Wednesday, 7 December 2022

రెండు ఇడ్లిలు ( 08-Dec-22,Enlightenment Story)

 08-Dec-22,Enlightenment Story

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

రెండు ఇడ్లిలు

వేదవతి  ప్రతిరోజు  తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లిలు పెడుతూ  వచ్చేది ఆకలితో ఉన్నవాళ్లు  ఎవరైనా  తింటారు అని ఆ దారివెంట  వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లిలు తీసుకోవడం ఏదో  చిన్నగా  గొణుక్కుంటూ  వెళ్లడం  జరిగేది. ఒకరోజు వేదవతి గోడ  పక్కనే  నిలబడి  అతను  ఏమి అంటున్నాడో  వినాలని  అనుకున్నది.

అతను చెప్తున్న మాటలు నువ్వు చేసిన  పాపం నీ దగ్గరే ఉంటుంది. నువ్వు చేసే పుణ్యం  వచ్చి నిన్నే  చేరుతుంది. ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు  

రోజు ఇడ్లి  పెడుతున్నాను తీసుకు  పోతున్నాడు. నువ్వు మహాలక్ష్మివి  చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కక పొయినా పర్లేదు.ఇడ్లిలు బావున్నాయని  చెప్పకపోయినా  పర్లేదు. ధన్యవాదాలు అమ్మ అని చెప్పడం  కూడా  తెలియలేదా  ఇతనికి ఏదో ఆ చెత్త వాగుడు  వాగిపోతున్నాడు  అని చాల కోపంతో  రగిలిపోయింది  అయినా ఇడ్లిలు పెట్టడం మరిచిపోలేదు. రోజురోజుకి అతనిపై  పెరుగుతున్న  కోపం  అతనిని  చంపేయాలి  అనేంతగా  మారిపోయింది  

*ఒకరోజు ఆ ఇడ్లిలపై  కాస్త విషం  చల్లి పెట్టబోయింది.కానీ మనసు ఒప్పుకోలేదు చేతులు వణకడం  మొదలెట్టింది ఆలోచన మొదలయింది. చ వద్దు  అతను అలాఉంటే  నేను ఎందుకు  ఇలా మారిపోయాను  అని ఆ ఇడ్లిలు పడేసి  మంచి ఇడ్లిలు పెట్టింది.*

ఆ వ్యక్తి  ఇడ్లిలు తీసుకుని  మళ్ళీ అవే మాటలు చెప్తూ  వెళ్ళాడు కొట్టాలన్న కోపం  వచ్చినా తనను  తాను  సమాధాన  పరుచుకుంది . ఆ రోజు మిట్ట మధ్యాహానం  ఎవరో తలుపు కొట్టినట్టు   ఉంటె వెళ్లి  తలుపు తీసింది ఎదురుగా మురికి  బట్టలతో ఓ యువకుడు అతను ఎవరో కాదు సొంతంగా ఉద్యోగం  చేసుకుంటానని ఇల్లు వదిలి  అలిగి  వెళ్లిన తన కొడుకు అమ్మా ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించేసారు చేతిలో చిల్లి గవ్వ లేదు బాగా ఆకలి కళ్ళు తిరిగి పడిపోయాను ఎవరో ఓ ముసలాయన రెండు ఇడ్లిలు ఇచ్చి  నా ఆకలి తీర్చాడు  నా ప్రాణాలు  కాపాడాడు  అని చెప్పాడు  


*ఆ మాటలు వినగానే  ఆమెకు  వణుకు  పుట్టేసింది. విషం కలిపిన ఇడ్లిలు పెట్టుంటే నా కొడుకుకి  నేనే  యముడినై  ఉండిఉంటానే  అని కంటతడి  పెట్టుకుంది*. ఇప్పుడు ఆమెకు  ఆ ముసలాయన మాటలు అర్థం  అయింది. *నువ్వు చేసిన పాపం నీతోనే  ఉంటుంది. నువ్వు చేసే మంచి నిన్ను  వెతుకుని  వచ్చి చేరుతుంది*

అందరికి అన్ని అర్థం అవ్వవు. అర్థం అయ్యేంతవరకు  ఎవరూ  ఎదురుచూడము. చేసిన ధర్మం  ఎప్పుడూ   ఏదో ఒక రూపంలో  మనకు  వచ్చిచేరుతుంది. ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి

మనం తెలియక చేసే తప్పులనుండి  బయట పడే  మార్గం  మంచి చేయడం మాత్రమే

🌹🌹🙏🏻ధర్మో రక్షతి రక్షితః🙏🏻🌹🌹

🌹🙏🏻 కృష్ణం వందేజగద్గురుమ్ 🙏🏻🌹

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂 🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Tuesday, 6 December 2022

శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? ( 07-Dec-22,Enlightenment Story)

 07-Dec-22,Enlightenment Story

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏

సాధారణంగా శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అధ్బుతమైన కధ ఉంది.

ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. 'రామస్య ఈశ్వరః' అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం (శివుడే గొప్పవాడని) చెబుతుంది. శివ ధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. విషయం చెప్పారు, మీరు, ఇంకా శివుడిలో ఎవరు గొప్పా అని అడిగారు. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది, రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి, నాకంటే శివుడే గొప్పవడు అని అన్నాడు విష్ణువు.

ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి, తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహాఇంచడానికి ఏముంది? రాముడె ఈశ్వరుడుగా గలవాడు (రాముడు (విష్ణువు) తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్ప అని) అన్నాడు.

వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని, దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు "రామేశ్వరుడంటే రాముడొకడూ, ఈశ్వరుడొకడు అని అర్దం కాదయ్య, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారు.

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||

అసలు వీళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు.

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే | శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||

శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే, వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది.

శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.

కాశీ లో ఉన్నది విశ్వనాదుడు, పూరిలో ఉన్నది జగన్నాధుడు విశ్వం అన్నా జగం అన్నా ఒక్కటే, చిదంబరం లో ఉన్నది నటరాజ, శ్రీ రంగంలో ఉన్నది రంగరాజు (రంగనాధుడు) నటనాస్థలమన్నా, రంగస్థలమన్నా ఒక్కటే, ఈ ప్రపంచమే ఒక రంగస్థలం దీనిని ఆడించే రాజు ఒక్కడే,  కాట్మాండులో ఉన్నది పశుపతి నాధుడు, ద్వారాకలో ఉన్నది గోవులు కాసే పరమాత్మ శ్రీ కృష్ణుడు,  అజ్ఞానంలో ఉన్న ప్రతి జీవీ పశువే అందుచేత మనందరినీ కాచేవాడైన పరమాత్మ ఒక్కడే!!

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏

Monday, 5 December 2022

పిచ్చుక మూడు నీతి సూక్తులు ( 06-Dec-22, Enlightenment Story)

 06-Dec-22, Enlightenment Story

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

🌹పిచ్చుక మూడు నీతి సూక్తులు🌹

అనగనగా ఒక రోజు ఒక వేట గాడి చేతికి ఒక చిన్న పక్షి(పిచ్చుక) దొరికింది . అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది. "అయ్యా నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను వేటాడి ఉంటావు, నా లాంటి అల్ప ప్రాణిని చంపటం వల్ల నీకేమి ఉపయోగం? నీ పిడికిలి పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగూ తీరదు. దయచేసి నాకు ప్రాణ బిక్ష పెట్టి నన్ను వదిలి వేయి.

అందుకు ప్రతి ఫలంగా నేను నీకు అమూల్యమయిన మూడు నీతి సూక్తులు చెప్తాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నీవు సంతోషం గా సుఖంగా జీవించడానికి  ఎంతగానో  ఉపయోగపడతాయి."అది విన్న వేటగాడు క్షణం అలోచించి, నిజమే ఈ పిచ్చుకని చంపటం వల్ల ఉపయోగము లేదు అనుకుని, "సరే వదిలివేస్తాను     ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు" అన్నాడు.

అప్పుడు  ఆ పిచ్చుక, "అయ్యా కానీ నాది ఒక షరతు, నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను, రెండవది నీ ఇంటి పైకప్పు పై కూచుని చెప్తాను, ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూచుని చెప్తాను అంది."   వేటగాడు సరే అని ఒప్పుకుంటాడు. 

పిచ్చుక వేటగాడి చేతిలో కూచుని మొదటి నీతి సూక్తి ఇలా చెప్తుంది ...

1) ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి(తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు. అని చెప్పి, వేటగాడి చేతి లో నుండి ఎగిరి వెళ్లి ఇంటి పైకప్పు పై కూచుంటుంది.

అక్కడ నుండి ఫక్కున నవ్వి అంటుంది  "ఓరి మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకున్నావు, నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువయిన వజ్రం ఉంది, అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలివేసావు ."అది విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలచుకుని ఏడవటం మొదలుపెడతాడు. అయ్యో అంత విలువయిన బరువయిన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడిని నేను అని గట్టి గట్టిగా ఏడవటం మొదలుపెడతాడు. అప్పడు  పిచ్చుక అంది, ఓరీ నీవు నిజంగానే మూర్ఖుడివి, నేను ఇంతకు ముందే నీకు చెప్పాను

"ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు."నీ పిడికిలి అంత కూడా లేని నేను, నా కడుపులో బరువయిన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా, 

రెండవ నీతి సూక్తి ఏమిటంటే

2) ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి అలోచించి చింతించకూడదు బాధ పడకూడదు. అని చెప్పి ఎగిరి వెళ్లి చెట్టు కొమ్మ పై కూచుంది. వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు. "లేదు, నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేసావు."

పిచ్చుక వేటగాడిని చూస్తూ అలా కూచుని ఉంది.కాసేపటికి వేటగాడు తేరుకుని సరే, "ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి అలోచించి చింతించకూడదు బాధ పడకూడదు" అని గుర్తు చేసుకుని,  సరే ఇప్పుడు మూడవ సూక్తి ఏమిటో చెప్పు అంటాడు. అప్పుడు పిచ్చుక, ఎలాగూ నే చెప్పిన మొదటి రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు, 

మూడవది చెప్పటం వల్ల ప్రయోజనం లేదు.

3) నీ మాటలు వినని, అర్థం చేసుకోని వారిపై ఎన్నడూ నీ శక్తినీ, విజ్ఞానాన్ని, సమయాన్ని వృథా చేసుకోవద్దు. అని మూడవ సూక్తి చెప్పి ఎగిరి వెళ్ళిపోతుంది

🍁సర్వేజనాసుఖినోభవంతు 🍁

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

Sunday, 4 December 2022

బతుకుజీవుడా (05-Dec-22, Enlightenment Story)

05-Dec-22, Enlightenment Story

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏 🛕🙏

బతుకుజీవుడా

పూర్వం అవంతీ రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు, విలాసాలలో మునిగి తేలుతూ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు. రాజ్యపాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవటంతో మంత్రి, తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ, ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు.

ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేస్తూ అవంతీ రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి, వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు. చిత్ర మేమిటోగాని ఆరోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోకి తోడ్కొనిపోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగదృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు, రాజా! నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్లటం తధ్యం. ఈరోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడి పోతాయి. అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు. ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును నింపు అని హితబోధ చేశాడు.

ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతివాక్యాలు పలుకుతున్నావు. నాకున్న ఈ రాజ్యం, అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు. నేను ఒక వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు. సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాము లేకపోతే ఈ పాటికే నిన్ను ఊచకోత కోయించేవాళ్లం. కళ్లు నిప్పులు కక్కుతుండగా ఆసాధువును భటులతో బయటకు గెంటివేయించాడు.

కొన్నిరోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్లాడు. ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడి రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడిని ఎలాగైనా పట్టి, బంధించి, తన ఇష్ట సఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి. వెంటనే తన రధాన్ని దాని వైపుకి ఉరికించాడు. ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఒక అందమైన లేడి ఈ హాడావిడికి బెదిరి ముందుకు ఉరికింది. దాని వెనకాల రాజ పరివారమంతా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను, పుట్టలను అతి లాఘువంగా దాటుకొని పరుగెత్తుతున్న ఆ లేడిని ఎలాగైనా బంధించాలన్న కోరిక రాజులో దృఢపడింది. ఎటువెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడి వెనుకే రధాన్ని పరుగెత్తించాడు. ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజపరివారమంతా చెల్లాచెదరయింది. లేడిని పట్టుకోవడమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలిసిపోయిన ఆ గుర్రం మూర్చపోయింది. ఆ గుర్రం నుంచి సింహగుప్తుడుకూడా కిందపడిపోయి తీవ్రమైన గాయాలపాలై స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంగుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహతప్పి ఉన్న సింహగుప్తుని చూసి ఆనందంతో మీదపడి నిలువుదోపిడీ చేశారు. చివరకు రాజు గారి ఒంటిమీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్లి పోయారు. ఇరుగు పొరుగు రాజ్యాలపాలిట సింహ స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్దిసమయం ఉండిపోయాడు. తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు. అవంతీ రాజ్యానికి మహారాజైన తనను, తన పరివారమంతా విడిచివెళ్లారు. విలువైన ఆభరణాలన్నీ క్షణాలలో మాయమై పోయాయి. తాగడానికి మంచినీటి చుక్కయినా లేదు. ఎండతీవ్రత, దాహం, ఆకలి తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆదుకునే నాథుడే లేడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

