ్లోనే చదివొచ్చిన ఇల్లాలు. ఇన్నేళ్ల కాపురంలో నేను కోసే కోతల గురించి (నే చెప్పేది మావిడికాయ గురించి) బానే తెలుసుకుంది. అందుకే ఈ ఆవకాయల సీజన్లో ఎప్పుడైనా అలా నోట్లో పెన్నో, కలర్‌నోట్‌లో వేలో పెట్టుకుని ఆలోచిస్తుండగా తనొచ్చి పిలుస్తుంది.

‘ఆల్చిప్పల్లాంటి కళ్లతో...’ అని ఓ రెండు లైన్లు రాయగానే రెండు ఆల్చిప్పలు నాముందు పడేసి మాగాయకి తొక్కు తియ్యమంటుంది. నేనేమో వినయవిధేయరాముళ్లా కూర్చుని చెప్పిన పనల్లా చేస్తోంటే తను టీవీనైన్ వాళ్లలా స్టింగ్ ఆపరేషనొకటి నిర్వహిస్తూ ఫొటోలు, వీడియోలు తీసేసి, వాటన్నిటినీ ‘అరాచక కుటుంబ సమూహం’ అనే వాట్సప్ గ్రూపులో పెట్టేస్తుంది.

‘ఓమూల అమ్మాయి ఉద్యోగం చేస్తోందికదా, ఇంకా ఈ చాదస్తాలేవిఁటి డాక్టర్ గారూ, కాస్త కాస్త ఏ ప్రియా పచ్చళ్లో కొనితెచ్చేసుకుని నాలిక్కి రాసుకోకా?’ అని మీరడగొచ్చు. తనకి నచ్చవు. ఇవేకాదు. దీపావళికి మతాబాలూ అంతే. కూర్చుని కూరతాం ఇప్పటికీ. అది నా సంతోషం. 

ఈ ఆవకాయనేది ఒక్కోసారి ఒక్కో రుచితో మనల్ని అలరిస్తుంది. చద్దన్నంతో తింటోంటే పల్లెటూళ్లో పొలంగట్టుమీద కూర్చున్నట్టనిపిస్తుంది. వేడివేడన్నంలో వెల్లుల్లావకాయ కలిపి తింటోంటే వెంకటేశ్వరస్వామి ఎదురుగా కూర్చున్నట్టనిపిస్తుంది. ఆ క్షణం ఎన్ని జన్మలైనా మనిషిగానే, అదికూడా తెలుగువాడిగానే పుట్టించమని ఆయన్ని వేడుకోవాలనిపిస్తుంది.

ఆవకాయ కలిపిన రోజున ఇంకా ఆ ఘాటదీ పూర్తిగా దిగకముందే ఓ నాలుగుముద్దలన్నం కలుపుకుని తినిచూడండి. కొత్తపుస్తకం అట్టవాసనలా మర్చిపోలేని మధురానుభూతి కలుగుతుంది. చిరుచేదుతో ఆవపిండి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. మర్నాటికల్లా అది తన ఉనికిని మర్చిపోయి మావిడికాయతో తల్లీబిడ్డా న్యాయంగా కలిసిపోతుంది. 

ఎంత సంపాదించినా చివరిదశకి కొంత మిగుల్చుకోవాలని చిన్నప్పటి నుంచీ పొదుపూ అదుపూ నేర్పారు మనందరికీ. మనమంతా ఏం మిగుల్చుకోకపోయినా ఆవకాయన్నం తిన్న తరవాత ఓరెండు బద్దల్ని పెరుగన్నంలోకి మాత్రం మిగుల్చుకోవాలి. లేకపోతే ఆ అసంతృప్తి రోజంతా వెంటాడుతుంది. ఇది నిజం.

హొటళ్లలో వెనిగార్ ఆవకాయలవీ తిని అణగారిన ఆశలతో బతుకు జట్కాబండిని లాగే కుర్రాళ్లంతా నామాట విని త్వరగా పెళ్లిళ్లు చేసుకోండి.

కొత్తావకాయ, కొత్తకాపురం బావుంటాయి.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

Friday, 14 April 2023

అనారోగ్యం - అరటిదూట (19-Apr-23, Enlightenment Story)

 *అనారోగ్యం - అరటిదూట*  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️ 

*ఒక భక్తురాలికి ఆమె కొడుకు తప్ప వేరే ఆధారం లేదు*

ఆ అబ్బాయికి ఏదో చర్మవ్యాధి వచ్చి వేగంగా శరీరమంతా వ్యాపించి బాధిస్తోంది. వొళ్ళంతా చాలా దురదగా ఉంటుంది ఆ అబ్బాయికి.  బాధ తట్టుకోలేక గోకితే చర్మం పగిలి తీవ్ర రక్తస్రావమయ్యి, పెద్ద పుండు పడేది. ఆ మాతృహృదయం పిల్లవాడి బాధను చూడలేకపొయింది. పరమాచార్య స్వామి దగ్గరకు వచ్చి తన కష్టాలని చెప్పుకుంది. 

*మీ అనుగ్రహం వల్లనే నా కొడుకు వ్యాధి నయం అవ్వాలి పెరియవ. నేను మందుల ఖర్చు కూడా భరించలేని స్థితిలో ఉన్నాను. మీరు తప్ప నాకు దిక్కు లేదు* అని వేడుకుంది. 

మహాస్వామివారు ఆమెను ఆమె కొడుకుని మఠంలోనే ఉండమని చెప్పారు.  ఆ పిల్లవాడితో, *నేను భిక్ష చేసాక మిగిలినది తప్ప నువ్వు ఏమీ తినకు, తాగకు - కాఫీ, టీ, పాలు కూడా ఏమీ తీసుకోకూడదు* అని ఆజ్ఞాపించారు. ఆ తల్లి చాలా సంతోషంతో గురు ఆదేశాన్ని పాటించడానికి అంగీకరించింది.

స్వామివారు శ్రీమఠం వంట బృందానికి కొన్ని సూచనలు ఇచ్చి, తాను మరలా చెప్పేదాకా వాటిని పాటించవలసిందిగా సూచించారు. స్వామివారు కేవలం అరటిచెట్టు యొక్క దూట లోపలి భాగాన్ని మాత్రమే భిక్షగా స్వీకరించేవారు. వంటవాడు అరటి దూటను ముక్కలుగా తరిగి కొంచెం ఉప్పువేసి ముక్కల్ని ఉడికించేవాడు. మహాస్వామి వారు దాన్ని భిక్షగా స్వీకరించి కొద్దిగా మజ్జిగను త్రాగేవారు.  స్వామివారు తినగా మిగిలిన అరటి దూట పదార్థాన్ని, మజ్జిగని ఆ పిల్లవాడికి పెట్టేవారు. 

మొదట్లో అతనికి ఈ భోజనం సహించేది కాదు. కాని తనకి గురూచ్చిష్టం తినే భాగ్యం కలిగింది అని గ్రహించి ఆనందంగా పెట్టింది తినేవాడు. ఒక 10 రోజులయ్యాక దురద మరియు చర్మం పైన ఉన్న మచ్చలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టసాగాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాధి తగ్గి చర్మం తేటపడి ఆరోగ్యంగా తయారౌతోంది. మండలం రోజులయ్యేసరికి అతని చర్మ వ్యాధి పూర్తిగా నయమయ్యి ఆ పిల్లవాడు కొత్త తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపించాడు. 

ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. 

*నా కొడుకు అదృష్టాన్ని ఏమని చెప్పగలను. పూర్వ జన్మ పాప కర్మ వలన ఈ చర్మ వ్యాధి వచ్చింది అని అనుకున్నాను. కాని, పూర్వ జన్మ పుణ్య ఫలం వల్లనే ఈ వ్యాధి వచ్చింది. ఎందుకంటే మండలం రోజుల పాటు ప్రతి రోజూ పరమాచార్య స్వామి ఉచ్చిష్ఠం తినే భాగ్యం ఎవరికి కలుగుతుంది* అని ఆ తల్లి ఆనందపడింది.

"ఇది కేవలం అరటిదూట లోని ఔషధ గుణాల వలన మాత్రమే తగ్గింది" అని మహాస్వామివారు అన్నారు. 