వెంటనే ఓ భగవంతుడా! ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది. ఇకనుంచి ఈ ధన, కనక, వస్తు, వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితమంతా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడు అని అతి దీనంగా ప్రార్ధించాడు.

ఇంతలో దూరము నుంచి సింహగర్జన వినిపించింది. సింహగుప్తుడి హృదయం భయాందోళనలతో నిండిపోయింది. ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్నామస్మరణ ప్రారంభించాడు. భగవంతుడు రాజు ప్రార్ధన విన్నాడో ఏమో, ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోకి వచ్చింది. బతుకుజీవుడాఅనుకుంటూ సింహగుప్తుడు గుర్రానెక్కి అతివేగంగా ముందుకు ఉరికించాడు. చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకో గలిగాడు. ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి, ప్రజా శ్రేయస్సుకై పాటుపడ సాగాడు.

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏 🛕🛕🙏🛕🙏 🛕

Saturday, 3 December 2022

మనకు ఏది కావాలో మనకు తెలీదు ( 04-Dec-22, Enlightenment Story )

 04-Dec-22, Enlightenment Story

🎯💎🎯💎🎯💎🎯💎🎯💎🎯

ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది. ఆగుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు.. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు భోరున వర్షం కురిసింది. కుంభవృష్టి లా మారింది..

ఆరోజు ఆగుడికి దగ్గర్లోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండడం వలన నిలువడానికి నీడలేక చుట్టూ వెదికితే దగ్గరలో ఈ గుడి కనబడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవికులు పూజించే ఆదుంగని కొట్టబోయాడు. వెంటనే "ఒరేయ్ నన్ను కొట్టకు అంది,అందులో ఉన్న అమ్మ.. వీడికి దేవుడు దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక "ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది? రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో..

అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని.. నన్ను కొట్టకు అనగానే! ఐతే నిన్ను కొట్టకపోతే నాకడుపు సంగతి ఏంటి? అంటే! ఇదిగో నీకు వంద బంగారు నాణేలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళి పోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా! గొడ్డలితో కొట్టబోయే ఆబోయవాడిని కనికరించిందా! అని,పూజారి ఆ  గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో, పూజారి కళ్ళు పోయాయి. చూపు పోయింది.

అమ్మా! ఎంత అపచారం చేశాను! తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై "వాడు అజ్ఞాని. దేవుడంటే ఏమిటో తెలియదు. నన్ను చూసి ఒట్టి కట్టెముక్క అనుకోని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి. నిత్యం నన్ను పూజిస్తున్నావు. అజ్ఞాని నరకబోగా కనికరించాను అని, నువ్వుఅనుకొని నువ్వు కూడా అదేపని చేయబోయావు. ఏమితెలియని అజ్ఞాని చేసిన పని అన్ని తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి.. అనగానే అమ్మా! క్షమించు. మరొక సారి ఇలాంటి పొరబాటు చేయను. దయచేసి చూపు ప్రసాదించు, అని పలుమార్లు పూజారి వేడుకొనగా, అమ్మ  కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరబాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళు,వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే, ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి..

బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి "జరిగింది చెప్పి ఇదిగో 100 బంగారు నాణేలు" అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశపుట్టి నాకు ఒడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణేలు చూసి "నాన్నా! అవి నాకు ఇవ్వు. నేను జూదమాడాలి.బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకెళ్లిపోయారు.. అకారణంగా వచ్చిన సంపద ఆకారణంగానే పోయింది. ఆసంపదతో పాటు ప్రాణాలు కూడ పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్లి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు.