"అరటి దూట ఔషధం అతని బాధను నివారించడానికి ఒక నెపం మాత్రమే. కేవలం మీ ఉచ్చిష్టాన్ని భుజించడం వల్లనే అది తగ్గింది" అని ఆ తల్లి పరిపూర్ణ కృతఙ్ఞతా భావంతో స్వామికి నమస్కరించింది.

||అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం||

||శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

Wednesday, 12 April 2023

పోతన భాగవతంలోని నవమస్కంధం (18-Apr-23, Enlightenment Story)

🥀 పోతన భాగవతం లోని నవమ స్కంధం🥀

🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

పూర్వం చంద్ర వంశం లో గాధి అనే క్షత్రియుడు ఉండేవాడు. ఈ దంపతులకు మగ సంతానం కలగాలనే ఆకాంక్ష ఉంది. కానీ ఇతనికి సత్యవతి అనే కూతురు మాత్రమే జన్మించింది. ఈమెను ఋచీకుడు అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు గాధి.   గాధి కి మగ సంతానం కలగాలనే ఆకాంక్ష తో తన అల్లుడు బ్రాహ్మణుడు అయిన కారణంగా ఆయనతో యజ్ఞాలు జరిపించాలని పూనుకొని ఋచీకుడి తో విషయం చెప్పాడు. ఋచీకుడు తన మామ చెప్పిన మాటలు విని తన భార్య అయిన సత్యవతి కోసం బ్రాహ్మణ మంత్రాలతో, తన మామ అయిన గాధి కోసం క్షత్రియ మంత్రాలతో యజ్ఞాలను విడివిడి గా నిర్వహించి, యజ్ఞ ఫలాలను తయారు చేశాడు.

ఋచీకుడు యజ్ఞాలు పూర్తి చేసి చరువులను (యజ్ఞ ఫలాలను) తన భార్య సత్యవతికి బ్రాహ్మణ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, తన అత్త అయిన గాధి భార్య కు క్షత్రియ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, విడివిడిగా ఇచ్చి స్నానానికి వెళ్ళిపోతాడు.  గాధి భార్య కొంత దుర్బుద్ధి తో ఆలోచించి ఇలా అనుకుంది "ఋచీకుడు తన భార్య కు మంచి లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం జరిపించి మంచి ఫలాన్ని తన భార్యకు, మామూలు లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం గావించి ఆ ఫలాన్ని నాకు ఇచ్చి ఉంటాడు. ఎలాగైనా ఈ యజ్ఞ ఫలాలను తారు మారు చేయాలి" అనుకుంది. తన కూతురు అయిన సత్యవతిని ఒప్పిస్తుంది. సత్యవతి కూడా విషయం తెలియక ఒప్పుకుని తన ఫలాన్ని తన తల్లి కి మరియు తన తల్లి ఫలాన్ని తానూ తారు మారు చేసుకుని సేవిస్తారు.

స్నానం చేసుకుని తిరిగివచ్చిన ఋచీకుడు జరిగిన విషయం తెలుసుకొని తన భార్య కు ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు. ఇలా జరిగినందుకు నీకు (అంటే ఋచీకుడు మరియు సత్యవతీ దంపతులకు) క్షత్రియ లక్షణాలు కలిగిన బాలుడు, మీ అమ్మ (గాధి దంపతులకు) కు బ్రాహణ లక్షణాలు కలిగిన బాలుడు జన్మిస్తాడు అని ఋచీకుడు తెలియజేస్తాడు. ఋచీకుడు, సత్యవతి కోరిక మేరకు జరిగిన తప్పు ను మన్నించి పుట్టబోయే సంతానం లో కొంత మార్పు చేస్తాడు. తమకు (సత్యవతి, ఋచీకుల దంపతులకు) కొడుకు గా కాకుండా మనుమడు గా క్షత్రియ లక్షణాలు గల బాలుడు జన్మిస్తాడు అని చెబుతాడు.  తద్వారా గాధి దంపతులకు జన్మించిన బాలుడు విశ్వామిత్రుడుగా, సత్యవతి - ఋచీకుల దంపతులకు జన్మించిన బాలుడు జమదగ్ని మహర్షి గా ఎదుగుతారు. ఈ జమదగ్ని మహర్షి కుమారుడే పరశురాముడు.

ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే.ఈ మధ్య కాలం లో కులాల పేరుతో చాలా గొడవలు, హత్యలు జరుగుతున్నాయి కానీ వారికి కులం అనేది పుట్టుకతో వచ్చింది కాదు వృత్తి ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అనే విషయం తెలియదు. ఇటువంటి కథలు చదివినపుడు మాత్రమే అసలైన విషయం తెలుసుకుంటారు

పూర్వం సూర్య వంశం లో శ్రాద్ధ దేవుడు - శ్రద్ధ అనే దంపతులకు దృష్టుడు, దిష్టుడు అనే కుమారులు ఉన్నారు. వీరిలో దృష్టుడు పేరుతో దార్జ వంశం అవతరించింది. ఈ దృష్టుడు పుట్టుకతో క్షత్రియుడు. కానీ, ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి బ్రాహ్మణుడి గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే దిష్టుడు కూడా పుట్టుకతో క్షత్రియుడు. కానీ, ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి వైష్యుడి గా పేరు గాంచాడు.

ముగింపు: విశ్వామిత్రుడు, పరశురాముడు, ధృష్టుడు,దిష్టిడు మొదలైన వారి కులాలు పుట్టుకతో నిర్ణయించబడలేదు. వారి వృత్తి ధర్మాన్ని బట్టి వారి కుల నిర్ణయం జరిగింది. 

అంటే ఉదాహరణకు 

బ్రాహ్మణ కులం లో జన్మించిన వ్యక్తి వ్యాపారాలు చేసినట్లైతే వైశ్యుడు గా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేస్తే క్షత్రియుడు గా, సేవా కార్యక్రమాలు చేస్తే శూద్రుడు గా పరిగణించవచ్చు. అలాగే శూద్రులు కూడా వేదాలు పఠించడం, పాఠాలు చెప్పడం వంటివి చేసినపుడు బ్రాహ్మణుడు గా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేసినపుడు క్షత్రియుడు గా, వ్యాపారాలు చేసినపుడు వైశ్యుడు గా పరిగణించాలి. ఇదే నియమం క్షత్రియులకు మరియు వైశ్యులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించినపుడు కులాల పేరుతో జరిగే గొడవలను మనం ఆపగలము.

గమనిక: పై రెండు కథలు పోతన భాగవతం లోని నవమ స్కంధం లోనివి.

⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ 
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

Monday, 10 April 2023

రుద్ర పశుపతి (17-Apr-23, Enlightenment Story)

 రుద్ర పశుపతి

⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

రుద్ర పశుపతి అనే వ్యక్తి గొప్ప శివ భక్తుడు.ఇతను శివుడి పై ఉండే భక్తి వల్ల ప్రతి రోజు శివాలయానికి వెళ్లి అక్కడ పురాణాలు, శివుని కథలు వినేవాడు. ఎవరు ఏ కథ చెప్పిన దానిని నిజమేనని భావించి నమ్మేవాడు.


అదే విధంగా ఒకరోజు శివాలయంలో హరికథా కాలక్షేపం జరుగుతోంది. ఈ హరికథలో భాగంగా క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు సేవించినట్లు అది శివుడి కంఠంలోనే ఉండిపోవడం వల్ల శివునికి నీలకంఠేశ్వరడు అనే పేరు వచ్చినట్లు చెపుతున్నారు.

నిజమేనని భావించి అయ్యో ఇంత మంది ఉండగా ఆ విషాన్ని శివుడికి ఎందుకు ఇచ్చారు.పాపం శివుడు ఆ విషాన్ని కంఠంలో ఉంచుకొని ఎంత బాధ పడుతున్నాడో కదా అంటూ వేగంగా శివాలయంకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్వామి దగ్గరకు వెళ్లి నువ్వు విషం మింగావట కదా అలా ఎందుకు మింగావు వెంటనే ఆ విషం ఉమ్మెయ్యి అంటూ శివుడిపై మారాం చేస్తున్నాడు.

ఎంతసేపటికి స్వామి వారు విషం ఉమ్మక పోవడంతో ఒక పదునైన కత్తిని తీసుకుని తన మెడ దగ్గర పెట్టుకొని స్వామి వారిని బెదిరించి సాగాడు. నువ్వు విషం బయట పడేస్తావా లేకపోతే నా కంఠాన్ని ఈ కత్తితో నరికేసుకుంటానంటూ స్వామివారిని బెదిరించసాగాడు.

ఆ అమాయక భక్తుడిని చూసిన శివుడు నిజంగానే అన్నంత పని చేస్తాడని భావించి అతని భక్తికి ప్రత్యక్షమైన ఆ పరమశివుడు తన భక్తుడిని తనలో ఐక్యం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.

పరమేశ్వరునే తన భక్తి తో బెదిరించిన పరమభక్తాగ్రేసరుడు రుద్రపశుపతి నాయనరు

హర హర మహాదేవ🔱

శ్రీనాధ సార్వ భౌముడు స్వామి భక్త సులభుడు అని ఈ విధముగా వర్ణించాడు.  శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు కామధేనువతడింట గాడి పసర మల్ల సురశాఖి వానింట మల్లేచెట్టు. అంటే శివుని శిరస్సుపైన కాసిన్ని నీళ్ళు జల్లి, కాస్తంత పత్రిని వేసినంత మాత్రానికే , ఆ భక్తుని ఇంట కామధేనువు గాట కట్టిన పశువు అవుతుందట. అలాగే దేవతా వృక్షము అయిన కల్ప తరువు ఆ భక్తుడి ఇంట మల్లే చెట్టు అవుతుందట!

అంతటి బోళా శంకరుడు శివయ్య...🔱

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

ప్రకృతి ధర్మము (16-Apr-23, Enlightenment Story)

 🥀 ప్రకృతి ధర్మము 🥀

✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.

⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

ఒకానొకపట్టణమునకు దూరమున గల వనప్రదేశమందు ఒక తపస్వి కుటీరాన్ని నిర్మించుకొని ధ్యానాదికార్యములను ఒనర్చుకొనుచుండెను. ఏకాంత స్థలమగుటవలనను, విక్షేపజనకములైన పరిస్థితులెవ్వియు లేకుండుటచేతను ఆ తపస్వి తన ధ్యానానుష్ఠానములను నిరాటంకముగ కొనసాగించుకొనుచు, ఆనందముగ జీవితమును కొనసాగించుచుండెను.

ఒకనాడు మిట్టమధ్యాహ్నము ఒక రాజకుమారుడు అరణ్యములలో సంచారము సల్పుచు, దప్పికగొని నీరు త్రాగుటకై ఆ తపస్వి కుటీరమునకు వచ్చెను. తాపసి రాకుమారునికి దాహోదకమును ఒసంగి ఉపశాంతిని కలుగజేసెను. అనంతరము అతనితో ఆ తపస్వి “మీరెవరు? ఎచటినుండి వచ్చుచున్నారు?" అని అడిగెను.

అందులకు ఆతడిట్లు ప్రత్యుత్తరమొసంగెను, “మహాత్మా! నేనొక రాజకుమారుడను. మా తండ్రి ఈ సమీప ప్రాంతమునకంతటికిని మహారాజు. మాది జితేంద్రియ వంశము. నా పేరు జితేంద్రియకుమార్. మా తండ్రి పేరు జితేంద్రియ మహారాజ్, మా తల్లి పేరు జితేంద్రియ రాణి. నా ధర్మపత్ని పేరు జితేంద్రియదేవి"

రాజకుమారుని ఆ వాక్యములను వినగనే తపస్వికి ఆశ్చర్యము కలిగి, వారి వంశీయులు వాస్తవముగ జితేంద్రియులా! లేక నేతిబీరకాయవలె పేరుకు మాత్రము గొప్పగా అట్లు చెప్పుకొనుచున్నారా! పరీక్షింపవలెను అను ఉద్దేశ్యముతో రాజకుమారుని తన కుటీరమందే కొంత తడవు ఉండులాగున చెప్పి తాను హుటాహుటిగ రాజప్రాసాదమునకు పయనమైపోయెను.

రాజును సమీపించి అతనితో ఇట్లనెను -"ఓ భూసురో త్తమా! నీకు ఒక్కడే కుమారుడు. అతడు భీకరారణ్యములో సంచరించుచున్నాడు. ఒకవేళ జంతువులచే అతనికేదైన ప్రమాదము వాటిల్లి అకస్మాత్తుగ దేహవియోగమైనచో మీరేమి చేయుదురు?"