మనకు ఏది కావాలో మనకు తెలీదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చేవరకు వేచి చూడాల్సిందే.. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. 

దైవానికి ఎవరిమీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతిపనికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి. బంగారాన్ని పుటం పెట్టిన తరువాత ఎంత అద్బుతంగా తయారవుతుందో చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యేవరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది అప్పుడు ఎంచక్క

ప్రతి క్షణం ఒకే స్థితి..ఆనందమే ఆనందం..ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు.  

శుభోదయం🙏💐💐💐

🎯💎🎯💎🎯💎🎯💎🎯💎🎯

Friday, 2 December 2022

కర్మ సిధ్ధాంతం (03-Dec-22, Enlightenment Story)

కర్మ సిధ్ధాంతం

💥💥💥💥💥💥💥💥💥💥

మనం అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమని ఆదేశియస్తే, వెంటనే సామను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము. ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము. అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే,ఎన్నేళ్లు ఉంటామో అన్నేళ్ళు ఉంటాము.  ఋణం తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు బడుతుంది. అప్పడు అది, తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని, వెళుతుంది.

అవే సంచితకర్మలు.ప్రారబ్ధ కర్మలు - అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు. ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఈ కర్మలు అయితే పక్వానికి వస్తాయో,లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలోఅనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ. 

ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది.  ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసిందే. ప్రారబ్ధం తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.

ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు, బంధవులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆయ వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము.  

ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి ఖర్చయుపోగా , జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయి.  ఈ  మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభవించడాన ికి సిద్ధమవుతాయో, అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. ఈ చక్రం ఇలానే  కొనసాగుతుంది* . 

అందుకే ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో

పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం  అని అన్నారు.

మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లుగర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు  ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధంఅంటాము ,  అంటే ఇదే. 

మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము.  అలాగే పాపం పండింది అనేమాట కూడా ఉపయోగిస్తాము. పాపం పండడమేంటి? అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోంది. ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే. విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు. అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


ప్రతీది కాలం నిర్ణయిస్తుంది ( 02-Dec-22, Enlightenment Story)

ప్రతీది కాలం నిర్ణయిస్తుంది

🎯💎🎯💎🎯💎🎯💎🎯💎🎯

*ప్రతీది కాలం నిర్ణయిస్తుంది. కష్టాలు కష్టాలు అని మనం తెగ బాధపడతాం. కాని నిజానికి మనవి కష్టాలు అంటారా ?*

*ఇంద్రుడు అంతటివాడు శాపం తట్టుకోలేక,వెళ్లి తామరతూడులో దాక్కున్నాడు *

*నహుషుడు శాపం వలన తొండగా మారిపోయాడు*

*హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడుప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయిగాడిదగా మారి ఊక తిన్నాడు 

*పాండవులు అడవుల పాలయ్యారు.వేరేవాడి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలను మేపారు. వంటలు వండారు. సేవ చేశారు *

*నలుడు భార్యని కూడా కోల్పోయితన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు *

*దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు *

*రాముడంతటి వాడె భార్యతోఅడవుల్లో కాలం గడపవలసి వచ్చింది *

*శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కుంటూ నే ఉన్నాడు *

*అనేకమంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు, ఎందఱో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటిమాటికి దాడులు చేశారు.చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే.. చూస్తూ ఉండిపోయాడు *

*అయన భార్యలని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది*

*సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలింది *

*పెళ్లైంది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి దృతరాష్ట్రుడి తో సహా అగ్నీకీలల్లో ఆహుతై పోయింది*

*ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు*

*అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు. వీటి ముందు మనకి వచ్చే చిన్ని చిన్ని కష్టాలు ఓ లేక్కంటారా ? కానేకాదు *

*ప్రతీది కాలం నిర్ణయిస్తుంది, నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది*

*సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది *

*అది కష్టం అయినా సుఖం అయినా,ఓపిక తో ఉండాలి,ధైర్యంగా ఎదుర్కోవాలి, లక్ష్యాన్ని సాధించాలి*

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...