ఆ వాక్యములను విని నృపాలుడు ఏమాత్రము ఆవేదనపడక తపస్వితో గంభీరముగ ఇట్లు పలికెను - 

"ఓ తాపసోత్తమా! విధివిలాసమును ఎవరు తప్పించగలరు? పుట్టినప్పటినుండి మృత్యువు జీవుని వెంబడించుచునే యుండును. ఈనాడో, రేపో లేక కొన్ని వత్సరములో ఏనాడైనను పుట్టిన ప్రాణి చావక మానదు.

మృత్యుర్జన్మనతాం వీర దేహేన సహజాయతే|

అద్యవా౬బ్దశతాన్తేషు మృత్యుర్వై ప్రాణినాం ధ్రువమ్||

"జన్మించువారికి మృత్యువు వెనువెంటనే యుండును. ఎప్పటికైనను జీవునకు మరణము ఖాయము. ఇందు దిగులుపొందవలసినది ఏమియునులేదు. బ్రతకిన నాలుగు రోజులు భగవంతుని స్మరించుచు పుణ్యము నార్జించుటయే జీవుని యొక్క కర్తవ్యము!"

భూపాలుని ఆ విజ్ఞతాపూర్వక వచనములను విని తాపసుడు లోలోన సంతసించి, రాణి వద్దకు వెళ్లి,  "అమ్మా!నీ కుమారుడు ప్రమాదవశాత్తు ఎపుడైన మరణించినచో ఏమిచేయుదువు?" అని ప్రశ్నింపగా,  ఆమె జంకు గొంకు లేకుండ ఈ ప్రకారము పలికెను

"జాతస్య హి ధ్రువో మృత్యుర్ద్రువం జన్మమృతస్య చ! 

తస్మాదపరిహార్యే౬ర్ధే న త్వం శోచితు మర్హసి ||

"మహాత్మా పుట్టిన ప్రాణి చావకమానదు. చచ్చిన ప్రాణి కర్మశేషము ఉన్నంతవరకు పుట్టకమానడు. ఇక శోకించుట దేనికి? బ్రతికియున్న నాలుగు రోజులు రామా, కృష్ణా అని భగవన్నామస్మరణ చేయుచు పుణ్యమును సంపాదించు కొనుటయే మానవుని కర్తవ్యము!"

రాణియొక్క మహత్వపూర్ణములగు ఆ తాత్వికవచనములను విని తపస్వి ఆనందభరితుడయ్యెను.

తదుపరి రాజకుమారుని సతీమణి యొద్దకు వెళ్ళి "అమ్మా! నీ పతి అరణ్యములో సంచరించుచున్నాడు. ప్రమాదవశాత్తు అతనికి దేహవియోగమైనచో ఏమిచేతువు?" అని ప్రశ్నింపగా, ఆమె ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

“మహాశయా! తమకు తెలియనిదేమున్నది? ఈ ప్రపంచమున పిపీలికాది బ్రహ్మపర్యంతము గల సమస్తము ఒకానొక మహత్తరశక్తికి లోబడియే పనిచేయుచున్నది. విధిని ఎవరు తప్పించగలరు? బంధువులు, కుటుంబీకులు, మిత్రులు ధర్మసత్రము నందు యాత్రికులవలె కలిసికొని మరల విడిపోవునట్లు కొలదికాలము ఒకచోట కలిసికొని మరల ఎవరిదారిన వారు పోవుచుందురు.

ఏకవృక్ష సమారూఢా నానాజాతి విహంగమా:! ప్రభాతే విదిశో యాన్తి కా తత్రపరిదేవనా॥

"సాయంకాలమున ఒక చెట్టుపై రకరకముల పక్షులన్నియు గుమిగూడి తెల్లవారగనే ఎచటికో ఎగిరిపోవునట్లు ఋణానుబంధముచే జీవులున్ను ఒక కుటుంబమున కలసికొని మరల ఎవరికివారు వేరైపోవుచుందురు. ఇది ప్రకృతి ధర్మము. జగన్నియమము. ఇట శోకింపనేల"

రాజకుమారుని సహధర్మచారిణి యొక్క ఆ విజ్ఞతా పూర్వక వాక్యములను విని తపస్వి లోలోన పరమానందపడుచు, తిరిగి తన కుటీరముయొద్దకు వెళ్లి తన కొఱకై అచట వేచియున్న రాజకుమారునితో,  "నాయనా! మీ రాజ్యముపై శత్రువులెపుడైన దండెత్తి వచ్చి రాజవంశమునంతను చిత్తుగ నాశనమొనర్చివైచినచో నీవేమి చేయుదువు?" అని ప్రశ్నించెను.

అతడే మాత్రము కినుక వహింపక ధైర్యపూర్వకముగ ఇట్లు పలికెను - "తాపసోత్తమా! ఈ ప్రపంచమున ఏది శాశ్వతము? ఇంతరకెందఱు రాజులు రాలేదు! పోలేదు! వారందరూ ఏమైరి? ఎవరైన స్థిరముగనుండగలిగిరా? నదీ ప్రవాహమున కొన్ని కట్టెపుల్లలు ఒక చోట కలిసికొని మరల తరంగముల తాకిడికి వేరైపోవునట్లు ఒక కుటుంబమునగాని, ఒక వంశమున గాని కొందఱు జీవులు కలిసుకొని కొంతకాలము వ్యవహారము సలిపి మరల మృత్యుముఖమున పడి ఎవరిదారినవారు పోవుచున్నారు.

ఇదం కాష్ట మిదం కాష్టం నద్యాం వహతి సంగత:| 

సంయోగాచ్చ వియోగాచ్చ కా తత్ర పరిదేవనా||

కాబట్టి,  వియోగమందు దుఃఖపడనేల? బ్రతికిన కొలది రోజులు జగత్ర్పభువగు పరమాత్మను సేవించి, ధ్యానించి, పవిత్ర జీవితమును గడుపుటయే జీవులకు శరణ్యము"

రాజకుమారుని వాక్యములను విని తపస్వి ఆనంద డోలికలలో ఊగులాడుచు జితేంద్రియవంశమను పేరునకు తగినట్లుగనే కుటుంబసభ్యులందరును గొప్ప ఆధ్యాత్మికానుభూతి కలిగియున్నారని సంతసించి రాజు కుమారుని ఆశీర్వదించి పంపివైచెను.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️


Sunday, 9 April 2023

రెండు నాణేలూ - జారవిడుచుకున్న వజ్రం (15-Apr-23, Enlightenment Story)

 ⚜️🕉️కృష్ణం వందే జగద్గురుం🙏

⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

💥ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్లీ ఆ పేద భక్తుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.

మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు.

నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ భక్తుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని."ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు" అన్నాడు అర్జునుడు శ్రీ కృష్ణుడితో...

"లేదు అర్జునా ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం" అని భక్తుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ భక్తుడు. దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు.

పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ... అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. 

ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది.. దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు.

అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద భక్తుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేల సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ భక్తుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.

ఆ భక్తుడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవడం భక్తుడి దంపతుల వంతయింది.

తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు. కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు.

అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. 

⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

Saturday, 8 April 2023

తిరుమల : మాడ వీధి అంటే ఏమిటి (14-Apr-23, Enlightenment Story)

 తిరుమల : మాడ వీధి అంటే ఏమిటి

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️ 

తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు.తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి 'మాడాం' అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది

ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు

శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.

తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి.వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు




1.తూర్పు మాడ వీధి : ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి. ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న (ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు  ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి. క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.

2.దక్షిణ మాడ వీధి: ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది.దీని పక్కనే-ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట ఈ వీధి మొదట్లో (ఆగ్నేయంలో) 'ఊంజల్ మండపం' ఉంది . ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు. దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది తిరుమల నంబి గుడి తర్వాత 'ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది.

3.పడమర మాడ వీధి: ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు) కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.

4.ఉత్తర మాడ వీధి: ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి 'అచ్యుతరాయ కోనేరు' అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు. ఏది ఏమైనా పుష్కరిణిగానే ప్రసిద్ధి గాంచింది. ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహెబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయిస్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది. తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి

తరిగొండ బృందావనం - ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది. ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు. ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి.వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు.

ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు.

 తిరుమాడ ప్రదక్షిణ ప్రియ గోవిందా.. మహా ప్రదక్షిణ ప్రియ గోవిందా.. ఆనంద నిలయ వాసా గోవిందా ...!గోవిందా...!

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...